Begin typing your search above and press return to search.

ఇత‌ర న‌టుల‌ను వ‌దిలేసి దియా వీడియోనే ఎందుకు తొల‌గించారు? ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!

పౌర సంక్షేమం కోసం చేపట్టినా ఈ ప్రచారం వెంట‌నే మున్సిపల్ అధికారులు, అధికార పక్ష నాయకులు, రాజకీయ విశ్లేషకుల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది.

By:  Sivaji Kontham   |   3 Nov 2026 12:28 PM IST
ఇత‌ర న‌టుల‌ను వ‌దిలేసి దియా వీడియోనే ఎందుకు తొల‌గించారు? ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!
X

ముంబై నగర పాలక సంస్థ (బీఎంసీ) పర్యావరణహిత దీపావళి అవగాహన ప్రచారం నుండి నటి దియా మీర్జా వీడియోను మాత్రమే తొలగించడంతో ముంబైలో పెద్ద ఎత్తున రాజకీయ వివాదం చెలరేగింది. పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు పండుగల సమయంలో ట‌పాకాయ‌ల‌ వినియోగాన్ని క్రమబద్ధీకరించాలన్న బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు బీఎంసీ ఈ ప్రచారాన్ని చేపట్టింది. పౌర సంక్షేమం కోసం చేపట్టినా ఈ ప్రచారం వెంట‌నే మున్సిపల్ అధికారులు, అధికార పక్ష నాయకులు, రాజకీయ విశ్లేషకుల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది.

పండుగలను ఎలా జరుపుకోవాలో పౌరులకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని బిజెపి ముంబై అధ్యక్షుడు అమీత్ సతమ్ బహిరంగంగా అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ వివాదం మొదలైంది. ఆయన ప్రకటన వెలువడిన కొద్ది సేపటికే.. ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వకుండానే బీఎంసీ తన అధికారిక సామాజిక మాధ్యమాల నుండి దియా మీర్జా వీడియోను తొలగించింది. అయితే ఇదే ప్రచారంలో పాల్గొన్న మాధురి దీక్షిత్, క్రికెటర్ అజింక్య రహానే, మరాఠీ నటి నిషిగంధ వాడ్ వంటి ఇతర ప్రముఖుల సందేశాలు సోషల్ మీడియాలో అలాగే ఉండటం.. కేవలం దియా మీర్జా వీడియోనే తొలగించడంతో ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

ఈ వీడియోను తొలగించే నిర్ణయాన్ని సమర్థిస్తూ ముంబై మేయర్ రీతూ తావ్డే మాట్లాడారు. దియా మీర్జా వైఖరిని `హిందూ వ్యతిరేకమైనది`గా అభివర్ణించిన మేయర్, త‌ను ఎంచుకున్న విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యతిరేకత నటి మతంతో ముడిపడి ఉన్నది కాదని... గతంలో నర్మదా ప్రాజెక్ట్, యూనిఫాం సివిల్ కోడ్.. స‌హా ప‌లు ప్రభుత్వ విధానాలపై దియా మిర్జా బహిరంగ వైఖ‌రి వల్ల వచ్చిందని తావ్డే స్పష్టం చేశారు. అంతేకాకుండా.. మహాకూటమి ప్రభుత్వంలో భవిష్యత్తులో బీఎంసీ చేపట్టే ఏ ప్రచారంలోనూ దియాకు చోటు లేకుండా బ్లాక్‌లిస్ట్ చేస్తామని కూడా మేయర్ పేర్కొన్నారు.

ఈ విమర్శలపై దియా మీర్జా స్పందిస్తూ.. ప్రజారోగ్య ప్రచారం కోసం తాను ఎలాంటి ఫీజు తీసుకోకుండా ఉచితంగానే ఈ వీడియోను రికార్డ్ కోసం పని చేశానని చెప్పారు. వాయు కాలుష్యం అనేది తీవ్రమైన ప్రజారోగ్య సమస్య అని.. తన సందేశం కేవలం పర్యావరణ స్పృహ, న్యాయస్థాన మార్గదర్శకాలకు అనుగుణంగానే ఉందని వివరించారు. మరోవైపు అధికార పక్షం ప్రజారోగ్య సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని కాంగ్రెస్, శివసేన (యుబిటి) వంటి ప్రతిపక్షాలు విమర్శించాయి. బీఎంసీ పక్షపాతంతో వ్యవహరించిందని తీవ్రంగా మండిపడ్డాయి.

ఈ ఘటన బాలీవుడ్ ప్రముఖులు తమ వ్యక్తిగత అభిప్రాయాలను లేదా సామాజిక వైఖరులను వెల్లడించినప్పుడు తీవ్రమైన రాజకీయ వ్యతిరేకతను, బాయ్‌కాట్ ట్రెండ్స్‌ను ఎదుర్కొంటున్న ప్రస్తుత ధోరణిని ఎత్తిచూపుతోంది. నసీరుద్దీన్ షా, ప్రకాష్ రాజ్, దీపికా పదుకొణె వంటి ప్రముఖ నటులు కూడా గతంలో సామాజిక అంశాలు లేదా పౌర హక్కుల నిరసనలలో పాల్గొన్నందుకు అధికార పక్ష నేతల నుండి ఇలాంటి విమర్శలనే ఎదుర్కొన్నారు. పౌర అవగాహన ప్రచారాలు రాజకీయ వివాదాలతో ముడిపడిపోతున్న తరుణంలో.. ఈ సంఘటన ప్రముఖుల సామాజిక బాధ్యత.. పర్యావరణ అంశాల‌పై నియంత్రణలు.. రాజకీయ సమీకరణల మధ్య నెలకొన్న ఉద్రిక్తతకు అద్దం పడుతోంది.