Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: ర‌చ‌యిత‌ల‌దే భ‌విష్య‌త్ అంతా.. నిరూపించిన ఆదిత్యాధ‌ర్

మంచి క‌థ కంటెంట్ తో సినిమా తీస్తే 1000 కోట్ల క్ల‌బ్ నుంచి 2000 కోట్ల క్ల‌బ్ వైపు ప్ర‌యాణించ‌డం సాధ్య‌మేన‌ని ప్రూవ్ అవుతోంది.

By:  Sivaji Kontham   |   19 March 2026 2:55 PM IST
ట్రెండీ టాక్‌: ర‌చ‌యిత‌ల‌దే భ‌విష్య‌త్ అంతా.. నిరూపించిన ఆదిత్యాధ‌ర్
X

మంచి క‌థ కంటెంట్ తో సినిమా తీస్తే 1000 కోట్ల క్ల‌బ్ నుంచి 2000 కోట్ల క్ల‌బ్ వైపు ప్ర‌యాణించ‌డం సాధ్య‌మేన‌ని ప్రూవ్ అవుతోంది. ఇటీవ‌లి కాలంలో భార‌తీయ సినీప‌రిశ్ర‌మ‌లో అనూహ్య మార్పులు క‌నిపిస్తున్నాయి. నేటి త‌రం ద‌ర్శ‌కులు కేవ‌లం టెక్నాల‌జీపైనే ఆధార‌ప‌డ‌కుండా, మంచి సినిమా తీయ‌డం కోసం ద‌మ్మున్న క‌థ‌లు, కంటెంట్ పై దృష్టి సారిస్తున్నారు. స్క్రిప్టు ద‌శ‌లోనే ఇది బ్లాక్ బ‌స్ట‌ర్ బొమ్మ‌! అనే దూర‌దృష్టితో ప్ర‌తిదీ త‌ర‌చి చూస్తున్నారు. ఎమోష‌న్స్ పండించ‌డంలో, భారీ యాక్ష‌న్ తో స్క్రీన్ ని హీటెక్కించ‌డంలో చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీనికి తోడు అందివ‌చ్చిన సాంకేతిత‌ను ఉప‌యోగించుకుని ప్రీవిజువ‌లైజేష‌న్ వంటి అవ‌కాశాలు ఉండ‌టంతో చాలా వ‌ర‌కూ ద‌ర్శ‌కుల‌కు ముందే ఒక క్లారిటీ వ‌చ్చేస్తోంది.

ఇప్ప‌టివ‌ర‌కూ 1000 కోట్ల క్ల‌బ్ సినిమాలు అంటే దంగ‌ల్, బాహుబ‌లి 2, కేజీఎఫ్ 2, ఆర్.ఆర్.ఆర్, ప‌ఠాన్, జ‌వాన్, పుష్ప‌2, కాంతార‌ ఇలా కొన్ని సినిమాల గురించే చ‌ర్చ సాగింది. ఇటీవ‌లి కాలంలో `దురంధ‌ర్` సంచ‌ల‌న విజ‌యం సాధించి పై సినిమాల రికార్డుల‌న్నిటినీ తిర‌గ‌రాసింది. ఈ సినిమాని తెర‌కెక్కించింది ఒక ప్ర‌ముఖ ర‌చ‌యిత‌. అత‌డు బాలీవుడ్ లో ద‌శాబ్ధం పాటు అద్భుత‌మైన క‌థ‌లు ఎన్నిటినో రాసి దిగ్గ‌జ ద‌ర్శ‌కుల‌తో క‌లిసి ప‌ని చేసారు. అత‌డు కొంత‌కాలం ఘోస్ట్ గానే ఉండిపోయారు. కానీ త‌న‌లోని నైపుణ్యానికి అన్ని కోణాల్లో ప‌దును పెట్టాక అత‌డు స్వ‌యంగా ద‌ర్శ‌కుడిగా మారారు. అత‌డు తొలుత `యూరి - ది సర్జిక‌ల్ స్ట్రైక్స్` చిత్రంతో త‌న‌లోని ద‌ర్శ‌కుడిని నిద్ర లేపాడు. తొలి ప్ర‌య‌త్న‌మే బ్లాక్ బ‌స్ట‌ర్ విజయం అందుకుని ఆ త‌ర్వాత దురంధ‌ర్ చిత్రంతో ఏకంగా 1000 కోట్ల క్ల‌బ్ ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు దురంధ‌ర్ 2 విష‌యంలోను అత‌డు త‌న స్టామినా ఏంటో చూపించ‌బోతున్నాడు. ఈ ఉగాది కానుక‌గా విడుద‌లైన దురంధ‌ర్ 2 పాజిటివ్ టాక్ తో తొలి రోజే 100 కోట్లు పైగా వ‌సూళ్ల‌తో సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

