Begin typing your search above and press return to search.

దిల్ రాజుకు పెద్ద షాకిచ్చిన మూవీ ఏంటి?

టాలీవుడ్‌ లో తిరుగులేని నిర్మాతగా పేరు సంపాదించిన దిల్ రాజు, డిస్ట్రిబ్యూటర్‌ గా తన కెరీర్‌ ను స్టార్ట్ చేసి నేడు స్టార్ ప్రొడ్యూసర్స్ లో ఒకరిగా ఎదిగారు.

By:  M Prashanth   |   27 April 2026 12:06 AM IST
దిల్ రాజుకు పెద్ద షాకిచ్చిన మూవీ ఏంటి?
X

టాలీవుడ్‌ లో తిరుగులేని నిర్మాతగా పేరు సంపాదించిన దిల్ రాజు, డిస్ట్రిబ్యూటర్‌ గా తన కెరీర్‌ ను స్టార్ట్ చేసి నేడు స్టార్ ప్రొడ్యూసర్స్ లో ఒకరిగా ఎదిగారు. పెద్ద బడ్జెట్ సినిమాలతో పాటు చిన్న చిత్రాలు కూడా ఈక్వల్ గా ఎంకరేజ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తెలుగు మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా తన మార్క్ చూపించాలని ఆయన ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటివరకు ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన దిల్ రాజుకు, కెరీర్‌ లో ఎదురైన పెద్ద గాయం ఏంటన్న ప్రశ్న తాజాగా ఆసక్తికరంగా మారింది. ఆ ప్రశ్న ఆయన ముందుకు రావడానికి కారణం గాయపడ్డ సింహం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్. తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ఆ సినిమాలో ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగా కనిపిస్తున్నారు.

దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఆ చిత్రంలో జేడీ చక్రవర్తి కీలక పాత్ర పోషించగా, శ్రీవిష్ణు ప్రత్యేక పాత్రలో మెరవనున్నారు. పవన్ సాధినేని సమర్పణలో సప్తస్వ మీడియా వర్క్స్, పీఓవీ స్టోరీస్, జీ స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మించాయి. మే 1న మూవీ థియేటర్లలో విడుదల కానుండగా, రీసెంట్ గా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ కు దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆ వేడుకలో మాట్లాడిన దిల్ రాజు సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "సినిమాలో ఇద్దరు హీరోలే కాకుండా ప్రభాస్, మహేష్ బాబు, సిద్ధార్థ, యష్, అర్జున్ రెడ్డి కూడా ఉన్నారు. వారిని కథలో చాలా వినూత్నంగా ఉపయోగించారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌ లో ఐదు ఎపిసోడ్స్ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తాయి. అవి వర్కౌట్ అయితే సినిమా మరో జాతిరత్నాలుగా మారుతుంది" అని తెలిపారు.

ఆ తర్వాత యాంకర్ అడిగిన ఒక ప్రశ్న అందరి దృష్టిని ఆకర్షించింది. "మీరు జీవితంలో ఎక్కువగా గాయపడ్డ సందర్భం ఏది?" అని అడగగా, దిల్ రాజు నవ్వుతూ సమాధానం ఇచ్చారు. "సినిమా ప్లాప్ అయితే గాయపడతా. మనం డబ్బులు పెట్టి సినిమా తీస్తాం కాబట్టి అది హిట్ అయితే ఆనందం. కానీ ఫలితం రాకపోతే బాధగా ఉంటుంది" అని చెప్పారు.

మరి "ఎక్కువగా గాయపరిచిన సినిమా ఏది?" అని అడిగితే మాత్రం ఆయన చెప్పలేదు. "నేను ఏ సినిమా పేరు చెప్పినా ఇక్కడ ఉన్న మీడియా వాళ్లు వెంటనే ఆ హీరోతో నాకు గొడవ పెట్టేలా చేస్తారు" అంటూ సరదాగా స్పందించి అందరినీ నవ్వించారు. దిల్ రాజు సమాధానం చూస్తే.. నిర్మాతగా సక్సెస్ లు ఎంత ముఖ్యమో, అదే విధంగా ఫ్లాపులు కూడా ఎంత బాధ కలిగిస్తాయో అర్థమవుతోంది. ఇండస్ట్రీలో హిట్లు, ఫ్లాపులు సహజమే అయినా, ప్రతి రిజల్ట్ నిర్మాతపై ఎంత ప్రభావం చూపుతుందో క్లియర్ గా తెలుస్తోంది.