Begin typing your search above and press return to search.

ప్రతి సినిమాకు కరప్షన్ జరుగుతుంది.. సెట్లో ఖర్చులపై అగ్ర‌నిర్మాత!

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు సినిమాల బడ్జెట్, అలాగే ఇండస్ట్రీలో జరిగే కరప్షన్ (అవినీతి) గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Sivaji Kontham   |   28 Jun 2026 6:00 PM IST
ప్రతి సినిమాకు కరప్షన్ జరుగుతుంది.. సెట్లో ఖర్చులపై అగ్ర‌నిర్మాత!
X

సినీప‌రిశ్ర‌మ‌లో అదుపు త‌ప్పుతున్న‌ నిర్మాణ వ్య‌యం, డ‌బ్బు దుర్వినియోగంపై చాలా చ‌ర్చ సాగుతోంది. ఈరోజుల్లో నిర్మాత కంట్రోల్‌లో ఏదీ లేద‌ని చెబుతుంటారు. కానీ అందుకు ఆస్కారం ఇవ్వ‌కుండా ప్ర‌తిదీ త‌న కంట్రోల్ లో ఉంచుకునే స‌మ‌ర్థుడైన నిర్మాత‌గా దిల్ రాజుకు పేరుంది. అయితే ఆయ‌న కూడా త‌న చేతిలోంచి కొంత చేజారిపోతుంద‌ని చెప్ప‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు సినిమాల బడ్జెట్, అలాగే ఇండస్ట్రీలో జరిగే కరప్షన్ (అవినీతి) గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా ఖర్చులను ఎలా మానిటర్ చేస్తారు? లీకేజీలు, కరప్షన్ జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అని హోస్ట్ అడిగిన ప్రశ్నకు ఆయన చాలా ఓపెన్‌గా స్పందించారు. ప్రతి సినిమాకు కరప్షన్ అనేది జరుగుతుంది.. ప్రొడ్యూసర్ మనీ అంటే అందరికీ చులకన! అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తాను సినిమాల్లో ఫుల్ ప్లెడ్జ్‌గా ఇన్వాల్వ్ అయి ఉంటానని.. తన టీమ్ అంతా ఎల్లప్పుడూ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి తమ సినిమాల దగ్గర డ్యామేజ్ చాలా తక్కువగా ఉంటుందని దిల్ రాజు పేర్కొన్నారు. అయితే తాము ఇన్వాల్వ్ అయినా కొంత డ్యామేజ్ అనేది క‌చ్చితంగా ఉంటుందని అంగీకరించారు. అదే నిర్మాత‌ కంట్రోల్ లేని సినిమాల్లో ఈ డ్యామేజ్ ఇంకా చాలా ఎక్కువగా ఉంటుందని.. రేపటి షూటింగ్‌కి ఏం కావాలో లాస్ట్ మినిట్‌లో అడగడం వల్ల ఖర్చులు విపరీతంగా పెరుగిపోతాయని వివరించారు.

చివ‌రి నిమిషంలో అడ‌గ‌డం వ‌ల్ల ద‌ర్శ‌కుడు అనుకున్నది రాకుంటే షూటింగ్ ఆగిపోతుందని.. తద్వారా లొకేషన్ కాస్ట్ కూడా పెరిగిపోతుందని దిల్ రాజు తెలిపారు. సినిమాలో నిజమైన ఖర్చు ఎంత, తినే ఖర్చు ఎంత అనేదానికి ఆయన ఒక ఉదాహరణ ఇస్తూ.. నిజమైన ఖర్చు 1 రూపాయి ఉంటే, లీకేజీలు, ఇతర ఖర్చుల వల్ల అది 2 రూపాయలు అయిపోతుందని చెప్పారు. సినిమా ఇండస్ట్రీలోని ప్రతి డిపార్ట్‌మెంట్‌లోనూ ఇలాంటి లీకేజీలు ఉన్నాయని ఆయన స్పష్టంగా చెప్పారు.

ఈ క్రమంలో ప్రొడ్యూసర్‌కు - డైరెక్టర్‌కు మధ్య చిన్న రిఫ్ట్ (గొడవ) ఏమైనా వస్తే.. ఆ లీకేజీలను ఇంకా ఎక్కువగా వాడుకుంటారా? అనే ప్రశ్నకు దిల్ రాజు ``క‌చ్చితంగా వాడుకుంటారు`` అని సమాధానమిచ్చారు. దర్శకుడు పూరి జగన్నాథ్ గారికి ఇవన్నీ బాగా తెలుసు కాబట్టే ఆయన `నేనింతే` సినిమా తీశారని దిల్ రాజు గుర్తుచేశారు. ఆ సినిమాలో చూపించిన కంటెంట్ జనాలకు సంబంధించింది కాదని... అది పక్కా సినిమా ఇండస్ట్రీలో జరిగే కంటెంట్ అని, ఇక్క‌డ ఏం జ‌రుగుతోందో దానినే ఆయన సినిమా రూపంలో చూపించారని పేర్కొన్నారు. నిర్మాత‌గా ద‌శాబ్ధాల సుదీర్ఘ అనుభ‌వం ఉన్న దిల్ రాజు ఈ మాట అన్నారంటే కొత్త నిర్మాత‌ల‌కు ఖ‌ర్చు ఎలా అదుపు త‌ప్పుతుందో అంచ‌నా వేయొచ్చు.

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు 2026లో పలు ఆసక్తికరమైన చిత్రాలను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్థన, అలాగే ఎల్లమ్మ, దేత్తడి వంటి ప్రాజెక్ట్‌లు ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్నాయి. వీటితో పాటు బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్, విద్యాబాలన్ ప్రధాన పాత్రల్లో అనీస్ బజ్మీ దర్శకత్వంలో నిర్మిస్తున్న భారీ ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని 4 డిసెంబర్ 2026న విడుదలకు తెస్తున్నారు. అలాగే దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ హీరోగా ఆదిత్య రావు గంగసాని దర్శకత్వంలో SVC 60 చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. సల్మాన్ ఖాన్‌తో వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో నిర్మిస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రం (SVC 63) ముంబైలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.