దురంధర్ 2: పాకిస్తాన్‌లో పైరసీ డౌన్‌లోడ్‌లలో రికార్డ్!
భారతీయ చలనచిత్ర పరిశ్రమను పట్టిపీడిస్తున్న పైరసీ భూతం ఇప్పుడు ప్రతిష్టాత్మక చిత్రం `దురంధర్ 2`ను కూడా వదలడం లేదు.
By: Sivaji Kontham | 20 March 2026 10:58 PM ISTభారతీయ చలనచిత్ర పరిశ్రమను పట్టిపీడిస్తున్న పైరసీ భూతం ఇప్పుడు ప్రతిష్టాత్మక చిత్రం `దురంధర్ 2`ను కూడా వదలడం లేదు. మార్చి 19న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ సినిమా పైరేటెడ్ వెర్షన్ పాకిస్తాన్‌లో ప్రత్యక్షం కావడం సంచలనం సృష్టిస్తోంది. గతంలో `దురంధర్` మొదటి భాగం పాకిస్తాన్‌లో అత్యధికంగా పైరసీలో డౌన్ లోడ్ చేయబడిన చిత్రంగా రికార్డు సృష్టించగా, ఇప్పుడు దాని సీక్వెల్ కూడా అదే బాటలో పయనిస్తోంది. పాక్ యువత థియేటర్లకు వెళ్లే అవకాశం లేకపోయినా.. ఇంటర్నెట్ వేదికగా ఈ సినిమాను చూసేందుకు ఎగబడుతున్నారు.
లాహోర్‌కు చెందిన ఖలీద్ మహమ్మద్ అనే జర్నలిస్ట్ తన ఇంట్లోనే `దురంధర్ 2` పైరేటెడ్ వెర్షన్ చూస్తున్న ఫోటోలను ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై చిత్ర యూనిట్ రీసెర్చ్ కన్సల్టెంట్ ఆదిత్య రాజ్ కౌల్ స్పందిస్తూ.. ``పాకిస్తానీ టెర్రరిస్టులను నలిపేస్తున్న ఇండియన్ సినిమాను చూడకుండా పాకిస్తానీయులు ఉండలేకపోతున్నారు`` అంటూ వ్యాఖ్యానించారు. సినిమాలోని ట్విస్టులు, ఉత్కంఠను థియేటర్లలోనే అనుభవించాలని దర్శకుడు ఆదిత్య ధర్ ఎంత వేడుకున్నా.. సరిహద్దుల అవతల పైరసీ ఆగడం లేదు.
ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం కారణంగా అక్కడ వినోద రంగం కుదేలైంది. అయినా కానీ అక్కడి భారతీయులు, స్థానికులు పైరసీ లింకుల ద్వారా `దురంధర్ 2`ను వీక్షిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 3.5/5 రేటింగ్‌తో అద్భుతమైన పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాను పైరసీ కిల్ చేయడం పట్ల చిత్ర బృందం ఆందోళన వ్యక్తం చేస్తోంది. రణవీర్ సింగ్ తన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసలు వస్తున్న తరుణంలో ఈ లీకులు కలవరపెడుతున్నాయి.
గతంలో విడుదలైన `దురంధర్` మొదటి భాగాన్ని పాకిస్తాన్ - గల్ఫ్ దేశాల్లో సుమారు 1.5 కోట్లకు పైగా నెటిజన్లు పైరసీలో వీక్షించినట్లు అంచనా. ముఖ్యంగా పాకిస్తాన్‌లో భారతీయ సినిమాలపై నిషేధం ఉన్నా అక్కడి ప్రజలు గూగుల్ , టెలిగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సినిమాలను డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. గల్ఫ్ వాసులు కూడా థియేటర్ల కొరత లేదా ఇతర కారణాల వల్ల పైరసీ వెబ్‌సైట్‌లపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు.
పాకిస్తాన్ , గల్ఫ్ దేశాల్లో అత్యధికంగా పైరసీకి గురైన భారతీయ సినిమాల జాబితాలో బాహుబలి 2, దంగల్, పఠాన్ యానిమల్ వంటి చిత్రాలు మొదటి వరుసలో ఉన్నాయి. ఇప్పుడు `దురంధర్ 2` కూడా ఆ జాబితాలోకి చేరిపోవడం విశేషం. ఎంత టెక్నాలజీ వాడి పైరసీని అడ్డుకోవాలని ఆదిత్య ధర్ బృందం ప్రయత్నిస్తున్నా గ్లోబల్ నెట్‌వర్క్ ద్వారా ఈ లీకులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది సినిమా వసూళ్లపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉన్నా బాక్సాఫీస్ వద్ద రణవీర్ సింగ్ మేనియా మాత్రం తగ్గడం లేదు.
