అవర్ స్టోరి: హీరోయిజాన్ని సర్వనాశనం చేసిన దురంధర్!
దురంధర్, దురంధర్ 2 సినిమాలు భారతీయ సినిమాకి చాలా నేర్పించాయి. ముఖ్యంగా ఆర్జీవీ చెప్పినట్టు దురంధర్ హీరోయిజాన్ని సర్వనాశనం చేసింది.
By: Sivaji Kontham | 24 March 2026 8:00 AM ISTదురంధర్, దురంధర్ 2 సినిమాలు భారతీయ సినిమాకి చాలా నేర్పించాయి. ముఖ్యంగా ఆర్జీవీ చెప్పినట్టు దురంధర్ హీరోయిజాన్ని సర్వనాశనం చేసింది. హీరోకి ఎలివేషన్లు ఇవ్వడం కోసం, హీరో ముఖస్థుతి పొందేందుకు, హీరోని అసహజంగా చూపించేందుకు వెనకాడని లేదా పాకులాడే చాలా మంది రొటీన్ కమర్షియల్ దర్శకులు లేదా రచయితల పని అయిపోయినట్టేననే చర్చ మొదలైంది. `దురంధర్ 2` ముందు తేలిపోయిన పొరుగు థియేటర్ సినిమానే దీనికి ఎగ్జాంపుల్!
హీరోకి ఎలివేషన్లు ఇవ్వాలి.. కానీ అవన్నీ మీనింగ్ ఫుల్ గా ఉండాలి... అర్థవంతమైన కథలో, అద్భుతమైన బలమైన పాత్రను సృష్టించడమే ఇకపై ఎలివేషన్ గా చూడాలి. ఆ కథకు తగ్గట్టు అందులో పాత్ర ఒదిగిపోయి ఎలా ప్రవర్తించాలి? అన్నది ఔత్సాహిక రచయితలు పరిశీలించడానికి దురంధర్ ఒక `మాస్టర్ క్లాస్` అనడంలో సందేహం లేదు.
దురంధర్ పాత్ర నిజానికి అన్ని ఎలివేషన్లను కిందికి తొక్కేసింది. అసలు ఎలాంటి ఎలివేషన్లు లేకుండా ఒక అండర్ డాగ్ పాత్రతో గొప్ప హీరోయిజాన్ని ఆవిష్కరించగలమని నిరూపించింది. ఒక రకంగా ఆదిత్యాధర్ మైండ్ గేమ్ ఆడాడు. రణ్ వీర్ సింగ్ పాత్రను, ఒక రహస్య స్పై ఏజెంట్ ప్రవర్తనను అంత గొప్పగా తీర్చిదిద్దాడు. అతడు చూసే చూపు.. కళ్లు తిప్పే విధానం.. స్పైలు ఎవరికీ అనుమానం రాకుండా.. పరిశీలనగా ప్రతిదీ గమనించే తీరు.. అతడి ఒదిగి ఉండే స్వభావం.. ఇలా దురంధర్ పాత్రను తీర్చిదిద్దిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పని వారు లేరు.
ఒక స్టార్ హీరోని ముఖస్థుతి కోసం భజనలు- భజంత్రీలకు పాల్పడే రొటీన్ మాస్ డైరెక్టర్లకు ఇక కాలం చెల్లినట్టేనా? అన్న సందేహాలు ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరిలో మొదలయ్యాయి. ఆర్జీవీ చెప్పినట్టు .. ఒక పాత్రను రియలిస్టిక్ గా క్రియేట్ చేసి సహజంగా ప్రవర్తించేలా చేస్తేనే ప్రజలు ఇకపై సినిమాలు చూస్తారేమో! మతి చెడి పిచ్చి వేషాలు వేయిస్తే ఇకపై ఆ హీరోలను జనం చూడటానికి ఇష్టపడకపోవచ్చు.
