'ధురంధర్2' ప్రీమియర్ షో ఆఫర్ చేసింది ఎవరు?
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ యాక్షన్ స్పై డ్రామా `ధురంధర్ 2`.
By: Ravindar Gorantla | 14 March 2026 3:27 PM ISTప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ యాక్షన్ స్పై డ్రామా `ధురంధర్ 2`. రణ్‌వీర్ సింగ్ మోన్‌స్టార్ స్టైల్లో నటించిన ఈ క్రేజీ యాక్షన్ థ్రిల్లర్‌ని యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ఆదిత్య ధర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇప్పటికే పార్ట్ 1 సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడం, విమర్శకుల ప్రశంసల్ని సైతం దక్కించుకోవడంతో సీక్వెల్ `ధురంధర్ 2`పై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. మార్చి 19న భారీ స్థాయిలో హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతోంది.
ఫస్ట్ పార్ట్ తెలుగు వెర్షన్ రిలీజ్ కాకపోయినా హిందీ వెర్షన్‌కు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఆదరణ దక్కింది. దీంతో మేకర్స్ దక్షిణాది భాషల్లోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. మార్చి 18నే ప్రీమియర్ షోలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రీమియర్ షోల విషయంలో రికార్డు స్థాయి వసూళ్లని దక్కించుకుంటున్న ఈ సినిమా ఉత్తర అమెరికాలో ఇప్పటికే రికార్డు స్థాయి వసూళ్లని సొంతం చేసుకుని అక్కడి ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురి చేస్తోంది. మరో మూడు రోజుల్లో ప్రీమియర్స్ జరగనున్న నేపథ్యంలో నెట్టింట ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది.
`ధురంధర్ ది రివేంజ్` ప్రీమియర్ షోలకు దేశ వ్యాప్తంగా భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఇటీవల ప్రారంభించిన అతిపెద్ద సినిమా థియేటర్ వర్గాలు ఇటీవల `ధురంధర్ ది రివేంజ్`ప్రీమియర్ షోని తమ థియేటర్లో ఏర్పాటు చేయాలని మేకర్స్‌ని రిక్వెస్ట్ చేశారట. అంతే కాకుండా ఇది ఎలాగైనా జరగాలని భావించి దర్శకుడు ఆదిత్యధర్‌ని కలిశారని, అయితే ఆయన థియేటర్ యాజమాన్యం చేసిన రిక్వెస్ట్‌ని సున్నితంగా తిరస్కరించారని ప్రచారం జరుగుతోంది.
దేశ వ్యాప్తంగా క్రేజ్‌ని సొంతం చేసుకున్న `ధురంధర్ 2`ని ప్రత్యేకంగా ప్రమోట్ చేయాల్సిన అవసరం మేకర్స్‌కు లేదు. ఎందుకంటే ఇప్పటికే దానికి రావాల్సిన మైలేజీకి మించిన ఫ్రీ పబ్లిసిటీ వచ్చేసింది. ఆ కారణంగానే దర్శకుడు ఆదిత్యధర్ బాలీవుడ్‌లో ఈ మూవీని పెద్దగా ప్రమోట్ చేయడం లేదు. ప్రత్యేకంగా ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదు. అలాంటిది దక్షిణాదితో ఎందుకు ప్రత్యేకంగా ప్రమోట్ చేయాలనుకుంటాడు?. అందులోనూ స్పెషల్ ప్రీమియర్ కోసం కొత్త థియేటర్‌కు ఎందుకు అవకాశం ఇస్తాడనే చర్చ జరుగుతోంది.
హైదరాబాద్‌లో ఇటీవల ప్రారంభమైన భారీ థియేటర్ యాజమాన్యం నిజంగానే ఆదిత్యధర్ ని కలిసి స్పెషల్ ప్రీమియర్ కోసం రిక్వెస్ట్ చేసిందా? అలాంటి అవసరం వారికి ఏముంది?.. అనే వాదన కూడా మరో పక్క వినిపిస్తోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంత? అన్నది తెలియాలంటే తమ థియేటర్‌పై వస్తున్న రూమర్స్‌పై థియేటర్ యాజమాన్యం స్పందించాల్సిందే.
