ధురంధర్ ఎఫెక్ట్... ఆయన కెరీర్ నాశనం!
భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఇప్పుడు 'ధురంధర్ 2' సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు.
By: Ramesh Palla | 1 April 2026 11:47 AM ISTభారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఇప్పుడు 'ధురంధర్ 2' సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆధిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ధురంధర్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో, ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా 'ధురంధర్ 2' ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. అంతా అనుకున్నట్లుగానే ధురంధర్ 2 ప్రతి ఒక్క ఇండియన్‌ను కదిలించింది. పాకిస్తాన్‌లో మనోడు చేసిన హంస అంటూ సినిమాను ఎంజాయ్ చేస్తూ మరీ నాలుగు గంటలు చూస్తూ ఉండి పోయారు. హంజా పాత్రలో రణ్వీర్ సింగ్ చూపిన నట విశ్వరూపంకు ప్రతి ఒక్కరూ విజిల్స్ వేసిన విషయం తెల్సిందే. మొదటి వారం రోజుల్లో దాదాపుగా వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టిన ధురంధర్ 2 రెండో వారంలో కాస్త తగ్గినా, ఓవరాల్‌గా లాంగ్ రన్‌లో సినిమా రూ.2000 కోట్ల మార్క్‌ను క్రాస్ చేయడం ఖాయం అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు.
ధురంధర్ 2 వసూళ్లు...
ఒక వైపు సినిమా బాక్సాఫీస్ వద్ద ఊచ కోత అన్నట్లుగా సాగుతుంటే మరో వైపు సినిమాకు సంబంధించి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి. సినిమాలో మెజార్టీ రోల్స్ ను నిజ జీవిత పాత్రల ఆధారంగా రాసుకున్నారు అనేది చర్చ. హీరో పాత్ర మొదలుకుని ప్రతి ఒక్క పాత్రను నిజ జీవిత పాత్రల నుంచి తీసుకున్న నేపథ్యంలో ధురంధర్ లో కనిపించిన జమీల్ సాబ్ పాత్ర గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. పాకిస్తాన్ రాజకీయ నాయకుడిగా రాకేష్ బేడీని జమీల్ సాబ్ పాత్రలో చూపించారు. ధురంధర్ 1 విడుదల సమయంలో ఆ పాత్ర తనను పోలి ఉంది అన్నట్లుగా పాకిస్తాన్ కి చెందిన రాజకీయ నాయకుడు, జాతీయ అసెంబ్లీ సభ్యుడు నబీల్ గబోల్ పేర్కొన్నారు. ధురంధర్ 2 లో జమీల్ పాత్ర ఇచ్చిన ట్విస్ట్‌తో నబీల్ గబోల్ చిక్కుల్లో పడ్డాడు. ఆయన రాజకీయ జీవితం సంక్షోభంలో పడినట్లు అయింది. ఆయన్ను సన్నిహితులే నమ్మడం లేదనే వార్తలు వస్తున్నాయి.
జమీల్ సాబ్ పాత్ర ట్విస్ట్...
ధురంధర్ 2 లో జమీల్ సాబ్ చివర్లో తాను కూడా ఇండియన్ స్పై అంటూ చెప్పుకోవడంతో అంతా షాక్ అవుతారు. జమీల్ ఇండియన్ స్పై అంటూ సినిమాలో చూడంతో గతంలో ఆ పాత్ర తనదే అన్నట్లుగా చెప్పుకున్న నబీల్ గబోల్ పై దాడి మొదలైందట. సినిమాలో ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంపై జమీల్ సాబ్ విష ప్రయోగం చేయడంను చూపించారు. దాంతో నిజ జీవితంలో కూడా దావూద్ ఇబ్రహీంపై నబీల్ గబోల్ విష ప్రయోగం చేసి ఉంటాడా అనే చర్చ పాకిస్తాన్‌లో మొదలైందట. నిజానికి దావూద్ ఇబ్రహీం పై చాలా ఏళ్ల క్రితం విష ప్రయోగం జరిగింది. దాని వల్లే ఆయన పదుల సంవత్సరాలు బెడ్ కే పరిమితం అయ్యాడు. సినిమాలో అదే చూపించారు, కనుక నిజంగానే నబీల్ గబోల్ ఆ పని చేసి ఉంటాడా అని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తూ, అక్కడి సోషల్ మీడియాలో మాట్లాడుకోవడం జరుగుతుందట. దాంతో నబీల్ గబోల్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.
పాకిస్తాన్ నాయకుడు నబీల్ గబోల్...
జాతీయ అసెంబ్లీ సభ్యుడు అంటే నబీల్ పాకిస్తాన్‌లో చాలా పెద్ద పొలిటీషన్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి నబీల్ సినిమాలో వచ్చిన ఒక సీన్‌ను తన నిజ జీవితానికి కనెక్ట్ చేస్తూ ఉండటంతో తప్పని సరి పరిస్థితుల్లో మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆయన తాజాగా మాట్లాడుతూ దావూడ్ ఇబ్రహీంను తన జీవితంలో ఎప్పుడూ కలవలేదు. ఆయన ఇల్లు కూడా ఎక్కడో తెలియదు. మీడియాలో వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన ఉండే ఇల్లు తాను నివసించే ప్రాంతానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పటి వరకు నేను ఎప్పుడూ అక్కడకు వెళ్లలేదు. ఆయన్ను కలవలేదు అంటూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఎంత వివరణ ఇచ్చినా కూడా నబీల్ పొలిటికల్ కెరీర్ దాదాపుగా నాశనం అయినట్లే అని, ఆయన్ను ఇప్పటికీ అక్కడి జనాలు, నాయకులు నమ్మే పరిస్థితి లేదు అంటూ కొందరు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. మరో వైపు జమీల్ పాత్ర చేసిన రాకేష్ బేడీ మాత్రం ఒక్కసారిగా ఫుల్ బిజీ అయ్యాడు. కెరీర్‌లో ఫుల్ స్వింగ్‌లోకి వచ్చాడు. అంతే కాకుండా పారితోషికం విషయంలో గతంతో పోల్చితే మూడు నాలుగు రెట్లు అధికంగా డిమాండ్ చేస్తున్నాడట. ఒక్క పాత్ర ఇద్దరి జీవితాలను తారుమారు చేసింది.
