ఐపీఎల్‌తో 'ధురంధర్ 2' కి ఎంత నష్టమో తెలుసా?
ఇండియాలో అత్యధికుల వినోద సాధనం సినిమా అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.
By: Ramesh Palla | 6 April 2026 4:24 PM ISTఇండియాలో అత్యధికుల వినోద సాధనం సినిమా అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి సినిమాను సైతం క్రికెట్ డామినేట్ చేస్తున్న దాఖలాలు గత కొన్ని సంవత్సరాలుగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు వరల్డ్ కప్, ఇతర క్రికెట్ మ్యాచ్‌లు ఉన్న సమయంలో సినిమాలపై పెద్దగా ప్రభావం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఐసీసీ వరల్డ్ కప్ నడుస్తున్న సమయంలో సినిమాల విడుదల చేయడం అంటే నష్టాలను మూట కట్టుకోవడం అనే అభిప్రాయం అవుతుంది. ఇక గత కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఐపీఎల్ తీవ్రంగా నష్టపరుస్తోంది. ఏడాదిలో దాదాపు రెండు నెలల పాటు సాగే ఐపీఎల్ కారణంగా సినిమాలు తీవ్రమైన నష్టాలను చవిచూస్తున్నాయి. సినిమాలకు సమ్మర్ సీజన్ కీలకం అనే విషయం తెల్సిందే. అదే సమ్మర్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు ఉంటున్న కారణంగా జనాలు సినిమా థియేటర్ల వైపు చూడటం లేదు.
ఐపీఎల్ మ్యాచ్‌లతో బాలీవుడ్ మూవీస్...
గత కొన్ని సంవత్సరాలుగా చాలా సినిమాలు ఐపీఎల్ వల్ల నష్టపోయాయి. బాలీవుడ్‌తో పాటు అన్ని భాషల సినిమాలు ఐపీఎల్ వల్ల నష్టపోతున్నాయి. అందుకే ఐపీఎల్‌కి పోటీగా తమ సినిమాలను విడుదల చేయడానికి కూడా స్టార్ హీరోలు ఆసక్తి చూపడం లేదు. ముందుగా అనుకున్న ప్రకారం ఈ సమ్మర్‌లో రెండు టాలీవుడ్ బడా సినిమాలు విడుదల కావాల్సి ఉంది. కానీ ఇతరత్రా కారణాలు చెప్పి ఆ సినిమాలను విడుదల చేయకుండా వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తే ఆ సినిమాలను వాయిదా వేయడం మంచిది అయిందని, ఇప్పుడు ఆ సినిమాలు విడుదల అయ్యి ఉంటే కచ్చితంగా చాలా పెద్ద నష్టంను చవిచూడాల్సి వచ్చేది అనేది విశ్లేషకుల మాట. ధురంధర్ 2 సినిమాను వారు సాక్ష్యంగా చూపిస్తూ కలెక్షన్స్ లెక్కలను చెబుతున్నారు. ఐపీఎల్ సినిమాలను ఏ స్థాయిలో నష్టపరుస్తున్నాయో ధురంధర్ 2 కి జరిగిన నష్టం ప్రత్యక్ష సాక్ష్యం గా చెప్పుకోవచ్చు.
ధురంధర్ 2 వసూళ్లు డ్రాప్...
రణ్వీర్ సింగ్ హీరోగా ఆధిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన 'ధురంధర్ 2' కి రికార్డ్ స్థాయి ఓపెనింగ్ లభించింది. మొదటి వారంలో దాదాపు వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టింది. సినిమాకు వచ్చిన టాక్ నేపథ్యంలో సుదీర్ఘమైన రన్ ఉంటుందని, తద్వారా రూ.2500 కోట్లకు పైగా వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ ఐపీఎల్ మొత్తం సీన్‌ను మార్చేసింది. ఐపీఎల్ ప్రారంభం అయినప్పటి నుంచి ధురంధర్ 2 సినిమా వసూళ్లు డ్రాప్ అవుతూ వచ్చాయి. కనీసం రూ.2000 కోట్ల వసూళ్లు కూడా నమోదు అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. వీకెండ్స్ లో ధురంధర్ 2 కి భారీ వసూళ్లు నమోదు అవుతాయని భావించారు. కానీ వీకెండ్‌లో ఏకంగా నాలుగు మ్యాచ్‌లు ఉంటున్నాయి. అవి కూడా క్రేజ్ ఉన్న జట్ల మ్యాచ్‌లు కావడంతో ప్రేక్షకులు పూర్తిగా టీవీలకు అతుక్కుపోతున్నారు, లేదంటే స్టేడియం వైపు పరుగులు తీస్తున్నారు.
బైకర్, రాకాసా సినిమాలకు ఐపీఎల్ ఎఫెక్ట్...
థియేటర్‌లకు జనాలు రాకుండా ఐపీఎల్ మ్యాచ్‌లు అడ్డుకుంటున్నాయి. అందుకే ధురంధర్ సినిమా ఏప్రిల్ 6వ తేదీ వరకు అంటే నేటి వరకు కేవలం రూ.1605 కోట్ల వసూళ్లు మాత్రమే చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మరో వంద కోట్ల వసూళ్లు సాధ్యం కావచ్చని, లాంగ్ రన్‌లో ధురంధర్ 2 సినిమా రూ.1750 కోట్ల వద్ద ముగిసే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అంటే ముందుగా విశ్లేషకులు అంచనా వేసిన దాని ప్రకారం రూ.2500 కోట్లు కాకుండా దాదాపు రూ.750 కోట్ల వసూళ్లు తగ్గుతున్నాయి. ఎక్కువ శాతం మంది ఇప్పుడు ఓటీటీలో వస్తుంది కదా చూద్దాం అన్నట్లుగా ఐపీఎల్ మ్యాచ్‌లపై ఆసక్తి చూపుతున్నారు. కేవలం ధురంధర్ 2 మాత్రమే కాకుండా తెలుగు నుంచి ఇటీవల విడుదలైన సినిమాలు సైతం ఐపీఎల్ వల్ల నష్టపోయాయి. బైకర్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ వసూళ్లు అంతంత మాత్రమే అన్నట్లుగా ఉన్నాయి. రాకాసా సినిమా కూడా వసూళ్లు లేక డీలా పడింది. ఇతర సినిమాల పరిస్థితి ఇదే అనే టాక్ వినిపిస్తోంది.