ప్రజలు ఒకప్పటిలా అతిశయోక్తి పాత్రలను భరిస్తారని భావిస్తే తప్పులో అడుగేసినట్టే. పుష్పరాజ్ లాగా, కేజీఎఫ్ రాఖీభాయ్ లాగా సూపర్ హీరోయిజాన్ని మన సౌత్ దర్శకులు వర్కవుట్ చేసారంటే, వారు ఎంచుకున్న కథా నేపథ్యం.. కథలో బలం, కథనంలో టింజు, పాత్రల చిత్రణలో ఎంచుకున్న ఎత్తుగడ ఇవన్నీ చూడాలి. పుష్ప రాజ్ కానీ, రాఖీ భాయ్ కానీ మొరటోళ్లు. మాఫియాల్ని తలదన్నే గూండారాజ్ దందాగాళ్లు.. మొరటోడిని ఇరగ్గొట్టేవాడిగా చూపించడం కరెక్టేనని నిరూపించారు వీళ్లు. ఆ సినిమా కథల్లో, ఆ సినిమా పాత్రల్లో ఉన్న దమ్ము మాత్రమే వాటిని మాస్టర్ పీస్ లు గా నిలబెట్టాయి. ఇప్పుడు `దురంధర్` ఫ్రాంఛైజీ అందుకు భిన్నంగా ఎంపిక చేసుకున్న కథ, కథనం, రియాలిటీకి దగ్గరగా ఉన్న పాత్రలతో ఎంతో పరిణతితో తీర్చిదిద్దన సినిమా.
మా హీరో తొడకొడితే రైలు వెనక్కి పారిపోతుంది! అనే పాత రోజులు కావు ఇవి.. కంటి చూపుతో చంపేయడాలు.. శూలం దూస్తే గాల్లోకి టెంకాయలా ఎగిరి ఆకాశంలోనే ఉండిపోయే తలకాయలను చూపించే రోజులు కూడా పోయాయి.. వీరంతా ఇప్పుడు ఔట్ డేటెడ్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయినట్టే. గడగడ ఒణికించే భారీ పంచ్ డైలాగులతో ఇప్పుడు సినిమాని ఆడించడం కూడా కష్టమే. తక్కువ మాటలు, ఎక్కువ చేతలు మాత్రమే తెరపై చూడటానికి ఆడియెన్ ఇప్పుడు సిద్ధంగా ఉన్నారని దురంధర్ ఫ్రాంఛైజీ నిరూపించింది. అత్యంత తక్కువ మాటలు ఉన్న సినిమా మాత్రమే అత్యుత్తమమైన సినిమా! `హాలీవుడ్ స్క్రీన్ ప్లే రైటింగ్ క్లాస్`లో నేర్పించే ప్రధాన ఎలిమెంట్ ఇది. దీనిని ఈ తరం ఔత్సాహిక దర్శకరచయితలు కచ్ఛితంగా గుర్తించాల్సిన సమయం వచ్చింది.
ప్రజల్లో ఎంతటి మార్పు! ఇప్పుడు హాలీవుడ్ నుంచి వస్తున్న చాలా గొప్ప సినిమాలను కూడా తెలుగు ప్రజలు తెలివిగా అనలైజ్ చేస్తున్నారు. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోస్, ఆహా తెలుగు సహా చాలా ఓటీటీలు ప్రజలకు వైవిధ్యమైన విలక్షణమైన కంటెంట్ ని అందించాయి. అందువల్ల ప్రజలు 2.0 నుంచి 5.0 అప్ గ్రేడెడ్ వెర్షన్ లా మారారు. వారికి ఇప్పుడు టెక్నాలజీని కూడా పరిచయం చేయనవసరం లేదు. యూట్యూబ్ లు, సోషల్ మీడియాల్లో చూసి చాలా నేర్చేసుకున్నారు. ఇప్పుడు ఏఐలో చాట్ జీపీటీలో చూసి చాలా చాలా నేర్చేసుకుంటున్నారు. మునుముందు ఇలాంటి అసాధారణ మేధో ప్రజల్ని మెప్పించాలంటే దర్శకరచయితలు అంతకుమించిన తెలివైనవాళ్లు అని నిరూపించాలి. ఇదేమీ ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రతిరోజూ వార్తలు చూసి కరెంట్ అఫైర్స్, బర్నింగ్ టాపిక్స్ పై అనర్గళంగా మాట్లాడగలిగే, కథల్ని వినిపించగలిగే చాలా మంది మేధో ప్రజల మధ్య స్క్రిప్టులు రాసే రచయితలు లేదా దర్శకులు చాలా ఊహించని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అప్ గ్రేడ్ అవ్వని దర్శకరచయితలకు ఇప్పుడు పనవ్వదనే విశ్లేషణ సాగుతోంది.
