ఓటీటీ ఎఫెక్ట్ ఉన్నా.. దిల్ రాజు ధైర్యమేంటి?
ఒకప్పుడు భారీ సినిమాల థియేట్రికల్ హక్కుల కోసం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఓటీటీలు వచ్చాక ప్రేక్షకుల అలవాట్లు మారాయి.
By: M Prashanth | 16 July 2026 12:22 AM ISTఒకప్పుడు భారీ సినిమాల థియేట్రికల్ హక్కుల కోసం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఓటీటీలు వచ్చాక ప్రేక్షకుల అలవాట్లు మారాయి. చిన్న సినిమాలే కాదు, కొన్ని పెద్ద చిత్రాలు విడుదలైన కొద్ది వారాల్లోనే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. అలాంటి సమయంలో వంద కోట్లకు పైగా పెట్టుబడులతో థియేట్రికల్ హక్కుల కోసం ముందుకు రావడం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే ఆ విషయంలో దిల్ రాజు మాత్రం ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు.
టాలీవుడ్ లో నిర్మాతగా ఎంత పేరు సంపాదించారో, అంతకంటే ముందే ఆయన డిస్ట్రిబ్యూటర్ గా తన ముద్ర వేశారు. దాదాపు మూడు దశాబ్దాలుగా మార్కెట్ ను దగ్గరగా గమనిస్తున్న ఆయనకు ప్రేక్షకుల టేస్ట్, ప్రాంతాల వారీగా సినిమా బిజినెస్ ఎలా జరుగుతుందో స్పష్టమైన అవగాహన ఉంది. అందుకే చాలా మంది రిస్క్ గా భావించే డీల్స్ ను కూడా ఆయన ధైర్యంగా చేస్తుంటారు.
ఓటీటీల ఎఫెక్ట్ వల్ల మిడ్ రేంజ్ సినిమాల థియేట్రికల్ మార్కెట్ కొంత దెబ్బతిన్నా, భారీ ఈవెంట్ సినిమాల పరిస్థితి మాత్రం వేరుగా ఉందని టాక్ వినిపిస్తోంది. స్టార్ హీరోలు, భారీ బడ్జెట్, పాన్ ఇండియా స్థాయి హైప్ ఉన్న చిత్రాలు ఇప్పటికీ థియేటర్లకు ప్రేక్షకులను రప్పిస్తున్నాయి. ఆ విషయాన్ని దిల్ రాజు ముందుగానే గుర్తించినట్లు కనిపిస్తోంది. అందుకే పెద్ద సినిమాల విషయంలో ఆయన పెట్టుబడులు తగ్గించడం లేదు.
దిల్ రాజు కేవలం సినిమా పేరును చూసి నిర్ణయం తీసుకునే వ్యక్తి కాదు. హీరో మార్కెట్, దర్శకుడి ట్రాక్ రికార్డు, రిలీజ్ టైమింగ్, పోటీ పరిస్థితులు, ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు.. ఇలా అనేక అంశాలను లెక్కలోకి తీసుకున్న తర్వాతే డీల్ క్లోజ్ చేస్తారని అంతా చెబుతుంటారు. అందుకే భారీ మొత్తాలు కనిపించినా, వాటి వెనుక ఆయనకు కనిపించే లెక్కలు వేరుగా ఉంటాయని అంటున్నారు. మరో ముఖ్యమైన అంశం ఆయనకు ఉన్న నెట్ వర్క్.
ముఖ్యంగా నైజాం ప్రాంతంలో దశాబ్దాలుగా నిర్మించుకున్న వ్యవస్థ వల్ల థియేట్రికల్ బిజినెస్ పై ఆయనకు పట్టు ఉంది. ఏ సినిమా ఎక్కడ ఎంత వరకు పనిచేస్తుందనే అంచనాలను ఇతరుల కంటే మెరుగ్గా వేయగలరనే పేరు కూడా ఉంది. అదే ఆయన ధైర్యానికి ప్రధాన కారణంట. నిజానికి ఓటీటీల యుగంలో చాలా మంది రిస్క్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దిల్ రాజు మాత్రం ఇంకా థియేటర్ల మాయ తగ్గలేదని నమ్ముతున్నట్లు కనిపిస్తున్నారు.
ప్రేక్షకులు ఇంట్లో కంటెంట్ చూస్తున్నా, భారీ సినిమాలను మాత్రం స్క్రీన్ పై చూడాలనే ఆసక్తి ఇప్పటికీ ఉందనే విశ్వాసంతో ముందుకు వెళ్తున్నట్లు ఉన్నారు. అందుకే ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతోంది. ఓటీటీలు మార్కెట్ ను మార్చినా, థియేట్రికల్ బిజినెస్ పై దిల్ రాజు నమ్మకం మాత్రం ఎందుకు తగ్గడం లేదు? అనుభవంతో కూడిన ధైర్యమా, మార్కెట్ పై పట్టా, లేక పెద్ద సినిమాలపై ఉన్న విశ్వాసమా? ఏదైనా కావొచ్చు.. కానీ పెద్ద సినిమాల డీల్స్ విషయంలో దిల్ రాజు మాత్రం దూసుకుపోతున్నారనే చెప్పాలి.
