Begin typing your search above and press return to search.

దర్శకుడికి బంపరాఫర్.. హీరోగా మారుస్తానంటున్న దిల్ రాజు

నేటి కాలంలో `లవ్ టుడే` వంటి చిత్రాలతో ప్రదీప్ రంగనాథన్ దర్శకుడిగా.. హీరోగా ఎలాగైతే తన సత్తా చాటుతున్నారో అనిల్ రావిపూడి కూడా అదే స్థాయిలో రాణించగలరని దిల్ రాజు ధీమా వ్యక్తం చేశారు.

By:  Sivaji Kontham   |   6 April 2026 10:17 AM IST
దర్శకుడికి బంపరాఫర్.. హీరోగా మారుస్తానంటున్న దిల్ రాజు
X

టాలీవుడ్ అగ్ర నిర్మాత‌ దిల్ రాజు తాజాగా ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశారు. తమిళ దర్శకుడు, నటుడు ప్రదీప్ రంగనాథన్ నటించిన `లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ` (ఎల్ఇకే) ప్రీ-రిలీజ్ వేడుకలో ఆయన మాట్లాడుతూ.. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిలో అద్భుతమైన నటుడు ఉన్నారని ప్రశంసించారు. అనీల్ కథలు చెప్పేటప్పుడే ఆయనలోని నటన కనిపిస్తుందని.. సరైన సమయం చూసి తానే స్వయంగా అనిల్‌ను హీరోగా పరిచయం చేస్తానని ఒక బహిరంగ ఆఫర్ ఇచ్చారు.

నేటి కాలంలో `లవ్ టుడే` వంటి చిత్రాలతో ప్రదీప్ రంగనాథన్ దర్శకుడిగా.. హీరోగా ఎలాగైతే తన సత్తా చాటుతున్నారో అనిల్ రావిపూడి కూడా అదే స్థాయిలో రాణించగలరని దిల్ రాజు ధీమా వ్యక్తం చేశారు. అనిల్ రావిపూడి బాడీ లాంగ్వేజ్, టైమింగ్ చూస్తే ఆయనకు హీరోగా మంచి భవిష్యత్తు ఉంటుందని స‌ర‌దాగా న‌వ్వేస్తూ ఆఫ‌ర్ ఇచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో .. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఎందుకంటే అనిల్ తన సినిమాల్లో ఇప్పటికే అప్పుడప్పుడు అతిథి పాత్రల్లో మెరిసి ప్రేక్షకులను అలరించారు.

అయితే దిల్ రాజు ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్‌పై అనిల్ రావిపూడి తనదైన శైలిలో స్పందించారు. తనపై నమ్మకంతో దిల్ రాజు గారు ఇచ్చిన ఈ ఆఫర్ చాలా సంతోషాన్ని కలిగించిందని చెబుతూనే.. ప్రస్తుతానికి తనకు నటనపై ఎలాంటి ఆసక్తి లేదని సున్నితంగా తిరస్కరించారు. తన పూర్తి దృష్టి దర్శకత్వంపైనే ఉందని మరిన్ని మంచి కథలను వెండితెరకు అందించడమే తన లక్ష్యమని అనిల్ స్పష్టం చేశారు. దీంతో దిల్ రాజు ఆఫర్ కు అనిల్ `నో` చెప్పినట్లయింది.

ఇక విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వస్తున్న `లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ` చిత్రం గురించి దిల్ రాజు మాట్లాడుతూ.. ఈ రోజుల్లో కొత్తగా ప్రేమకథలు తీయడం ఒక సవాల్ అని పేర్కొన్నారు. ఒక అప్లికేషన్ బ్యాక్‌డ్రాప్‌లో ఎంతో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించారని.. ఇది ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని కొనియాడారు.

మొత్తానికి దర్శకులు నటులుగా మారే ట్రెండ్ పెరుగుతున్న తరుణంలో దిల్ రాజు- అనిల్ రావిపూడి మధ్య జరిగిన ఈ సంభాషణ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అనిల్ హీరోగా మారకపోయినా.. అత‌డు దర్శకత్వంలో మిరాకిల్స్ చేయాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు. అనీల్ రావిపూడి, దిల్ రాజు లాంటి దిగ్గ‌జాలు అతిథులుగా పాల్గొన్న ఈ వేడుకతో `లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ` సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా ఈ చిత్రంలోని ఏఐ టెక్నాలజీ రోబో.. కొత్త తరహా కథాంశంపైనా సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు.