Begin typing your search above and press return to search.

అమ్మాయిలకు భద్రత కావాలా? అయితే మీ అబ్బాయిలను ఇలా పెంచండి!

వినోద రంగం సమాజంపై చూపే ప్రభావాన్ని ప్రస్తావించారు. తెరపై చూపించే పాత్రలు, కథనాలు సమాజంలో కొత్త ఆలోచనలకు దారితీస్తాయని వెల్లడించారు.

By:  Srikanth Kontham   |   30 Sept 2026 3:53 PM IST
అమ్మాయిలకు భద్రత కావాలా? అయితే మీ అబ్బాయిలను ఇలా పెంచండి!
X

సమాజంలో బాలికలు, మహిళల రక్షణ కోసం ప్రాథమిక స్థాయిలోనే మార్పు రావలసిన అవసరం ఉందని తల్లిదండ్రులు మగపిల్లలను ఎవరికీ హాని తలపెట్టని విధంగా పెంచాలని నటి, సామాజిక కార్యకర్త దియా మీర్జా పిలుపునిచ్చారు. అబ్బాయిలకు చిన్నతనం నుంచే సమ్మతి, పరస్పర గౌరవం, ఆమోదం ప్రాముఖ్యతను నేర్పించడం ద్వారా మాత్రమే మహిళలకు సురక్షితమైన సమాజాన్ని నిర్మించగలమని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన `ఫిక్కి ఫ్రేమ్స్` సదస్సులో పాల్గొన్న దియా మీర్జా లింగ సమానత్వం , పిల్లల పెంపకంపై ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పిల్లలను పెంచే విధానంలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమని దియా మీర్జా అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఇంట్లో మగపిల్లలకు ఇతర వ్యక్తుల సరిహద్దులను గౌరవించడం, నో అనే సమాధానాన్ని అంగీకరించడం నేర్పించాలని సూచించారు. `మేము మా మగపిల్లలను ఎవరికీ భౌతికంగా , మానసికంగా హాని కలిగించని విధంగా పెంచినప్పుడు మాత్రమే ఆడపిల్లలకు సమాజంలో పూర్తి రక్షణ లభిస్తుందన్నారు.

మహిళల భద్రత , హక్కుల గురించి ఆడపిల్లలకు మాత్రమే కాకుండా మగపిల్లలకు చిన్నతనం నుంచే సరైన అవగాహన కల్పించాలని దియా స్పష్టం చేశారు. పాఠశాలలు, కుటుంబాలు , సమాజం అంతా కలిసి పిల్లల్లో చిన్నప్పటి నుంచే సానుభూతి, ఇతరుల పట్ల గౌరవం , బాధ్యతాయుత ప్రవర్తనను పెంపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కేవలం చట్టాలు .. ఆంక్షల వల్ల మాత్రమే మార్పు రాదని ఇంట్లో పెంపకం నుంచే అసలైన మార్పు ప్రారంభమవుతుందని నొక్కి చెప్పారు.

వినోద రంగం సమాజంపై చూపే ప్రభావాన్ని ప్రస్తావించారు. తెరపై చూపించే పాత్రలు, కథనాలు సమాజంలో కొత్త ఆలోచనలకు దారితీస్తాయని వెల్లడించారు. అందుకే చిత్రసీమలో కూడా మహిళా పాత్రలను గౌరవప్రదంగా, స్వతంత్రంగా ఆవిష్కరించాల్సిన బాధ్యత మేకర్స్‌పై ఉందన్నారు. ప్రతికూల ఆలోచనలను, పితృస్వామ్య ధోరణులను ప్రోత్సహించే కంటెంట్‌కు స్వస్తి పలికి, బాధ్యతాయుతమైన సినిమా నిర్మాణాన్ని ప్రోత్సహించాలని ఆకాంక్షించారు.

ఈ మార్పు కేవలం కుటుంబాలకే పరిమితం కాకుండా, విద్యాసంస్థలు ,సామాజిక మాధ్యమాల ద్వారా కూడా యువతలోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అప్పుడే ప్రతి ఇంటా, వీధిలోనూ మహిళలు నిర్భయంగా, ఆత్మగౌరవంతో జీవించగల సురక్షిత వాతావరణం ఏర్పడుతుంది.