Begin typing your search above and press return to search.

'దురంధ‌ర్ 2' 100 కోట్ల ఆశ‌ల‌కు రాకింగ్ స్టార్ చెక్?

భారతీయ సినీ చరిత్రలో మొదటి రోజు రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం అనేది ఇప్పటి వరకు కేవలం సౌత్ సినిమాలకే సాధ్యమైంది.

By:  Sivaji Kontham   |   28 Feb 2026 6:00 AM IST
దురంధ‌ర్ 2 100 కోట్ల ఆశ‌ల‌కు రాకింగ్ స్టార్ చెక్?
X

భారతీయ సినీ చరిత్రలో మొదటి రోజు రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం అనేది ఇప్పటి వరకు కేవలం సౌత్ సినిమాలకే సాధ్యమైంది. బాహుబలి 2, సాహో, కేజీఎఫ్ 2, పుష్ప 2 వంటి చిత్రాలు విడుదలైన తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మార్కును దాటి రికార్డులు సృష్టించాయి. బాలీవుడ్ నుంచి భారీ చిత్రాలు వచ్చినా కానీ, డే-1 వంద కోట్ల క్లబ్‌లో చేరే సీన్ అక్కడ ఇంకా రాలేదు. అయితే ఇప్పుడు `దురంధర్ 2` ఆ లోటును తీర్చి.. హిస్టరీ క్రియేట్ చేసేలా కనిపిస్తోంది.

కేవలం రెండు నెలల క్రితమే విడుదలైన `దురంధర్` మొదటి భాగం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అది 50 రోజులు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శిత‌మై 1000 కోట్ల క్ల‌బ్ ని అధిగ‌మించింది. దీంతో పార్ట్-2 పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ట్రేడ్ వర్గాల విశ్లేషణ ప్రకారం..`దురంధ‌ర్ 2` ఒక్క హిందీ వెర్షన్ మాత్రమే మొదటి రోజు సుమారు రూ.80 కోట్ల గ్రాస్ (దాదాపు రూ.70 కోట్ల నెట్) వసూలు చేసే అవకాశం ఉంద‌ని అంచ‌నా. మొదటి భాగం కంటే భిన్నంగా.. ఈసారి ఈ చిత్రం పలు భాషల్లో డబ్బింగ్ అయి విడుదల కావడం దీనికి కలిసొచ్చే పెద్ద అంశం.

సౌత్ మార్కెట్‌పై కన్ను:

హిందీయేతర మార్కెట్లలో ..అంటే ద‌క్షిణాదినా `దురంధర్ 2` పట్ల విపరీతమైన ఆసక్తి నెలకొంది. డబ్బింగ్ వెర్షన్ల ద్వారా వచ్చే వసూళ్లు ఈ సినిమాను ఆ మ్యాజికల్ రూ.100 కోట్ల మార్కు వైపు నడిపిస్తాయని ట్రేడ్ నమ్ముతోంది. హిందీ బెల్ట్‌లో వచ్చే భారీ వసూళ్లకు.. సౌత్ మార్కెట్ తోడైతే బాలీవుడ్ నుంచి మొదటి రోజే వంద కోట్లు సాధించిన తొలి చిత్రంగా `దురంధర్ 2` చరిత్ర పుటల్లోకి ఎక్కుతుంది.

`టాక్సిక్`తో పోటీ పెద్ద అడ్డంకి:

`దురంధర్ 2` వంద కోట్ల ప్రయాణంలో అతిపెద్ద సవాలు రాకింగ్ స్టార్ యష్ నటించిన `టాక్సిక్`. ఒకవేళ ఈ సినిమా సోలోగా విడుదలయ్యి ఉంటే రూ.100 కోట్ల ఓపెనింగ్ చాలా సులభం అయ్యేది. కానీ మార్చి 19న యష్ సినిమాతో తలపడుతుండటంతో థియేటర్లు, ఆడియన్స్ అటెన్షన్ ఖచ్చితంగా చీలిపోయే అవకాశం ఉంది. `టాక్సిక్` కూడా భారీ ఓపెనింగ్స్ సాధిస్తుందని అంచనా వేస్తుండటంతో.. `దురంధర్ 2` ఆ మైలురాయిని అందుకోవడానికి గట్టిగానే పోటీ ప‌డాల్సి ఉంటుంది.

మార్చి 19న బాక్సాఫీస్ వద్ద అసలైన యుద్ధం జరగబోతోంది. స్క్రీన్స్ షేరింగ్ ఉన్నా కానీ, `దురంధర్ 2` తన సత్తా చాటి బాలీవుడ్ కలని నిజం చేస్తుందో లేదో చూడాలి. ఏది ఏమైనా.. ఒక బాలీవుడ్ చిత్రం రూ.100 కోట్ల ఓపెనింగ్ రేసులో నిలబడటం ఇదే మొదటిసారి. బాలీవుడ్ లో చాలా బంప‌ర్ హిట్ చిత్రాల‌కు సౌత్ లో కోటి కూడా రాలేదు. అందువ‌ల్ల అక్క‌డ మొద‌టి రోజు 100కోట్ల క్ల‌బ్ సాధించామ‌నే ప్ర‌చారం ఏదైనా ఉంటే అది న‌మ్మ‌లేనిది.

డే-1 వంద కోట్ల క్లబ్‌లో సౌత్ చిత్రాలు:

భారతీయ సినిమాలో మొదటిసారి 100కోట్ల ఓపెనింగుల‌తో అద్భుతాన్ని చేసి చూపించిన చిత్రం-బాహుబలి 2. టాక్ తో సంబంధం లేకుండా ప్రభాస్ క్రేజ్ తో వంద కోట్ల ఓపెనింగ్ మార్కును దాటింది సాహో. సలార్ & కల్కి 2898 AD చిత్రాలు కూడా డే-1 వంద కోట్లకు పైగా వసూలు చేశాయి. రాకింగ్ యష్ మేనియా ప్రపంచవ్యాప్తంగా పనిచేసి భారీ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా కేజీఎఫ్ 2 రికార్డుల‌కెక్కింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ సీక్వెల్ హైప్ వల్ల పుష్ప 2 సులభంగా 100 కోట్ల ఓపెనింగ్ మార్కును అందుకుంది. రాజమౌళి - ఎన్టీఆర్ - చరణ్ కాంబోలో వచ్చిన ఆర్.ఆర్.ఆర్ చిత్రం మొదటి రోజే దాదాపు రూ.220 కోట్లు పైగా సాధించి రికార్డు సృష్టించింది.