'దురంధర్' బ్యూటీ వెనక షాడో
సారా తన నట ప్రదర్శనకు ప్రశంసలు అందుకుంటోంది. అందుకే ``నా జీవిత గమనాన్ని మార్చిన వ్యక్తి` అంటూ ముఖేష్ చాబ్రాను ఆకాశానికెత్తేసింది సారా.
By: Sivaji Kontham | 11 Dec 2025 1:00 AM ISTఏదైనా ఒక గొప్ప అవకావం దక్కడం వెనక సరైన మార్గ దర్శకత్వం అవసరం. గైడ్ చాలా ముఖ్యం. అలాంటి మార్గ దర్శకత్వం ఉంది గనుకనే సారా అర్జున్ కి `ధురంధర్` అవకాశం వచ్చింది. రణ్ వీర్ సింగ్ వయసుతో పోలిక చూపెడుతూ, 20 ఏళ్ల చిన్నమ్మాయిని అతడి సరసన కథానాయికగా ఎంపిక చేస్తారా? అంటూ నెటిజనులు తీవ్రంగా దుయ్యబట్టారు. అయినా ఈ బ్యూటీ నట ప్రదర్శన షో స్టాపర్ గా నిలిచింది. దురంధర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ చిత్రంలో సారా అర్జన్ అవకాశం దక్కించుకోవడానికి ప్రధాన కారకుడు కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ చాబ్రా.
తనను నమ్మి అవకాశం కల్పించినందుకు, తనను కాకుండా వేరొకరికి కాల్ చేయనందుకు సారా టెండూల్కర్ ఆ కృతజ్ఞతను ఎలా తీర్చుకోవాలో తెలియక మదనపడుతోంది. ముఖేష్ చాబ్రాకు సారా, ఆమె తండ్రి రాజ్ అర్జున్ ఎంతో ఎమోషనల్ గా కృతజ్ఞతలు తెలిపారు. పరిశ్రమ గమనించడానికి చాలా కాలం ముందే తనను ఈ చిత్రానికి ఎంచుకున్నందుకు, తనను నమ్మినందుకు ముఖేష్ జీకి సారా కృతజ్ఞతలు తెలిపారు. సారా సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లలో ఒకదానిలో ముఖేష్‌తో కలిసి ఉన్న ఒక ఫోటోని కూడా షేర్ చేసింది. ఈ ఫోటో చూడగానే ఆ ఇద్దరి మధ్యా అనుబంధం అందరి దృష్టిని ఆకర్షించింది.
బాల నటిగా కెరీర్ ప్రారంభించిన సారా ఆ తర్వాత అడల్ట్ అయ్యాక కథానాయికగా ఆరంగేట్రం చేసింది. ఆరంభమే ధురంధర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తో ప్రయాణం మొదలైనందున సారా తన అదృష్టానికి మురిసిపోతోంది.
సారా తన నట ప్రదర్శనకు ప్రశంసలు అందుకుంటోంది. అందుకే ``నా జీవిత గమనాన్ని మార్చిన వ్యక్తి` అంటూ ముఖేష్ చాబ్రాను ఆకాశానికెత్తేసింది సారా. తండ్రి సమానుడుగా ముఖేష్ జీ తనకు మార్గనిర్ధేశనం చేసారని, ఆయన నమ్మకం తనను నిలబెట్టిందని సారా ఎమోషనల్ అయ్యారు. ఎవరినీ నమ్మకుండా తనను నమ్మినందుకు అతడికి కృతజ్ఞతలు తెలిపింది. తారాగణాన్ని ఎంపిక చేయడంలో ఆయన నైపుణ్యాన్ని కూడా ప్రశంసించింది సారా. ఆయన హృదయం కాస్టింగ్ ఎంపికలో మాయాజాలం సృష్టించిందని పొగిడేసింది సారా. మీరు కేవలం అవకాశాలను ఇవ్వరు.. మీరు ప్రజలు మారడానికి అవకాశం ఇస్తారు! అని ప్రశంసించింది.
ఆయన అభిరుచి ఘాఢంగా ప్రేరేపించిందని, అతడి మద్దతు బలాన్నిచ్చిందని సారా అన్నారు. నాలో యాలినాను చూసినందుకు ధన్యవాదాలు. మెక్‌డొనాల్డ్స్ ప్రకటన నుండి ధురంధర్ వరకు, ఈ ప్రయాణం ఒక వరంలా అనిపించిందని సారా ఎమోషనల్ నోట్ ని ముగించింది. మెక్ డొనాల్డ్స్ ప్రకటన రోజుల నుంచి సారా ఇంత పెద్ద స్టార్ గా ఎదగడాన్ని ముఖేష్ జీ కూడా గుర్తు చేసుకున్నారు. సారా అంకితభావం, ప్రతిభ, స్వచ్ఛత, మీ తండ్రి గారి పెంపకం మీ పనిలో చాలా అందంగా ప్రతిబింబిస్తాయి. పార్ట్ 2లో మీరు సృష్టించిన మాయాజాలాన్ని అందరూ చూసే వరకు నేను వేచి ఉండలేను! అని ముఖేష్ చాబ్రా రాసారు. సారా తండ్రి, నటుడు రాజ్ అర్జున్ కూడా హృదయపూర్వక సందేశాన్ని షేర్ చేసారు. సారా ప్రతిభ, బలమైన పునాది ఈ స్థాయినిచ్చాయని ఉద్వేగానికి గురయ్యారు.
ధురంధర్ లో నటించడానికి ముందు మణిరత్నం పొన్నియిన్ సెల్వన్‌లో చిన్న నందిని(ఐశ్వర్యారాయ్)గా కనిపించింది సారా. 2011 తమిళ చిత్రం దైవ తిరుమగల్ (తెలుగులో నాన్న)తో సారా బాలనటిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రంలో విక్రమ్ కుమార్తెగా నటించింది. తరువాత శైవం (2014)లో అద్భుత నటనతో ఆకట్టుకుంది. ఏక్ థి దాయన్, జై హో, జజ్బా, సాండ్ కి ఆంఖ్ వంటి హిందీ చిత్రాలలో కూడా నటించింది. ధురంధర్ కథానాయికగా ఆరంగేట్ర చిత్రం. తదుపరి గుణశేఖర్ తెరకెక్కిస్తున్న తెలుగు చిత్రం యూఫోరియాలోను నటిస్తోంది. ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లో అంతా కొత్త ఆర్టిస్టులు నటిస్తున్నారు. ఈ సినిమా కథానాయికగా తనకు టాలీవుడ్ లో బిగ్ బ్రేక్ నిస్తుందని సారా ఆశిస్తోంది.
దురంధర్ బంపర్ ఓపెనింగులతో దూసుకుపోతోంది. త్వరలో 200కోట్ల క్లబ్ లో అడుగుపెడుతోంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌కు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఆయన రచయితగా, సహ నిర్మాతగాను వ్యవహరించారు. జియో స్టూడియోస్ - బి62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, సారా అర్జున్ తదితరులు నటించారు. రెండవ భాగం వచ్చే ఏడాది మార్చి 19న విడుదల కానుంది.
