Begin typing your search above and press return to search.

సేఫ్ హ్యాండ్స్ నుంచి షాక్‌ల వరకు!

ఒకప్పుడు టాలీవుడ్‌లో సేఫ్ హ్యాండ్స్ అంటే గుర్తొచ్చే మొద‌టి పేరు దిల్ రాజుదే. నిర్మాతగా మాత్రమే కాదు, డిస్ట్రిబ్యూటర్‌గా కూడా ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలాసార్లు ఇండస్ట్రీ ట్రెండ్‌ను మార్చాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   9 May 2026 12:23 PM IST
సేఫ్ హ్యాండ్స్ నుంచి షాక్‌ల వరకు!
X

ఒకప్పుడు టాలీవుడ్‌లో సేఫ్ హ్యాండ్స్ అంటే గుర్తొచ్చే మొద‌టి పేరు దిల్ రాజుదే. నిర్మాతగా మాత్రమే కాదు, డిస్ట్రిబ్యూటర్‌గా కూడా ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలాసార్లు ఇండస్ట్రీ ట్రెండ్‌ను మార్చాయి. ముఖ్యంగా నైజాం మార్కెట్‌లో ఆయన ఆధిపత్యం దాదాపు రెండు దశాబ్దాల పాటూ కొనసాగింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. వరుస ఫ్లాపులు, తప్పుతున్న లెక్కలు, తగ్గుతున్న థియేట్రికల్ క‌లెక్ష‌న్లు దిల్ రాజును కూడా ఒత్తిడిలోకి నెట్టేశాయనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. ఒకప్పుడు చిన్న సినిమాను కూడా హిట్ చేసే సామర్థ్యం ఉన్న డిస్ట్రిబ్యూటర్‌గా పేరు తెచ్చుకున్న రాజుకు ఇప్పుడు పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలు కూడా లాభాలు ఇవ్వకపోవడం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది.

ఊర‌టనిచ్చిన సంక్రాంతికి వ‌స్తున్నాం!

గతేడాది నిర్మాతగా వచ్చిన గేమ్ చేంజర్, తమ్ముడు వంటి సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద భారీ డిజాస్ట‌ర్లుగా నిలిచాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా మాత్రమే కొంత ఊరటనిచ్చింది. కానీ డిస్ట్రిబ్యూషన్ పరంగా పరిస్థితి ఇంకా క్లిష్టంగా మారింది. ఇటీవల శర్వానంద్ నటించిన బైకర్ సినిమాను దిల్ రాజు భారీ రేటుకే కొనుగోలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమా కంటెంట్ పరంగా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వ‌ద్ద మాత్రం ఆశించిన స్థాయిలో ఆడియ‌న్స్ ను మెప్పించ‌లేక‌పోయింది. దీంతో పాజిటివ్ టాక్ ఉన్నా కలెక్షన్స్ రావడం లేద‌నే కొత్త సమస్య మరింత స్పష్టమైంది. సోషల్ మీడియాలో హైప్, రివ్యూలు, ప్రమోషన్స్ ఉన్నా ప్రేక్షకుడు మాత్రం ఓటీటీలో చూసేద్దాం అనే మైండ్‌సెట్‌కు వెళ్లిపోవడం మిడ్ రేంజ్ సినిమాలకు పెద్ద దెబ్బగా మారింది.

కొత్త డిస్ట్రిబ్యూట‌ర్ల ఎంట్రీతో పెరిగిన ఒత్తిడి

ఇదే సమయంలో నైజాం మార్కెట్‌లో కొత్త డిస్ట్రిబ్యూట‌ర్ల ఎంట్రీ కూడా దిల్ రాజుపై ఒత్తిడి పెంచుతున్న అంశంగా కనిపిస్తోంది. మైత్రీ, సితార, ఏషియన్ వంటి సంస్థలు డిస్ట్రిబ్యూష‌న్ రంగంలో అగ్రెసివ్‌గా అడుగులు వేస్తుండటంతో పోటీ మ‌రింత తీవ్రమైంది. ఈ ఆధిపత్య పోరులో భాగంగానే దిల్ రాజు కూడా ఫ్యాన్సీ రేట్లకు సినిమాలు కొనుగోలు చేస్తున్నారని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఆ స్ట్రాటజీ ఇప్పుడు బూమరాంగ్ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. గాయపడ్డ సింహం వంటి చిన్న సినిమాలకూ భారీ పెట్టుబడులు పెట్టి రిలీజ్ చేయడం, చివరికి పెట్టుబడి కూడా తిరిగి రాకపోవడం డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ ఎంత డేంజ‌ర‌స్ సిట్యుయేష‌న్ లో ఉందో తెలియజేస్తోంది.

అయితే ఇప్పుడు దిల్ రాజు మళ్లీ పాత ఫామ్‌లోకి రావాలంటే ఏం చేయాలనేది ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌గా మారింది. ఒకప్పుడు కంటెంట్ సెలక్షన్ విషయంలో ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. చిన్న కథల్లోనూ కమర్షియల్ పాయింట్ గుర్తించి స‌క్సెస్‌లు అందుకున్నారు. కానీ ఇప్పుడ‌దే జడ్జ్‌మెంట్ పనిచేయడం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే ఇకపై భారీ రేట్లకు సినిమాలు కొనడం తగ్గించి, కంటెంట్‌కు తగ్గ బడ్జెట్‌, రియలిస్టిక్ బిజినెస్ మోడల్ వైపు వెళ్లాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు. దిల్ రాజు పరిస్థితి ఇప్పుడు కేవలం ఒక నిర్మాత లేదా డిస్ట్రిబ్యూటర్ సమస్యగా మాత్రమే కనిపించడం లేదు. ఇది మొత్తం టాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభానికి ప్రతిబింబంగా మారింది. వరుస నష్టాలు కంటిన్యూ అయితే ఫ్యూచ‌ర్ లో నిర్మాతల కంటే ముందుగా డిస్ట్రిబ్యూటర్లే భారీ ప్రమాదంలో పడే అవకాశముందనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.