'దురంధర్'కాస్టింగ్ ఎంపికలో అంత కథ ఉంది
దర్శకుడు ఆదిత్య ధర్‌తో ముఖేష్ చాబ్రాకు ఉన్న పాత స్నేహం ఈ ప్రక్రియలో ఎంతగానో దోహదపడింది.
By: Sivaji Kontham | 26 March 2026 9:30 AM ISTప్రముఖ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన `దురంధర్`, దాని సీక్వెల్ `దురంధర్ 2` బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కేవలం కథ, కథనం మాత్రమే కాకుండా.. ఈ సినిమాలో కనిపించే ప్రతి పాత్ర వాస్తవ రూపాలకు దగ్గరగా ఉండటం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ అద్భుతమైన కాస్టింగ్ వెనుక ఉన్న అసలు కథను ప్రముఖ కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ చాబ్రా తాజాగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసారు. ఈ స్థాయి పర్ఫెక్ట్ కాస్టింగ్ కోసం ఆయన పడిన ప్రయాస ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
దురంధర్ చిత్ర కాస్టింగ్ ప్రక్రియ సాదాసీదాగా జరగలేదు. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమాలో దాదాపు 300 మందికి పైగా నటీనటులు నటించారు. వీరిని ఎంపిక చేయడానికి ముఖేష్ చాబ్రా తన జీవితంలోని రెండు సంవత్సరాల కాలాన్ని వెచ్చించాల్సి వచ్చింది. ఆయనకు తోడుగా ఎనిమిది మంది అసిస్టెంట్లు అహోరాత్రులు శ్రమించి.. ప్రతి చిన్న పాత్రకు సరిపోయే నటుడిని వెతకడమే కాకుండా... వారి లుక్స్ కూడా డిజైన్ చేశారు. ఏ పాత్రను కూడా పైపైన కాకుండా.. అత్యంత లోతుగా పరిశీలించి ఎంపిక చేయడం వల్లే ప్రేక్షకులకు ఆ పాత్రలు అంతగా కనెక్ట్ అయ్యాయని ఆయన వివరించారు.
దర్శకుడు ఆదిత్య ధర్‌తో ముఖేష్ చాబ్రాకు ఉన్న పాత స్నేహం ఈ ప్రక్రియలో ఎంతగానో దోహదపడింది. ఆదిత్య విజన్ పై ముఖేష్‌కు ఉన్న స్పష్టమైన అవగాహన వల్ల వారిద్దరి మధ్య చర్చలు, వాదనలు జరిగినా చివరికి ఒక అద్భుతమైన ఫలితం వచ్చేలా చేశాయి. దర్శకుడు ఏం ఊహిస్తున్నారో తాను వెంటనే విజువలైజ్ చేసుకోగలిగానని.. అందుకే ఎలాంటి గందరగోళం లేకుండా కాస్టింగ్ పూర్తి చేయగలిగామని ముఖేష్ పేర్కొన్నారు. ముఖ్యంగా కాస్టింగ్ విషయంలో బయటి వ్యక్తుల జోక్యం లేకుండా కేవలం తామిద్దరం మాత్రమే నిర్ణయాలు తీసుకోవడం నాణ్యత పెరగడానికి ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.
సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులే కాకుండా సినీ ప్రముఖులు కూడా ఈ కాస్టింగ్ ప్రతిభను వేనోళ్ల కొనియాడుతున్నారు. ముఖ్యంగా రాకేష్ బేడీని ఎప్పుడూ చూడని విధంగా ఒక క్రూరమైన.. వినోదాత్మకమైన పాత్రలో చూపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. నటి ఆహానా కుమ్రా ఈ చిత్రంపై స్పందిస్తూ.. రాకేష్ బేడీ నటనను చూసి ఆయన కుమార్తె గర్వంతో కన్నీళ్లు పెట్టుకోవడం తనను కదిలించిందని పేర్కొన్నారు. సినిమాలో కనిపించే ప్రతి నటుడికి ఆ పాత్ర పట్ల ఉన్న నమ్మకమే ఈ రోజు దురంధర్‌ను ఒక విజువల్ మ్యాజిక్ లాగా మార్చేసింది.
ప్రస్తుతం ప్రేక్షకులు ఈ సినిమాలో ఏ నటుడు ఏ పాత్రను పోషించారు అని ఆసక్తిగా వెతుకుతున్నారు. ముఖ్యంగా అతిక్ అహ్మద్, బాబు డకైత్ వంటి పాత్రల్లో ఒదిగిపోయిన నటుల గురించి చర్చించుకోవడం తమ కష్టానికి దక్కిన గొప్ప ప్రతిఫలమని ముఖేష్ చాబ్రా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నటులను నమ్మి వారికి కెరీర్ బెస్ట్ పాత్రలను అందించినందుకు ముఖేష్ చాబ్రా అండ్ టీమ్‌కు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. కేవలం నటన మాత్రమే కాకుండా.. ఈ చిత్రంలోని ప్రతి ఫ్రేమ్ - విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాస్టింగ్ ఎంపిక కోసమే రెండేళ్లు తీసుకున్నారంటే.. ఈ సినిమా కోసం, తన స్నేహితుడైన ఆదిత్యాధర్ కోసం చాబ్రా ఎంతగా మనసు పెట్టి పని చేసారో అర్థం చేసుకోవచ్చు.
