Begin typing your search above and press return to search.

కోట్లు తీసుకునే వాళ్లు కాదు ప్రాణం పెట్టేవాడ‌నే ఉద్దేశంతోనే!

బాలీవుడ్ సంచలన దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన‌ స్పై యాక్షన్ థ్రిల్లర్ `ధురంధర్` బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించిందో? చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Srikanth Kontham   |   1 Aug 2026 8:00 PM IST
కోట్లు తీసుకునే వాళ్లు కాదు ప్రాణం పెట్టేవాడ‌నే ఉద్దేశంతోనే!
X

బాలీవుడ్ సంచలన దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన‌ స్పై యాక్షన్ థ్రిల్లర్ `ధురంధర్` బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించిందో? చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించి అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. తాజాగా ఈ సినిమా సాధించిన అఖండ విజయాల నేపథ్యంలో చిత్ర సహ నిర్మాత , జియో స్టూడియోస్ ప్రెసిడెంట్ జ్యోతి దేశ్‌పాండే ప్రాజెక్ట్ విశేషాలను, రణ్‌వీర్ సింగ్‌ను లీడ్ రోల్ కోసం ఎంపిక చేయడానికి దారితీసిన కారణాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ఈ ప్రాజెక్ట్ నిర్మాణ దశలో అనేక ఆర్థిక .. ప్రణాళికా పరమైన సవాళ్లను ఎదుర్కొన్నట్లు జ్యోతి దేశ్‌పాండే వెల్లడించారు. అనుకున్న బడ్జెట్ కంటే వ్యయం ఎన్నోసార్లు పెరిగినా? ఆదిత్య ధర్ .. తాను ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఈ ప్రయోగాత్మక చిత్రానికి అండగా నిలిచామన్నారు. సినిమా కోసం ప్రతి రూపాయి తెరపై కనిపించాలనే కసితో స్క్రిప్ట్ విషయంలో ఆరు నెలలకు పైగా ఎన్నో కసరత్తులు చేసి కథను మరింత పకడ్బందీగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు.

అయితే సినిమాలో కేవలం భారీ రెమ్యూనరేషన్లు తీసుకునే స్టార్స్ కంటే నిజమైన పెర్ఫార్మర్లు కావాలని మేకర్స్ బలంగా కోరుకున్నారు. ఇప్పటికే సినిమా బడ్జెట్ ఎక్కువగా ఉండటంతో పేరున్న స్టార్లను నమ్ముకుంటే ప్రాజెక్ట్ ప్రారంభంలోనే ఆర్థికంగా భారంగా మారుతుందని భావించారు. అందుకే ఇమేజ్ కోసం కాకుండా పాత్రలో పూర్తిగా పరకాయ ప్రవేశం చేయగల నటుడి కోసం వెతికినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే రణ్‌వీర్ సింగ్ అయితే ఈ పాత్రకు వంద శాతం న్యాయం చేయగలడని నమ్మి అతన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు.

రణ్‌వీర్ సింగ్ గురించి మాట్లాడుతూ, ` తాను ర‌ణ‌వీర్ సింగ్ ని కెరీర్ ప్రారంభ రోజుల నుంచీ చూస్తున్నానన్నారు. `రామ్-లీలా`, `బాజీరావ్ మస్తానీ` వంటి చిత్రాల సమయంలో కలిసి పనిచేశానని జ్యోతి గుర్తుచేసుకున్నారు. రణ్‌వీర్ కేవలం ఒక స్టార్‌లా కాకుండా ప్రతి పాత్రలోనూ పూర్తిగా ఒదిగిపోతాడ‌న్నారు. `బాజీరావ్`, `ఖిల్జీ`, `గల్లీ బాయ్ చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా తన అసలు రూపాన్ని దాచిపెట్టి పాత్రగా జీవించాడని కొనియాడారు. సినిమా కోసం సర్వస్వాన్ని అంకితం చేసాడ‌న్నారు. ఆ సమయానికి వేరే ఏ ప్రాజెక్ట్‌ను కూడా ఒప్పుకోకుండా కేవలం ధురంధర్ మీదే పూర్తి దృష్టి పెట్టాడని ప్రశంసించారు.

చిత్ర యూనిట్ సభ్యులంతా ఈ కథపై ఉన్న అంకితభావంతోనే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని విజువల్ వండర్‌ను సాకారం చేశారని తెలిపారు. మేకింగ్ సమయంలో ఎన్నో సవాళ్లు ఎదురైనా? ప్రతి ఒక్కరూ ఎంతో పట్టు దలతో పనిచేశారని గుర్తు చేసుకున్నారు. ఇలాంటి అరుదైన కథలకు, కమర్షియల్ హంగుల కంటే బలమైన నటన ..నిజాయితీ ఉన్న ప్రణాళికే ప్రాణం పోస్తాయని ప్రాజెక్ట్ నిరూపించిందని ఆనందం వ్యక్తం చేశారు.