'దురంధర్' ఫేం 'రిజ్వాన్'.. రియల్ లైఫ్‌లో స్టార్ల జిమ్ కోచ్!
పదేళ్ల పాటు తెర వెనుకే ఉంటూ జిమ్ కంటెంట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు.
By: Sivaji Kontham | 28 March 2026 9:49 AM ISTరూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన బ్లాక్‌బస్టర్ సినిమా `దురంధర్ 2`లో హంజా (రణ్‌వీర్ సింగ్)కు నీడలా ఉండే అత్యంత ప్రమాదకరమైన `రిజ్వాన్` పాత్రలో ముస్తఫా అహ్మద్ తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. తెరపై రణ్‌వీర్ సింగ్ భారీ శరీరాకృతితో కనిపించడానికి తెర వెనుక నిజ జీవితంలో శిక్షణ ఇచ్చింది ఈ ముస్తఫానే. కొన్నేళ్లుగా రణ్‌వీర్ సింగ్‌కు వ్యక్తిగత శిక్షకుడిగా వ్యవహరిస్తున్న ముస్తఫా ఇప్పుడు అదే రణ్‌వీర్‌తో కలిసి వెండితెరపై స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. అంతేకాదు.. సినిమాలో అతడి ఆహార్యం, కళ్ళల్లోని నిజాయితీ చూస్తుంటే అచ్చం బాలీవుడ్ లెజెండ్ సన్నీ డియోల్‌లా ఉన్నాడంటూ ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుతున్నాయి.
ముస్తఫా నిజ జీవిత ప్రయాణం ఏ సినిమా కథకూ తక్కువ కాదు. చిన్నతనంలో చదువుకోవడానికి ఇబ్బంది పెట్టే డైస్లెక్సియా సమస్యతో బాధపడిన ముస్తఫా స్కూల్ చదువు మధ్యలోనే ఆపేశాడు. 21 ఏళ్ల వయసులో ఒక కాల్ సెంటర్‌లో నెలకు రూ. 1 లక్ష సంపాదిస్తూ తల్లిదండ్రులకు భరోసానిచ్చాడు. కానీ అతని మనసంతా ఎప్పుడూ జిమ్ చుట్టూనే తిరిగేది. ఈ క్రమంలో తను ట్రైనింగ్ ఇచ్చిన ఒక మహిళ పంపిన లేఖ అతడి జీవితాన్ని మార్చేసింది. ``నీ శిక్షణ నా శరీరాన్నే కాదు.. నా జీవితాన్నే కాపాడింది`` అని ఆమె రాసిన మాటలు ముస్తఫాలో స్ఫూర్తిని నింపాయి. దాంతో లక్ష రూపాయల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి.. కేవలం రూ. 10 వేల జీతానికి జిమ్ టైనర్‌గా చేరాడు.
పదేళ్ల పాటు తెర వెనుకే ఉంటూ జిమ్ కంటెంట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు. ఆ వీడియోలు బాలీవుడ్ దృష్టిని ఆకర్షించడంతో హృతిక్ రోషన్, రణ్‌వీర్ సింగ్, విక్కీ కౌశల్, యామీ గౌతమ్ వంటి అగ్ర నటీనటులకు శిక్షకుడిగా మారే అవకాశాలు వచ్చాయి. తానెప్పుడూ ఒక సపోర్ట్ సిస్టమ్‌గానే ఉంటానని అనుకున్నాడు కానీ.. దర్శకుడు ఆదిత్య ధర్ తనలోని నటుడిని గుర్తిస్తాడని ముస్తఫా ఊహించలేదు. తనకు నటనలో `అ` అక్షరం కూడా రాదని భయపడినప్పుడు.. ``నేనున్నాను కదా, నువ్వు చెయ్`` అని దర్శకుడు ఆదిత్య ధర్ ఇచ్చిన ఒక అన్నలాంటి భరోసా ముస్తఫాను వెండితెర ముందుకు నడిపించింది.
రిజ్వాన్ పాత్ర కోసం ముస్తఫా కేవలం నటించడమే కాదు.. తన శరీరాన్ని తీవ్రంగా మార్చుకున్నాడు. ఫైట్స్ సహజంగా కనిపించడం కోసం నిజమైన సైనికులతో కలిసి శిక్షణ తీసుకున్నాడు. సినిమా డిమాండ్ మేరకు ఒక దశలో 86 కిలోల బరువు పెరిగి కండలు పెంచాడు. ఆ తర్వాత ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ కోసం వారానికి 40 కిలోమీటర్లు పరుగెత్తుతూ.. గడిచిన 25 ఏళ్లలోనే అత్యల్ప బరువు అయిన 78 కిలోలకు తగ్గాడు. యువ క్యాడెట్‌లా కనిపించడం కోసం అతను పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపించి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.
జిమ్‌లో వెయిట్స్ లెక్కించే స్థాయి నుండి ప్రపంచ వేదికపై డైలాగులు చెప్పే స్థాయికి ముస్తఫా అహ్మద్ ఎదిగాడు. ప్రతిభ ఉన్నప్పుడు చీకట్లో క్రమశిక్షణతో కష్టపడితే.. ఏదో ఒక రోజు వెలుగు మనల్ని వెతుక్కుంటూ వస్తుందని ముస్తఫా నిరూపించాడు. `దురంధర్` రెండు భాగాలలోనూ అతను చూపించిన క్లాసిక్ నటనను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రిజ్వాన్ పాత్రను అతని కంటే మెరుగ్గా ఎవరూ చేయలేరంటూ సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
