32 దేశాల్లో సంచలనం సృష్టించిన రణవీర్ సింగ్ మూవీకి ఘోర అవమానం!
బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన ‘ధురంధర్: ది రివెంజ్’కు 2027 గ్రామీ అవార్డుల్లో నిరాశ ఎదురైంది. బెస్ట్ కంపైలేషన్, గ్లోబల్ మ్యూజిక్ సహా తొమ్మిది విభాగాల్లో ఎంట్రీలు పంపినా తుది నామినేషన్లలో ఒక్క పాటకు కూడా చోటు దక్కలేదు. మరోవైపు తమిళ పాట ‘వరువాయి’ బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ విభాగంలో నామినేషన్ సాధించింది.
By: Madhu Reddy | 17 Nov 2026 6:16 PM ISTవిడుదలైన మొదటి 48 గంటల్లోనే ఏకంగా 32 దేశాలలో టాప్ 10 జాబితాలో ట్రెండింగ్ లో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది రణవీర్ సింగ్ మూవీ ధురంధర్. ఆదిత్యధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ హీరోగా, సారా అర్జున్ హీరోయిన్ గా 2025లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా 22 దేశాలలో ఓటీటీ నెట్ ఫ్లిక్స్ వేదికగా నెంబర్వన్ స్థానాన్ని దక్కించుకొని సత్తా చాటింది. ఇండియాతో పాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్, యూఏఈ, ఖతార్ , సౌదీ అరేబియా, బహ్రేయిన్, ఒమన్, మారిషస్, కెనడా, ఆస్ట్రేలియా, యూకే వంటి 22 దేశాలలో మొదటి స్థానంలో నిలిచింది అంటే ఈ చిత్రానికి ఆడియన్స్ ఏ రేంజ్ లో బ్రహ్మరథం పట్టారో అర్థమవుతుంది.
ఓవరాల్ గా రూ.1300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయడమే కాకుండా పలు అవార్డులు కూడా అందుకున్న ఈ సినిమాకి సీక్వెల్ కూడా వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది. సీక్వెల్ ఏకంగా రూ.1852 కోట్ల కలెక్షన్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. అలాంటి ఈ చిత్రానికి ఇప్పుడు ఘోర అవమానం జరగడం మూవీ, మ్యూజిక్ లవర్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
అంతర్జాతీయ సంగీత ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గ్రామీ అవార్డులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ధురంధర్ సీక్వెల్ ధురంధర్: ది రివేంజ్ కి ఎదురుదెబ్బ తగిలింది. 2027 గ్రామీ అవార్డుల తుది నామినేషన్ లలో ఈ సినిమా నుంచి ఒక్క పాటకి కూడా చోటు దక్కకపోవడం గమనార్హం. వివిధ విభాగాలలో మొత్తం 9 ఎంట్రీ లను పరిశీలన కోసం పంపించినప్పటికీ.. నామినేషన్ల తుదిజాబితాలో మాత్రం ఈ చిత్రానికి నిరాశే మిగిలింది.
శాశ్వత్ సచ్ దేవ్ అందించిన సంగీతం దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు విశేష ఆదరణ పొందడంతో పాటు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన స్పందనను అందుకున్నాయి దీంతో అంతర్జాతీయ వేదికపై కూడా ఈ ఆల్బం సత్తా చాటుతుందని చిత్ర బృందం భావించింది. అందులో భాగంగానే గ్రామీ అవార్డుల కోసం బెస్ట్ కంపైలేషన్, సౌండ్ ట్రాక్, గ్లోబల్ మ్యూజిక్, ర్యాప్ పర్ఫార్మెన్స్, ఏషియన్ పాప్ ఇలా మొత్తం తొమ్మిది కీలక కేటగిరీలలో నామినేషన్లు పంపించగా.. తుది నామినేషన్ జాబితాలో ఒక్కదానికి కూడా అవకాశం లభించకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా మరొకవైపు భారతీయ సంగీతానికి గ్రామీ నామినేషన్లలో ప్రాతినిధ్యం లభించడం విశేషం. దేవన్ ఏకాంబరం , సుషా ఆలపించిన తమిళ గీతం 'వరువాయి' ఏకంగా బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మన్స్ విభాగంలో నామినేషన్ అందుకుంది. దీంతో గ్రామీ చరిత్రలో ఈ విభాగంలో నామినేషన్ పొందిన తొలి తమిళ పాటగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక 69 వ గ్రామీ అవార్డుల వేడుక 2027 ఫిబ్రవరి 7న అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో జరగనుంది. ఇక్కడ 2027 గ్రామీ నామినేషన్ లో భాగంగా బ్రిటిష్ గాయని రే అత్యధికంగా 11 నామినేషన్లతో అగ్రస్థానంలో నిలిచి ప్రపంచ స్థాయి మ్యూజిక్ లవర్స్ ను ఆకర్షించింది.
