పుష్ప 2 ఓవర్.. నెక్స్ట్ బాహుబలి 2..
అయితే ఇప్పుడు ఆ స్థానాలను కదిలించేలా బాలీవుడ్ స్పై థ్రిల్లర్ దురంధర్-2: ది రివెంజ్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.
By: M Prashanth | 19 April 2026 5:13 PM ISTఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ వసూళ్ల రికార్డులు సాధించిన సినిమాల్లో పుష్ప 2, బాహుబలి 2 చిత్రాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఆ రెండు సినిమాలు చాలా కాలంగా టాప్ గ్రాసర్స్ జాబితాలో రెండో, మూడో స్థానాల్లో కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు ఆ స్థానాలను కదిలించేలా బాలీవుడ్ స్పై థ్రిల్లర్ దురంధర్-2: ది రివెంజ్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.
గతేడాది విడుదలైన పుష్ప 2 వసూళ్లను అధిగమిస్తూ తాజాగా దురంధర్-2 సత్తా చాటింది. ట్రేడ్ పండితులు అంచనాల ప్రకారం, ఆ చిత్రం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1740 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో రూ.1742 కోట్ల వసూళ్లు సాధించిన పుష్ప 2ను వెనక్కి నెట్టింది. ప్రస్తుతం ఆ సినిమా ఇండియన్ టాప్-3 గ్రాసింగ్ చిత్రాల జాబితాలో మూడో స్థానాన్ని దక్కించుకుంది.
ఇప్పటికీ టాప్ ప్లేస్ లో రూ.2070 కోట్లతో దంగల్ కొనసాగుతుండగా, రెండో స్థానంలో రూ.1789 కోట్లతో బాహుబలి 2 నిలిచింది. అయితే దురంధర్-2 వసూళ్ల జోరు చూస్తుంటే త్వరలోనే బాహుబలి 2 రికార్డును కూడా అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి 19న విడుదలైన ఆ సినిమా కేవలం 31 రోజుల్లో అనేక రికార్డులు అందుకోవడం విశేషం.
దేశీయ మార్కెట్ లో ఆ చిత్రం రూ.1329 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా, ఓవర్సీస్ లో రూ.419 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. మొత్తం మీద రూ.1749 కోట్లకు చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు నాలుగు గంటల రన్ టైమ్ ఉన్నప్పటికీ, ఎలాంటి భారీ వీఎఫ్ఎక్స్ లేదా ఫాంటసీ ఎలిమెంట్స్ లేకుండా కేవలం గ్రిప్పింగ్ స్పై డ్రామాతో ఇంతటి విజయాన్ని అందుకోవడం విశేషం.
సాధారణంగా స్పై సినిమాల్లో కనిపించే స్టంట్‌లు, యాక్షన్ సన్నివేశాలకు భిన్నంగా, కొత్త తరహా కథనంతో దర్శకుడు సినిమాను తీర్చిదిద్దారు. ఇదే ఆ చిత్రానికి ప్రధాన బలం అయింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించగా, రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించారు. అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ తదితరులు కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు. సారా అర్జున్ హీరోయిన్ గా కనిపించింది.
అయితే ఇప్పుడు అందరి దృష్టి రూ.2000 కోట్ల మైలురాయిపై ఉంది. దుబాయ్ వంటి కొన్ని దేశాల్లో ధురంధర్ 2 చిత్రంపై నిషేధం ఉండటం, అలాగే చైనా, జపాన్ మార్కెట్లలో స్పై సినిమాలకు పరిమిత ఆదరణ ఉండడం వల్ల ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కొంత కష్టంగా కనిపిస్తోంది. అయినా ప్రస్తుతం ఉన్న దూకుడు కొనసాగితే బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేయడం మాత్రం సాధ్యమేనని తెలుస్తోంది. ఇక చూడాలి దురంధర్-2 దూకుడు ఎక్కడి వరకు వెళ్తుందో!
