'ధురంధర్' నటి సారా అర్జున్ ఎమోషనల్ పోస్ట్!
బాక్సాఫీస్ వద్ద దాదాపు 30 రోజులుగా క్రేజీ రన్‌తో వసూళ్ల సునామీని సృష్టిస్తున్న ఈ మూవీ విజయంపై సారా అర్జున్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్‌ని షేర్ చేసింది.
By: Tupaki Entertainment Desk | 5 Jan 2026 12:41 AM ISTఆదిత్య ధర్ అత్యంత భారీ స్థాయిలో ఎవరూ ఊహించని విధంగా రూపొందించిన `ధురంధర్` సంచలనాలు సృష్టిస్తోంది. భారతీయ సినిమాల్లో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతూ బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్‌ని కొనసాగిస్తోంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ మూవీ ఇప్పటి వరకు రూ.1200 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ మూవీతో క్రేజీ గాళ్ సారా అర్జున్ హీరోయిన్‌గా పరిచయం అయిన విషయం తెలిసిందే.
తొలి మూవీతోనే అరుదైన రికార్డుని సొంతం చేసుకుని సారా వార్తల్లో నిలిచింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు 30 రోజులుగా క్రేజీ రన్‌తో వసూళ్ల సునామీని సృష్టిస్తున్న ఈ మూవీ విజయంపై సారా అర్జున్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్‌ని షేర్ చేసింది. ప్రేక్షకులని ఉద్దేశించి ఆసక్తికరంగా స్పందించింది. `నా బలమైన ధురంధరులు మీరే. చాలా కాలంగా ప్రేక్షకులకు సుదీర్ఘ కథలను చూడటానికి ఓపిక లేదని, వారి ఏకాగ్రత, సమయం తగ్గిపోయిందనే వాదన వినిపిస్తోంది. కానీ మీరు దాన్ని తప్పు అని నిరూపించారు.
ప్రేక్షకుల నిజమైన శక్తి ఏమిటో, ప్రజలు తాము నిజంగా నమ్మేదానికి మద్దతుగా నిలవడానికి ఏకమైనప్పుడు ఏం జరుగుతుందో అందరికీ గుర్తు చేశారు. మీ వల్లే `ధురంధర్` ప్రయాణం ఈ విధంగా సాగింది. మీరు చూపించిన ప్రేమ, మీరు హాజరైన ప్రతీ క్షణం ఈ సినిమాను ముందుకు నడిపించాయి. ఈ విషయంలో మీకు ఎంతగా కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు. నటీనటులుగా, మేకర్స్‌గా మేము ప్రతీదాన్ని నియంత్రించగలం. కానీ మాకు ప్రేక్షకులపై నియంత్రణ ఉండదు.
మేము నటీనటులుగా మా సర్వాస్వాన్ని ఇచ్చి కష్టపడతాము. ఎక్కడో ఎవరో ఒకరు దానికి కనెక్ట్ అవుతారని నమ్ముతాము. అది నిజమైనప్పుడు అది ప్రపంచంలోనే అత్యంత సంతృప్తినిచ్చిన భావన అవుతుంది. మీ ప్రేమలో ఏదీ గమనించకుండా, ఏదీ అనుభూతి చెందకుండా పోలేదు. నాపై మీరు చూపించిన ఆప్యాయత, దయ, ప్రోత్సాహం నన్ను కృతజ్ఞతతో ముంచెత్తాయి. ఇంతట విజయాన్ని అందించిన ఆ దేవుని ముందు, మీ ముందు కృతజ్ఞతతో శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను.
నేను ఇప్పుడే నా ప్రయాణాన్ని ప్రారంభించాను. నేను భాగమైన సినిమాకు, నేను చేయాలనుకుంటున్న పనికి ఇంత త్వరగా ఈ తరహా ప్రోత్సాహం లభించడం అనేది మాటల్లో వర్ణించలేని గొప్ప అనుభూతి. ఇది నాకు బలాన్నిచ్చింది. అంతిమంగా నటన అనేది ఓ కళ. ప్రేక్షకులు నిజమైన అనుభూతిని పొందాలని మా వంతు ప్రయత్నిస్తాం. మీరు అనుభూతి చెందారని, ఆ కథ మీకు రీచ్ అయిందని చూడటం అనేది నేను క్రెడిట్ తీసుకోలేని విజయం. ఈ ఘనత మేకర్స్‌కి చెందుతుంది. ఇందులో భాగమైనందుకు నేను కృతజ్ఞరాలిని` అంటూ ఎమోషనల్ పోస్ట్‌ని సారా అర్జున్ షేర్ చేసింది. అంతే కాకుండా నన్ను గుర్తించినందుకు, మీ ప్రేమని పంచినందుకు ధన్యవాదాలు తెలిపింది.
