స్టార్డమ్ కంటే సబ్ స్టాన్స్ ముఖ్యం!
గ్లామర్ ప్రపంచంలో మెరిసిపోవడం సులభమేమో కానీ నటనలోని గ్లామర్‌ను దాటి సబ్‌స్టాన్స్ ఉన్న నటిగా నిలదొక్కుకోవడం కొద్దిమందికి మాత్రమే సాధ్యమవుతుంది.
By: Srikanth Kontham | 22 Oct 2026 12:24 PM ISTగ్లామర్ ప్రపంచంలో మెరిసిపోవడం సులభమేమో కానీ నటనలోని గ్లామర్‌ను దాటి సబ్‌స్టాన్స్ ఉన్న నటిగా నిలదొక్కుకోవడం కొద్దిమందికి మాత్రమే సాధ్యమవుతుంది. మిస్ ఆసియా పసిఫిక్ కిరీటాన్ని గెలుచుకుని, వెండితెరకు దేవతలా పరిచయమైన దియా మీర్జా ప్రయాణం ఈ కోవకే చెందుతుంది. కమర్షియల్ హంగులు.. స్టార్డమ్ వెంట పరుగులు తీయకుండా వైవిధ్యమైన పాత్రలు.. బలమైన సామాజిక స్పృహతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఆరంభంలో వరుస పరాజయాలు ఎదురైనా? కుంగిపోకుండా నేడు ఆస్కార్ బరిలో నిలిచే స్థాయి ప్రదర్శనలతో సాగిస్తున్న అమ్మడి సినీ ప్రయాణం ఎంతో స్పూర్తి దాయకమైంది.
2001లో రిలీజ్ అయిన `రెహ్నా హై తేరే దిల్ మే` చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన దియా మీర్జా తొలి సినిమాతోనే కుర్రకారు కలల రాణిగా మారిపోయారు. రీనా పాత్రలో దియా అమాయకత్వం.. అందం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అటుపై వరుసగా కమర్షియల్ చిత్రాల్లో అవకాశాలు వచ్చినా? బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడంలో చాలా సినిమాలు విఫలమయ్యాయి. కెరీర్ ప్రారంభంలోనే ఎదురైన ఫ్లాప్‌లు ఆమెను వెనక్కి తగ్గించినా? సరైన కథలు .. విలక్షణమైన పాత్రలను ఎంచుకోవాలనే పట్టుదలను మాత్రం పెంచాయి.
హిట్లు.. ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా దియా మీర్జా నటనా పరిధిని విస్తరించుకుంటూ వచ్చారు. మూస ధోరణి కమర్షియల్ పాత్రలకు స్వస్తి చెప్పి పర్ఫార్మెన్స్-ఓరియంటెడ్ చిత్రాల వైపు మొగ్గు చూపారు. `సంజు` చిత్రంలో మాన్యతా దత్ పాత్రలో చూపించిన పరిణతి కూడిన నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాగే `కాఫిర్` వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ స్పేస్‌లోకి అడుగుపెట్టి అత్యుత్తమ నటిని మరోసారి ఆవిష్కరించారు. ఈ సిరీస్ ఆమె నటనకు సరికొత్త మైలేజ్‌ను అందించడమే కాకుండా విమర్శకుల నుండి విశేష ప్రశంసలు తెచ్చిపెట్టింది.
ధిక్కారాన్ని.. సామాజిక సమస్యలను నిర్భయంగా తెరపైకి తెచ్చిన `థప్పడ్` .. `ధక్ ధక్` వంటి చిత్రాలలో దియా పోషించిన పాత్రలు ఆమెలోని నటిని మరో మెట్టు ఎక్కించాయి. గ్లామర్ పాత్రల కంటే కథకు బలాన్నిచ్చే రోల్స్ చేయడమే బాధ్యతగా భావించి ముందుకు సాగారు. ఇటీవల అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సాధించిన `ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్` వంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో భాగంగా మారి ఆస్కార్ బరి వరకు వెళ్లే రేంజ్ సక్సెస్‌ను సొంతం చేసుకున్నారు. వరుస పరాజయాల నుంచి గ్లోబల్ ప్రశంసల వరకు దియా సాధించిన విజయం వెనుక ఉన్నది నటనపై ఉన్న అంకితభావమే.
సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోనూ దియా మీర్జా గొప్ప సబ్‌స్టాన్స్ ఉన్న వ్యక్తిగా నిలిచారు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై గొంతుకగా మారి ఐక్యరాజ్యసమితి (UNEP) గుడ్ విల్ అంబాసిడర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రకృతిని ప్రేమించడం.. ప్లాస్టిక్ రహిత ప్రపంచం కోసం పోరాడడం ద్వారా రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకుంటున్నారు. కళను కేవలం వినోదంగానే కాకుండా సామాజిక మార్పుకు ఒక సాధనంగా మలుచుకోవడంలో దియా మీర్జా ముందంజలో ఉన్నారు.
స్టార్డమ్ అనేది తాత్కాలికం కానీ చేసే పనిలో సబ్‌స్టాన్స్ ఉంటే అది శాశ్వతంగా నిలిచిపోతుందని దియా మీర్జా నిరూపించారు. ఆరంభంలో ఎదురైన ఫ్లాప్‌లకు నిరాశపడకుండా ప్రతిభను నమ్ముకుని ఆస్కార్ రేంజ్ చిత్రాల వరకు ఎదిగిన ఆమె ప్రయాణం భారతీయ సినిమాలో ప్రత్యేక అధ్యాయం. నటిగా, సామాజిక కార్యకర్తగా రెండు పాత్రల్లోనూ సమతుల్యత పాటిస్తూ ముందుకెళ్తున్న దియా మీర్జా రాబోయే తరం నటీనటులకు మార్గదర్శిగా నిలుస్తారనడంలో సందేహం లేదు. 2026 తో దియా మీర్జా పరిశ్రమలో 25 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు.
