ఒక నిర్మాత 100 కోట్ల ఫైనాన్స్ తీసుకుంటే ఎంత వడ్డీ కట్టాలో తెలుసా?
సినిమా నిర్మాణ రంగంలో ఒక ప్రాజెక్ట్ సజావుగా సాగడానికి... నిధులు ఎలా సమకూరుతాయనే దానిపై దిల్ రాజు స్పష్టమైన విశ్లేషణ ఇచ్చారు.
By: Sivaji Kontham | 29 Jun 2026 3:02 PM ISTచిత్ర పరిశ్రమలో ఫైనాన్స్ తెచ్చి సినిమాలు తీయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. వెండితెరపై కనిపించే గ్లామర్ వెనుక నిర్మాతలు పడే ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిడులు వర్ణనాతీతం. సినిమాను నమ్ముకుని, భారీగా అప్పులు చేసి.. చివరకు సొంత ఆస్తులను తణఖా పెట్టి రోడ్డున పడ్డ నిర్మాతలు ఎంతోమంది ఉన్నారు. ప్రస్తుత కాలంలో ఫైనాన్స్ వ్యవహారాలు కొంతవరకు ఫర్వాలేదనిపించినా.. ఒకప్పుడు చిత్ర పరిశ్రమలో ఫైనాన్సియర్లు ఏకంగా 36 శాతం వడ్డీ వసూలు చేసేవారని అగ్ర నిర్మాత దిల్ రాజు ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. నాటి రోజుల్లో ఉన్న 36 శాతం వడ్డీ రేటు, ఇప్పుడు మెల్లిమెల్లిగా తగ్గుతూ ప్రస్తుతానికి 24 శాతానికి వచ్చిందని ఆయన తెలిపారు.
సినిమా నిర్మాణ రంగంలో ఒక ప్రాజెక్ట్ సజావుగా సాగడానికి... నిధులు ఎలా సమకూరుతాయనే దానిపై దిల్ రాజు స్పష్టమైన విశ్లేషణ ఇచ్చారు. ఒక సినిమాను పట్టాలెక్కించడానికి ప్రధానంగా నాలుగు రూపాల్లో డబ్బు వస్తుందని చెప్పారు. అందులో మొదటిది నిర్మాతల `సొంత పెట్టుబడి` కాగా, రెండవది `బ్యాంక్ వనరులు`. ఇక మూడవది సినిమా విడుదలకు ముందే డిజిటల్, శాటిలైట్ వంటి రూపాల్లో జరిగే `నాన్-థియేట్రికల్ బిజినెస్` ద్వారా వచ్చే రెవెన్యూ కాగా, నాలుగవది బయట మార్కెట్ నుండి తెచ్చే `ఫైనాన్స్`. ఈ నాలుగు మార్గాల ద్వారానే ఒక పెద్ద ప్రాజెక్ట్‌కు కావలసిన బడ్జెట్ సమకూరుతుందని ఆయన వివరించారు.
ఈ క్రమంలో బ్యాంకులు నిర్మాతలకు ఏ ప్రాతిపదికన రుణాలు ఇస్తాయనే ప్రశ్నకు దిల్ రాజు సమాధానమిస్తూ.. బ్యాంకులు కేవలం ఆస్తులను చూసి మాత్రమే లోన్స్ ఇస్తాయని... నిర్మాతలు తమ పర్సనల్ ఆస్తులను తణఖా పెట్టి ఈ నిధులు పొందాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఉదాహరణకు ఒక సినిమా బడ్జెట్ 200 కోట్లు అనుకుంటే, అందులో 100 కోట్లు ఫైనాన్స్ రూపంలోనే ఉంటుందని లెక్కలతో సహా వివరించారు. అనుభజ్ఞులైన దిల్ రాజు చెప్పిన 24 శాతం వడ్డీ లెక్క ప్రకారం చూసినా... ఒక నిర్మాత 100 కోట్ల ఫైనాన్స్ తీసుకుంటే కేవలం వడ్డీ రూపంలోనే సంవత్సరానికి ఏకంగా 24 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని... ఇది నిజంగా తలకు మించిన భారమేనని ఆయన చెప్పిన విషయాలు షాకిస్తున్నాయి.
సినిమా ఇండస్ట్రీలో అందరికీ డబ్బులు సకాలంలో అందుతాయని.. కానీ ఒక నిర్మాత పరిస్థితి మాత్రం ఎప్పుడూ ఆశించిన విధంగా ఉండదని దిల్ రాజు వ్యాఖ్యానించారు. ఇండస్ట్రీలో ఫస్ట్ సేఫ్ జోన్ లో ఉండేది యాక్టర్లు, టెక్నీషియన్లు, వడ్డీలకు డబ్బులిచ్చే ఫైనాన్సియర్లు మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు. వీరందరికీ రావలసిన చెల్లింపులు పూర్తి చేసి... అప్పులన్నీ తీర్చిన తర్వాతే థియేట్రికల్, నాన్-థియేట్రికల్ రూపంలో లాభాలు వస్తే.. అందులో చిట్టచివరిగా మిగిలేది మాత్రమే నిర్మాతకు దక్కుతుందని చెప్పారు. దిల్ రాజు ఇచ్చిన ఈ ప్రాక్టికల్ విశ్లేషణను బట్టి చూస్తే... ఈ గ్లామర్ ఫీల్డ్ లో నిర్మాత పడే కష్టం... రిస్క్ ఎంత ఎక్కువగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.
దిల్ రాజు అనుభవాల ప్రకారం.. ఈ చేదు నిజాలు విన్న తర్వాత... సినిమా ప్రొడక్షన్ అనేది బయటకు కనిపించేంత ఈజీ కాదనే విషయం స్పష్టమవుతోంది. కోట్లాది రూపాయల వడ్డీల భారాన్ని మోస్తూ...నటీనటులు ... సాంకేతిక నిపుణుల రెమ్యూనరేషన్లను భరిస్తూ...సినిమా సక్సెస్ కోసం సర్వస్వం పణంగా పెట్టే నిర్మాత ధైర్యం సామాన్యమైనది కాదని అర్థం చేసుకోవాలి. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ ఏడాది వరుసగా నాలుగైదు సినిమాలను నిర్మిస్తూ ఉన్నారంటే.. భారీగా ఫైనాన్స్ పైనా ఆధారపడాల్సి ఉంటుందని కూడా అర్థమవుతోంది.