ఇప్ప‌టికే వెబ్ లో `దురంధ‌ర్ 2` బ్లాక్ బ‌స్ట‌ర్ అన్న టాక్ తెచ్చుకుంది. దురంధ‌ర్ త‌ర‌హాలోనే ఈ సినిమా కూడా మంచి క‌థ‌, కంటెంట్ తో వ‌చ్చిందన్న పాజిటివ్ టాక్ వ‌చ్చింది. విమ‌ర్శ‌కులు ఈ సినిమాని, ఇందులో న‌టించిన ర‌ణ్ వీర్ సింగ్ ని ఆకాశానికెత్తేసాయి. అదే స‌మ‌యంలో ఆదిత్యాధ‌ర్ క‌థను, క‌థ‌న నైపుణ్యాన్ని, ర‌చ‌యిత‌గా అత‌డి ప్ర‌తిభ‌ను ప్ర‌శంస‌ల్లో ముంచెత్త‌డ‌మే గాక ద‌ర్శ‌కుడిగా మ‌రోసారి స‌త్తా చాటాడ‌ని క్రిటిక్స్ ప్ర‌శంసించారు. ఈ సినిమా తొలి రోజు 150 కోట్లు పైగా వ‌సూలు చేస్తుంద‌ని, ఇదే స్పీడ్ ని మొద‌టి వారం అంతా కొన‌సాగిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. దీని అర్థం దురంధ‌ర్ త‌ర‌హాలోనే 50రోజులు ఆడేందుకు ఆస్కారం ఉన్న సినిమా ఇది అని కూడా కొంద‌రు విశ్లేషిస్తున్నారు. దురంధ‌ర్ చిత్రం 30రోజుల త‌ర్వాత కూడా రోజుకు 12 కోట్ల రేంజులో వ‌సూలు చేసింది. ఇప్పుడు సీక్వెల్ కూడా పాజిటివ్ టాక్ తో అదే రీతిలో దూసుకెళుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే ఇది మంచి క‌థ‌, క‌థ‌నానికి ద‌క్కిన గుర్తింపుగా అంతా ప్ర‌శంసిస్తున్నారు.

నిజానికి ఆదిత్యాధ‌ర్ సినీప‌రిశ్ర‌మ‌లో ఎదిగేందుకు చాలా శ్ర‌మించాల్సి వ‌చ్చింది. అత‌డు ర‌చ‌యిత‌గా ప్ర‌యాణించిన‌ప్పుడే చాలా అణ‌గిమ‌ణిగి ప‌ని చేసాడు. అత‌డికి ర‌చ‌యిత‌గా గుర్తింపునిచ్చేందుకు ద‌ర్శ‌కులు కానీ, తోటి ర‌చ‌యిత‌లు కానీ ఏవిధ‌మైన స‌హ‌కారం అందించ‌లేదు. అయినా ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా ప‌రిశ్ర‌మ‌లో నిల‌దొక్కుకున్నాడు.

దీనికి తోడు అత‌డు బాల్యంలో డిస్లెక్సియా అనే అరుదైన రుగ్మ‌త‌తో పోరాడాడు. చదవడం, రాయడం.. ప‌దాల్ని ప‌ల‌కడంలో అత‌డికి స‌మ‌స్య ఉంది. స్కూల్ లో నేర్చుకోవ‌డం కూడా చాలా క‌ష్టం. కానీ నెమ్మ‌దిగా అత‌డు అన్నిటి నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు. చివ‌రికి అత‌డు భార‌తీయ సినీప‌రిశ్ర‌మ‌ను ఏలే గొప్ప ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడిగా ఎదుగుతాడ‌నేది ఊహించ‌నిది. ఇప్పుడు అత‌డి స‌తీమ‌ణి యామి గౌత‌మ్ త‌న‌కు కొండంత అండ‌గా నిలిచి అత‌డి విజ‌యాల‌లోను భాగ‌స్వామిగా ఉన్నారు. దురంధ‌ర్ 2 త‌ర్వాతా ఆదిత్యాధ‌ర్ ప్ర‌యాణం ఇంతే అద్భుతంగా ముందుకు సాగ‌నుంది. అత‌డు మునుముందు త‌న డ్రీమ్ ప్రాజెక్ట్స్ కోసం తీవ్రంగా క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు తెలిసింది.