3000 కోట్లతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర!
భారతీయ చలనచిత్ర పరిశ్రమ బాక్సాఫీస్ చరిత్రలో అద్భుతమైన మైలురాయి నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ధురంధర్( రెండు భాగాలు కలిపి) ఫ్రాంచైజీ సరికొత్త రికార్డును సృష్టించింది.
By: Srikanth Kontham | 15 April 2026 12:04 AM ISTభారతీయ చలనచిత్ర పరిశ్రమ బాక్సాఫీస్ చరిత్రలో అద్భుతమైన మైలురాయి నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ధురంధర్( రెండు భాగాలు కలిపి) ఫ్రాంచైజీ సరికొత్త రికార్డును సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా 3,000 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన మొట్టమొదటి భారతీయ ఫిల్మ్ ఫ్రాంచైజీగా ధురంధర్ అవతరించింది. ఈ ఘనతతో భారతీయ సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికపై మరో మెట్టు ఎక్కించడమే కాక ఇండియన్ సినిమా మార్కెట్ పరిధిని ప్రపంచ స్థాయికి విస్తరించింది. ఇప్పటి వరకు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దంగల్, బాహుబలి, పుష్ప వంటి చిత్రాలు సృష్టించిన రికార్డులే అత్యున్నతమైనవిగా భావించేవారు.
కానీ ధురంధర్ ప్రభంజనం ముందు ఆ రికార్డులన్నీ కనుమరుగయ్యాయి. రాజమౌళి బాహుబలి ఫ్రాంచైజీ సాధించిన వసూళ్లను, సుకుమార్ పుష్ప ప్రాంచైజీ, అమీర్ ఖాన్ దంగల్ చైనాలో సృష్టించిన సంచలనాన్ని ఈ చిత్రం అధిగమించింది. ఒకే సిరీస్ నుండి వచ్చిన చిత్రాలు ఇంతటి భారీ మొత్తాన్ని రాబట్టడం భారతీయ సినీ చరిత్రలో ఇదే తొలిసారి.ధురంధర్ ఈ స్థాయి విజయాన్ని అందుకోవడానికి కేవలం స్వదేశీ మార్కెట్ మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్ కూడా ప్రధాన కారణమైంది. ఉత్తర అమెరికా, యూరప్ తో పాటు పలు దేశాలతో పాటు ఆసియా మార్కెట్లలో ఈ చిత్రం కనీవినీ ఎరుగని రీతిలో వసూళ్లను రాబట్టింది.
భారతీయ యాక్షన్ సినిమాలకు గ్లోబల్ ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్‌ను ఈ ఫ్రాంచైజీ విజయవంతంగా వాడుకుంది. హాలీవుడ్ యాక్షన్ సినిమాలకు ధీటుగా రూపొందిన విజువల్స్ , కథనం ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు తీయించాయి. భారీ బడ్జెట్, పక్కా ప్లానింగ్, క్వాలిటీ కంటెంట్ ఉంటే భారతీయ మార్కెట్ స్థాయి 3000 కోట్లు కూడా దాటగలదని ఈ చిత్రం నిరూపించింది. ఇది రాబోయే కాలంలో మరిన్ని భారీ ప్రాజెక్టులకు స్ఫూర్తిగా నిలవనుంది.
ఈ విజయంలో యువ హీరోల పాత్ర విస్మరించలేనిది. రణవీర్ సింగ్ వంటి నటుల అంకితభావం , ఆదిత్య ధర్ దర్శకత్వ ప్రతిభ తోడవ్వడంతో ఇలాంటి అద్భుతం సాధ్యమైంది.
ఖాన్ త్రయం దశాబ్దాల పాటు ఏలిన బాక్సాఫీస్ రికార్డులను యువతరం తమదైన శైలిలో తిరగరాస్తోంది. సాంకేతిక నిపుణుల కృషి, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను మెప్పించే కథాంశం వెరసి ధురంధర్`ను ఓ బ్రాండ్‌గా మార్చాయి. ప్రపంచ సినిమా యవనికపై భారతీయ చిత్రాలు కూడా హాలీవుడ్ స్థాయి వసూళ్లను సాధించగలవని `ధురంధర్ ప్రాంచైజీ నిరూపించింది. ఈ రికార్డు భవిష్యత్తులో మన దర్శకులకు, నిర్మాతలకు మరింత బాధ్యతను, ఉత్సాహాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. ధురంధర్ సృష్టించిన ఈ బాక్సాఫీస్ హిస్టరీ మున్ముందు మరిన్ని చిత్రాలకు దిక్సూచిలా మారనుంది.
