యష్‌తో సినిమా ఓకే.. కానీ..
ఇక్కడ దిల్ రాజుకు ఒక అడ్వాంటేజ్ మాత్రం ఉంది. ఆయన దగ్గర కొత్త దర్శకుల నుంచి స్టార్ దర్శకుల వరకు చాలా పరిచయాలు ఉన్నాయి.
By: M Prashanth | 23 Aug 2026 9:36 AM IST‘టాక్సిక్’ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దిల్ రాజు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. యష్‌తో భవిష్యత్తులో సినిమా చేస్తానని ఆయన ఓపెన్‌గా చెప్పారు. కానీ వెంటనే జరిగే ప్రాజెక్ట్ మాత్రం కాదని, యష్ లైనప్ వల్ల కొంత టైమ్ పట్టొచ్చని కూడా హింట్ ఇచ్చారు. అక్కడితో కాంబినేషన్ మీద క్లారిటీ వచ్చింది కానీ.. ఇప్పుడు అసలు ఆసక్తి ఆ సినిమాను ఎవరి చేతిలో పెడతారన్నదే.
దిల్ రాజు దగ్గర తెలుగు దర్శకులతో మంచి నెట్‌వర్క్ ఉంది. అదే సమయంలో ఇతర భాషల దర్శకులతో కూడా పెద్ద సినిమాలు చేసిన అనుభవం ఉంది. కాబట్టి యష్ సినిమా అంటే తప్పనిసరిగా తెలుగు దర్శకుడే ఉండాలని ఇప్పుడే చెప్పలేం. యష్ రేంజ్‌కు సరిపోయే కథ ఎవరి దగ్గర ఉంటే వాళ్లతో వెళ్లే అవకాశమే ఎక్కువగా ఉంటుంది.
పైగా ‘కేజీఎఫ్’ తర్వాత యష్ సినిమాల ఎంపిక కూడా చాలా నెమ్మదిగా జరుగుతోంది. ‘టాక్సిక్’ కోసం గీతూ మోహన్‌దాస్‌ను ఎంచుకోవడమే అందుకు ఉదాహరణ. రెగ్యులర్ మాస్ డైరెక్టర్ దగ్గరకు వెళ్లకుండా పూర్తిగా వేరే టచ్ ఉన్న దర్శకురాలితో సినిమా చేశారు. అంటే దిల్ రాజు ప్రాజెక్ట్‌కూ పేరున్న తెలుగు దర్శకుడే కావాలి అనే లెక్క కంటే, కథ ముందు సెట్ కావాల్సి ఉంటుంది.
ఇక్కడ దిల్ రాజుకు ఒక అడ్వాంటేజ్ మాత్రం ఉంది. ఆయన దగ్గర కొత్త దర్శకుల నుంచి స్టార్ దర్శకుల వరకు చాలా పరిచయాలు ఉన్నాయి. ఒక కథ యష్‌కు బాగా సరిపోతుందని అనిపిస్తే దాన్ని సరైన దర్శకుడితో కలపడం ఆయనకు కొత్త విషయం కాదు. యష్ కూడా ఇప్పుడు ఒక సినిమా ఓకే చేశాక త్వరగా మరోటి మొదలుపెట్టే హీరో కాదు. ‘టాక్సిక్’ తర్వాత కూడా ఆయనకు ఇతర కమిట్‌మెంట్స్ ఉన్నాయి.
అందుకే ఈ ప్రాజెక్ట్‌కు టైమ్ దొరకొచ్చు. ఆలోపు కథ, దర్శకుడు, స్కేల్ అన్నీ సెట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికైతే యష్ దిల్ రాజు సినిమా ఉంటుందనే మాట మాత్రమే బయటకు వచ్చింది. మిగతా లెక్క అంతా ఇంకా ఓపెన్‌గానే ఉంది. కానీ ఒక విషయం మాత్రం హైలెట్.. యష్ లాంటి స్టార్‌తో సినిమా చేస్తానని దిల్ రాజు ముందే చెప్పేశారు. ఇప్పుడు ఆయన తీసుకురాబోయే కథ ఎవరిది, దాన్ని హ్యాండిల్ చేసే దర్శకుడు ఎవరు అన్నదే తర్వాతి అసలు అప్డేట్.
దిల్ రాజుకు కూడా ఇప్పుడు యష్ సినిమా చిన్న ప్రాజెక్ట్ అయ్యే అవకాశం లేదు. ఆయన కెరీర్‌లో ‘గేమ్ ఛేంజర్’ చాలా పెద్ద బడ్జెట్‌తో చేసిన సినిమాల్లో ఒకటి. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన రిజల్ట్ ఇవ్వలేదు. ఇప్పుడు సల్మాన్ ఖాన్‌తో కూడా భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత యష్‌తో సినిమా నిజంగా సెట్స్‌పైకి వస్తే, బడ్జెట్ పరంగా ‘గేమ్ ఛేంజర్’ను కూడా దాటే ప్రాజెక్ట్ అవుతుంది.
