Begin typing your search above and press return to search.

'ఫ్యామిలీ స్టార్' దెబ్బ.. విజయ్‌తో దిల్ రాజు ఈసారి మరోలా!

‘ఫ్యామిలీ స్టార్’ నిరాశపరిచినా విజయ్ దేవరకొండతో దిల్ రాజు ‘రౌడీ జనార్ధన’ తెరకెక్కిస్తున్నారు. ఈసారి విజయ్‌ను కొత్త తరహా ప్రాపర్ మాస్ క్యారెక్టర్‌లో చూపించనున్నట్లు తెలిపారు. ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు ‘ఎల్లమ్మ’, ఆశిష్‌తో ‘దేత్తడి’ సినిమాలను కూడా కొత్త దర్శకులతో నిర్మిస్తున్నారు.

By:  M Prashanth   |   13 Nov 2026 7:19 PM IST
ఫ్యామిలీ స్టార్ దెబ్బ.. విజయ్‌తో దిల్ రాజు ఈసారి మరోలా!
X

ఒక హీరోతో సినిమా చేసి నష్టపోతే మళ్లీ అదే హీరోతో ప్రాజెక్ట్ చేయడానికి నిర్మాతలు కాస్త ఆలోచిస్తారు. కానీ దిల్ రాజు మాత్రం విజయ్ దేవరకొండతో మరో సినిమా చేస్తున్నారు. గతంలో వీళ్ల కాంబినేషన్‌లో వచ్చిన 'ఫ్యామిలీ స్టార్' బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 'రౌడీ జనార్ధన'తో ఆ ఫలితాన్ని మార్చాలని చూస్తున్నారు. అయితే ఈసారి విజయ్ కోసం ఎంచుకున్న కథ, దర్శకుడు ఇద్దరూ డిఫరెంట్ అని దిల్ రాజు చెబుతున్నారు.

ఇటీవల విడుదలైన 'రామాయణం', 'సీన్' సినిమాలను తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇక వాటి సక్సెస్ ప్రెస్‌మీట్‌లో దిల్ రాజు తన కొత్త సినిమాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా 'రౌడీ జనార్ధన' ప్రస్తావన వచ్చినప్పుడు 'ఫ్యామిలీ స్టార్' ఫలితాన్ని కూడా గుర్తుచేశారు. గతంలో ఆశించిన విజయం రాకపోవడంతో ఈసారి విజయ్‌ను ఇప్పటివరకు చేయని ప్రాపర్ మాస్ క్యారెక్టర్‌లో చూపించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. విజయ్‌లో ఉండే ఆటిట్యూడ్, బిహేవియర్‌ను పూర్తిగా ఉపయోగించుకోవాలనేది తమ ప్లాన్ అని చెప్పారు.

'రాజావారు రాణిగారు' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రవికిరణ్ కోలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మొదటి సినిమాలో సింపుల్ లవ్ స్టోరీతో ఆకట్టుకున్న రవికిరణ్ ఇప్పుడు విజయ్‌తో మాస్ సినిమా చేస్తున్నారు. ఒక అప్‌కమింగ్ దర్శకుడితో విజయ్‌ను కొత్తగా చూపించడం తమకు ఛాలెంజ్ అని దిల్ రాజు చెప్పారు. అందుకే ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నట్లు వివరించారు.

నిజానికి విజయ్ దేవరకొండకు మాస్ ఇమేజ్ కొత్తేమీ కాదు. 'అర్జున్ రెడ్డి'లో ఆటిట్యూడ్, రెగ్యులర్ మాస్ సినిమాలకు భిన్నంగా 'లైగర్'లో యాక్షన్ ప్రయత్నించారు. అయితే దిల్ రాజు చెప్పినట్లు విజయ్ ఇప్పటివరకు చేయని మాస్ క్యారెక్టర్ అంటే ఎలా ఉంటుందనేది ఆసక్తికరమే. ముఖ్యంగా విజయ్ సహజమైన బాడీ లాంగ్వేజ్‌ను మార్చకుండా, దానికి తగ్గ కథను ఎంచుకుంటే బాగుంటుందనే అభిప్రాయం ఉంది.

మరోవైపు దిల్ రాజు నిర్మాణంలో 'ఎల్లమ్మ' కూడా తెరకెక్కుతోంది. ఆ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో బాగా రిజిస్టర్ అయిందని, తప్పకుండా బిగ్ మ్యాజిక్ చేస్తామని దిల్ రాజు నమ్మకంగా చెప్పారు. అలాగే ఆశిష్ హీరోగా 'దేత్తడి' అనే మరో సినిమాను కొత్త దర్శకుడితో చేస్తున్నారు. ఈ మూడు ప్రాజెక్టుల్లోనూ కొత్త దర్శకులతో పనిచేస్తుండటం విశేషం.

అయితే కొత్త దర్శకులతో సినిమాలు చేయడం వల్ల నిర్మాతగా తనకు రోజువారీ పని ఎక్కువ అవుతోందని దిల్ రాజు తెలిపారు. స్క్రిప్ట్ నుంచి షూటింగ్ వరకు పలు విషయాలను స్వయంగా చూసుకోవాల్సి వస్తోందన్నారు. ఒకవైపు 'ఎల్లమ్మ', మరోవైపు 'రౌడీ జనార్ధన', 'దేత్తడి' పనులను బ్యాలెన్స్ చేస్తున్నట్లు చెప్పారు. పెద్ద దర్శకులతో కాకుండా కొత్తవాళ్లతో వరుసగా సినిమాలు చేస్తున్న దిల్ రాజుకు ఈసారి ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి.