దురంధర్ 2: అమెరికాలో హాలీవుడ్ సినిమాలను మించేలా!
ప్రస్తుత కాలంలో భారతీయ సినిమాలకు ఉత్తర అమెరికా వసూళ్లు అత్యంత కీలకంగా మారాయి.
By: Sivaji Kontham | 23 March 2026 4:27 PM ISTప్రస్తుత కాలంలో భారతీయ సినిమాలకు ఉత్తర అమెరికా వసూళ్లు అత్యంత కీలకంగా మారాయి. గతంలో బాహుబలి 2, RRR, పుష్ప 2 వంటి చిత్రాలు అక్కడ సృష్టించిన ప్రభంజనం మన మార్కెట్ స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పింది. తాజాగా రణవీర్ సింగ్ నటించిన `దురంధర్: ద రివెంజ్` (దురంధర్ 2) అదే బాటలో పయనిస్తూ అద్భుతమైన ఓపెనింగ్స్‌ను సాధించింది. హాలీవుడ్ చిత్రాల పోటీని తట్టుకొని మరీ ఈ సినిమా ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద టాప్- 3లో నిలవడం భారతీయ సినీ పరిశ్రమ గర్వించదగ్గ విషయం.
ఈ వారాంతపు బాక్సాఫీస్ లెక్కలను పరిశీలిస్తే.. ర్యాన్ గోస్లింగ్ నటించిన సైన్స్ ఫిక్షన్ ఎపిక్ `ప్రాజెక్ట్ హెయిల్ మేరీ` 80.5 మిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో నిలిచింది. డిస్నీ-పిక్సర్ `హాపర్స్` 18 మిలియన్ డాలర్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. అయితే ఈ రెండు భారీ హాలీవుడ్ చిత్రాల తర్వాత అందరినీ ఆశ్చర్యపరుస్తూ రణవీర్ సింగ్ `దురంధర్ 2` సుమారు 10 మిలియన్ డాలర్ల వసూళ్లతో మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది. టాప్ 10 జాబితాలో మిగిలిన ఏడు హాలీవుడ్ సినిమాలు దురంధర్ కంటే వెనుకబడిపోవడం విశేషం.
ముఖ్యంగా హాలీవుడ్ పాపులర్ సీక్వెల్ `రెడీ ఆర్ నాట్ 2`ను కూడా దురంధర్2 అధిగమించడం గమనార్హం. `రెడీ ఆర్ నాట్ 2` సుమారు 9.1 మిలియన్ డాలర్లు వసూలు చేయగా.. భారతీయ చిత్రమైన దురంధర్ 2 దానికంటే ఎక్కువ వసూళ్లను రాబట్టి స్థాయిని నిరూపించుకుంది. కేవలం హారర్ చిత్రాలే కాకుండా కొలీన్ హూవర్ నవల ఆధారంగా వచ్చిన `రిమైండర్స్ ఆఫ్ హిమ్` వంటి చిత్రాలు కూడా భారతీయ సినిమా జోరు ముందు నిలవలేకపోయాయి. ఇది ఉత్తర అమెరికాలో మన సినిమాలకు ఉన్న క్రేజ్‌ను స్పష్టం చేస్తోంది.
దురంధర్ 2 వసూళ్ల ప్రయాణం గురువారం నుండే ఘనంగా మొదలైంది. ప్రీమియర్ షోల ద్వారా 3.94 మిలియన్ డాలర్లు సాధించిన ఈ చిత్రం.. శుక్రవారం `ప్రాజెక్ట్ హెయిల్ మేరీ` విడుదలైనా కానీ.. 2.96 మిలియన్ డాలర్లతో నిలకడగా రాణించింది. శనివారం మళ్లీ పుంజుకుని 3.88 మిలియన్ డాలర్లు వసూలు చేయడం సినిమాపై ఉన్న సానుకూలతకు నిదర్శనం. మొత్తంగా తొలి వారాంతంలో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటి విదేశీ గడ్డపై ఇండియన్ సినిమా జెండాను ఎగురవేసింది.
అంతర్జాతీయ స్థాయిలో `ప్రాజెక్ట్ హెయిల్ మేరీ` వంటి భారీ బడ్జెట్ సినిమాలు ఐమాక్స్ స్క్రీన్లను ఆక్రమించినా కానీ.. దురంధర్ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆదిత్య ధర్ దర్శకత్వ ప్రతిభ, రణవీర్ సింగ్ నటన ఈ సీక్వెల్‌కు ప్రధాన బలంగా నిలిచాయి. హాలీవుడ్ సినిమాలతో సమానంగా మన సినిమాలు కూడా టాప్ చార్టుల్లో నిలబడటం చూస్తుంటే భవిష్యత్‌లో భారతీయ సినిమా గ్లోబల్ మార్కెట్‌ను శాసించడం ఖాయంగా కనిపిస్తోంది.
