Begin typing your search above and press return to search.

దురంధ‌ర్ టీమ్ ఆ ఈవెంట్ కు అందుకే వెళ్ల‌లేదా?

2025లో భారతీయ సినీ చరిత్రలో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన దురంధర్ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. దురంధ‌ర్ సినిమా ఎక్కువ‌గా వార్త‌ల్లోకెక్క‌డానికి కార‌ణం ఆ సినిమా సాధించిన క‌లెక్ష‌న్లు.

By:  Sravani Lakshmi Srungarapu   |   24 Feb 2026 6:22 PM IST
దురంధ‌ర్ టీమ్ ఆ ఈవెంట్ కు అందుకే వెళ్ల‌లేదా?
X

2025లో భారతీయ సినీ చరిత్రలో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన దురంధర్ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. దురంధ‌ర్ సినిమా ఎక్కువ‌గా వార్త‌ల్లోకెక్క‌డానికి కార‌ణం ఆ సినిమా సాధించిన క‌లెక్ష‌న్లు. కానీ ఈసారి కారణం బాక్సాఫీస్ రికార్డులు కాదు, ఒక అవార్డు కార్యక్రమాన్ని బహిష్కరించిన ఘటన. ప్రముఖ మీడియా సంస్థ ది హాలీవుడ్ రిపోర్ట‌ర్ ఇండియా నిర్వహించిన తాజా అవార్డుల వేడుకలో దురంధర్‌కు ప్రత్యేక గౌరవం ప్రకటించబడింది. విశేష‌మేంటంటే, ఆ అవార్డును తీసుకోవ‌డానికి చిత్ర బృందం నుంచి ఎవరూ ఆ ఈవెంట్ కు హాజరు కాలేదు. దీని వెనుక‌నున్న కారణాలపై ఇప్పుడు పరిశ్రమలో చర్చ మొదలైంది.

పెద్ద చ‌ర్చ‌కు దారి తీసిన అనుప‌మ చోప్రా రివ్యూ

దురంధ‌ర్ సినిమా రిలీజ్ టైమ్ లోనే ఈ వివాదానికి బీజం పడింది. ప్రముఖ సినీ విమర్శకురాలు అనుప‌మ చోప్రా దురంధర్ సినిమాను యాంటీ-పాకిస్తాన్ నెరేటివ్‌ను మోసుకొచ్చిన సినిమాగా అభివర్ణిస్తూ వ్యాఖ్యానించ‌గా, ఆ రివ్యూ అప్పుడు సోష‌ల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. చిత్ర బృందం ఆ వ్యాఖ్యలపై అప్పట్లో బహిరంగంగా స్పందించకపోయినా, ఆ అభిప్రాయం తమను బాధించిందనే సమాచారం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించింది.

దురంధ‌ర్ కు హాలీవుడ్ రిపోర్ట‌ర్ ఇండియా అవార్డు

తాజాగా అదే మీడియా సంస్థ నిర్వహించిన అవార్డు వేడుకలో దురంధర్ మూవీకి అవార్డు ప్రకటించబడినప్పటికీ, టీమ్ హాజరు కాకపోవడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. విమర్శించిన వేదిక నుంచే గౌరవం స్వీకరించడం సరికాదనే భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా? లేక ఇప్పటికే ఉన్న అసంతృప్తిని ఈ విధంగా వ్యక్తపరిచారా? అనే అంశాలపై విశ్లేషణ సాగుతోంది.

విమ‌ర్శ‌ల వ‌ల్ల తీవ్ర నిరాశ‌కు గురైన‌చిత్ర యూనిట్

సినీ వర్గాల సమాచారం ప్రకారం, రిలీజ్ టైమ్ లో వచ్చిన విమర్శల వల్ల దురంధ‌ర్ చిత్ర యూనిట్ తీవ్రంగా నిరాశకు గురైందని అంటున్నారు. ముఖ్యంగా దేశభక్తి నేపథ్యంతో రూపొందించిన చిత్రాన్ని రాజకీయ కోణంలో చూడడం తమ ఉద్దేశాన్ని వక్రీకరించిందనే భావన యూనిట్‌లో నెలకొన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంతోనే అవార్డుల‌ కార్యక్రమానికి చిత్ర యూనిట్ నుంచి ఎవ‌రూ వెళ్ల‌లేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇదిలా ఉండగా, ఈ అవార్డ్స్ ఫంక్ష‌న్ గైర్హాజరుపై చిత్ర‌బృందం ఎలాంటి అధికారిక‌ ప్రకటన చేయలేదు. అందువల్ల అసలు కారణం ఏంట‌న్నది స్పష్టంగా తెలియలేదు. అయితే సోషల్ మీడియాలో అభిమానులు మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. గౌరవం ఇవ్వాలంటే ముందుగా న్యాయంగా విమర్శించాలి అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఓ వైపు భారీ క‌లెక్ష‌న్లు, మరోవైపు విమర్శల వివాదం వ‌ల్ల దురంధర్ మరోసారి చర్చలోకి వచ్చింది. అవార్డును స్వీకరించకపోవడం వెనుక నిజమైన కారణం ఏమిటో తెలియకపోయినా, విమర్శకురాలి వ్యాఖ్యలే ఈ నిర్ణయానికి దారితీసాయా? అన్న ప్రశ్న మాత్రం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.