Begin typing your search above and press return to search.

దురంధర్ తెలుగు ప్రిమియర్లపై బాంబు

మూడు నెలల ముందు ‘దురంధర్’ సినిమా రిలీజవుతుంటే.. హిందీ ప్రేక్షకుల్లో కూడా పెద్దగా అంచనాలు లేవు.

By:  Garuda Media   |   18 March 2026 6:30 PM IST
దురంధర్ తెలుగు ప్రిమియర్లపై బాంబు
X

మూడు నెలల ముందు ‘దురంధర్’ సినిమా రిలీజవుతుంటే.. హిందీ ప్రేక్షకుల్లో కూడా పెద్దగా అంచనాలు లేవు. కానీ ఇప్పుడు ‘దురంధర్-2’ రిలీజవుతుంటే.. దక్షిణాదిన ప్రాంతీయ భాషల ప్రేక్షకులు కూడా ఆ సినిమా కోసం ఊగిపోతున్నారు. ‘దురంధర్’ ఆ స్థాయిలో సూపర్ సక్సెస్ అయి.. పార్ట్-2 మీద అంచనాలను భారీగా పెంచేసింది. ‘దురంధర్’ను ఓటీటీలో తమ భాషలో చూసిన తెలుగు వాళ్లు.. ‘దురంధర్-2’ను అదే భాషలో థియేటర్లలో చూడడానికి అమితాసక్తితో ఉన్నారు.

ఆ ఆసక్తికి తగ్గట్లే రిలీజ్‌కు ముందు రోజు పెద్ద ఎత్తున ప్రిమియర్లు ప్లాన్ చేశారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ తెలుగు వెర్షన్‌కు కూడా బాగానే షోలు ఇచ్చారు. బుకింగ్స్ కూడా జోరుగా జరిగాయి. దాదాపుగా అన్ని షోలూ ఫుల్ అయ్యే స్థితిలో ఉన్నాయి. కానీ ప్రిమియర్స్ పడడానికి కొన్ని గంటల ముందు ‘దురంధర్’ టీం పెద్ద బాంబు వేసింది. ఈ రోజు సాయంత్రం, రాత్రి పడాల్సిన ‘దురంధర్-2’ ప్రిమియర్లు అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి.

‘దురంధర్-2’ చిత్రానికి సెన్సార్ పూర్తి చేయడం, కంటెంట్ డెలివరీ చేయడంలో ఇబ్బందులు తప్పలేదు. హిందీ వెర్షన్ పని పూర్తి చేయడానికే చాలా ఇబ్బంది అయింది. ఇక తెలుగు వెర్షన్ మీద ఫోకస్ పెట్టే పరిస్థితి లేదు. ప్రిమియర్ల సమయానికి కంటెంట్ రెడీ చేయలేని పరిస్థితుల్లో ఈ షోలన్నీ క్యాన్సిల్ చేసేశారు. ఆన్ లైన్ టికెటింగ్ యాప్‌ల నుంచి చాలా వరకు తెలుగు షోలన్నీ తీసేశారు. ఇంకా కొన్ని షోలు కనిపిస్తున్నప్పటికీ.. అవి కూడా క్యాన్సిల్ కాబోతున్నాయి.

కానీ హిందీ షోలు మాత్రం యథావిధిగా కొనసాగనున్నాయి. ఈ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తెలుగు వాళ్లు కూడా హిందీలో చూసుకోవాల్సిందే. ప్రిమియర్ల సంగతి పక్కన పెడితే.. రేపు రెగ్యులర్ తెలుగు షోలు అయినా షెడ్యూల్ ప్రకారం పడతాయా లేదా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. ఓవర్సీస్ కంటెంట్ డెలివరీలో కూడా ‘దురంధర్-2’ టీం ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.