Begin typing your search above and press return to search.

డబ్బింగ్ సినిమాలకు కొత్త దారి… దురంధర్2 తెలుగు వెర్షన్‌పై ఆసక్తి

తెలుగు ప్రేక్షకులు ఇతర భాషా సినిమాలను ఎక్కువగా థియేటర్లలో చూసే పరిస్థితి పెరిగినప్పటికీ, డబ్బింగ్ నాణ్యతపై మాత్రం చాలా కాలంగా విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   9 March 2026 1:53 PM IST
డబ్బింగ్ సినిమాలకు కొత్త దారి… దురంధర్2 తెలుగు వెర్షన్‌పై ఆసక్తి
X

తెలుగు ప్రేక్షకులు ఇతర భాషా సినిమాలను ఎక్కువగా థియేటర్లలో చూసే పరిస్థితి పెరిగినప్పటికీ, డబ్బింగ్ నాణ్యతపై మాత్రం చాలా కాలంగా విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా హిందీ, తమిళ సినిమాలను తెలుగులోకి డబ్బింగ్ చేసే సమయంలో స‌హ‌జంగా మాట్లాడే తెలుగు లాగా కాకుండా బుక్స్ లో ఉండే భాష‌లాగా అనిపించే డైలాగులు వినిపించడం సాధారణంగా కనిపించే విషయం. దీనికి ప్రధాన కారణం, డబ్బింగ్ డైలాగ్స్ ను ఎక్కువగా చెన్నై లేదా ముంబైలో సెటిల్ అయిన తెలుగు రచయితలే చేయడం. వారికి తెలుగులో నైపుణ్యం ఉన్నప్పటికీ, ప్రాంతీయ భాషకు దూరంగా ఉండటం వల్ల సంభాషణల్లో సహజత్వం కొంత మేర తగ్గిపోతుంది. ఫలితంగా చాలా డబ్బింగ్ సినిమాల్లో ఆడియ‌న్స్ కు ఏదో డ‌బ్బింగ్ సినిమా చూస్తున్న ఫీలింగే వ‌స్తుంది.

అన్న‌పూర్ణ స్టూడియోస్ కు తెలుగు డ‌బ్బింగ్ బాధ్య‌త‌

అయితే ఈ పరిస్థితికి భిన్నంగా చేసిన ఒక కొత్త ప్రయత్నం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. త్వరలో రిలీజ్ కు సిద్ధమవుతున్న దురంధ‌ర్: ది రివెంజ్ తెలుగు వెర్షన్ కోసం మేక‌ర్స్ తీసుకున్న డెసిష‌న్ ఇండస్ట్రీలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సాధారణంగా ఎప్పుడూ బయట రాష్ట్రాల్లో జరిగే డబ్బింగ్ పనిని ఈసారి హైదరాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోస్‌కు అప్పగించడం ప్రత్యేకంగా మారింది.

డైలాగ్స్ మ‌రింత స‌హ‌జంగా..

ఈ నిర్ణయ ప్రభావం ఇప్పటికే సినిమా ట్రైలర్‌లో కనిపిస్తోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ట్రైలర్‌లో చూసిన మాట‌లు, సంభాష‌ణ‌లు చాలా నేచుర‌ల్ గా, తెలుగు వాళ్లు మాట్లాడే విధానానికి దగ్గరగా ఉండటం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా సినిమాలో కీలక పాత్రల్లో కనిపిస్తున్న సంజ్ ద‌త్, అర్జున్ రాంపాల్ పాత్రలకు వినిపించే తెలుగు వాయిస్‌లు కూడా అందులోని అసలైన భావాన్ని వినిపిస్తున్నాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సాధారణంగా డబ్బింగ్ సినిమాల్లో కనిపించే కృత్రిమత ఇక్కడ తక్కువగా ఉండటం ఈ ప్రయత్నానికి ప్రధాన బలంగా మారింది.

మ‌రిన్ని అవ‌కాశాలు వ‌చ్చే ఛాన్స్

తెలుగు డబ్బింగ్ సినిమాల్లో గతంలో ఎక్కువగా ఎదురైన సమస్యలలో ఒకటి డైలాగ్స్ సెలెక్ష‌న్. ప్రాంతీయంగా మాట్లాడే మాట‌లు, స్థానిక పదాల వినియోగం లేకపోవడం వల్ల కథలోని ఎమోష‌న్స్ కూడా పూర్తిగా ఆడియ‌న్స్ దగ్గరికి చేరకపోవడం జరుగుతుందని పలువురు విమర్శకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోనే డబ్బింగ్ మరియు లోకలైజేషన్ ప్రక్రియను నిర్వహించడం ద్వారా ఆ సమస్యను తగ్గించే ప్రయత్నం చేసినట్టైంది. సినీ పరిశ్రమలో కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇలాంటి ప్రయోగాలు భవిష్యత్తులో డబ్బింగ్ సినిమాల నాణ్యతను మరింత మెరుగుపరచే అవకాశం ఉంద‌ని, ముఖ్యంగా బాలీవుడ్, కోలీవుడ్ భారీ సినిమాల‌ను తెలుగులో రిలీజ్ చేసే టైమ్ లో స్థానిక రచయితలు, స్టూడియోలు భాగస్వామ్యం అయితే భాష సహజత్వం పెరుగుతుందని వారు భావిస్తున్నారు.

మొత్తంగా చూస్తే, డబ్బింగ్ క్వాలిటీ విషయంలో చాలా కాలంగా ఉన్న సమస్యకు దురంధ‌ర్: ది రివెంజ్ ఒక చిన్న పరిష్కారం దిశగా అడుగు వేసినట్టుగా కనిపిస్తోంది. ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్ చూస్తే, ఈ సహజమైన తెలుగు డైలాగులు సినిమా రిలీజ్ టైమ్ లో అదే స్థాయిలో ఆడియ‌న్స్ ను ఆకట్టుకుంటాయా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ ప్రయోగం స‌క్సెస్ అయితే, ఫ్యూచ‌ర్ లో మరిన్ని పాన్-ఇండియా సినిమాలు కూడా హైదరాబాద్‌లోని స్టూడియోలతో కలిసి డబ్బింగ్ చేయించే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.