అక్కడ ధురంధర్ 2 కొత్త హిస్టరీ.. వారణాసి ఏం చేస్తుందో?
దాదాపు తొమ్మిదేళ్లుగా చెక్కుచెదరని బాహుబలి 2 రికార్డును ఆ చిత్రం బ్రేక్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
By: M Prashanth | 30 May 2026 12:14 PM ISTఒకప్పుడు అందనంత ఎత్తులో కనిపించిన బాహుబలి 2: ది కన్ క్లూజన్ రికార్డులను ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు ఒక్కొక్కటిగా బ్రేక్ చేస్తున్నాయని చెప్పాలి. రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన ధురంధర్: ది రివెంజ్ నార్త్ అమెరికా మార్కెట్ లో కొత్త చరిత్ర క్రియేట్ చేసింది. దాదాపు తొమ్మిదేళ్లుగా చెక్కుచెదరని బాహుబలి 2 రికార్డును ఆ చిత్రం బ్రేక్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
గత ఏడాది వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ ధురంధర్ కు సీక్వెల్ గా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ధురంధర్ 2 మొదటి రోజు నుంచే భారీ వసూళ్ల దిశగా దూసుకెళ్లింది. యాక్షన్, ఎమోషన్, భారీ విజువల్స్ తో రూపొందిన ఆ చిత్రం ఓవర్సీస్ లోనూ అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఆ సినిమా కలెక్షన్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి. మొత్తం 28.64 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించి భారతీయ సినిమాల చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇండియన్ కరెన్సీలో ఇది దాదాపు రూ.275 కోట్లకు సమానం.
ఇప్పటి వరకు ఆ రికార్డు బాహుబలి 2: ది కన్ క్లూజన్ పేరిటే ఉండేది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం 2017లో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా అమెరికా మార్కెట్ లో తెలుగు సినిమా స్థాయిని మరో రేంజ్ కు తీసుకెళ్లింది. కానీ ఇప్పుడు అదే రికార్డును ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2 మూవీ బ్రేక్ చేయడం విశేషంగా మారింది. అంతేకాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది.
దాదాపు రూ.1,812 కోట్ల గ్రాస్ తో బాహుబలి 2 రికార్డును కూడా అధిగమించింది. దీంతో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో దంగల్ తర్వాత స్థానంలో ధురంధర్ 2 నిలిచింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి మళ్లీ రాజమౌళి వైపే మళ్ళింది. ఆయన దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న వారణాసి మూవీ.. ధురంధర్ సీక్వెల్ బ్రేక్ చేసిన రికార్డులను తిరిగి బద్దలు కొడుతుందా? అన్న చర్చ మొదలైంది.
2027 ఏప్రిల్ 7న విడుదలకు సిద్ధమవుతున్న ఆ సినిమా.. ఇప్పటికే పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ హైప్ క్రియేట్ చేసుకుంది. సుమారు రూ.1,000 కోట్లకుపైగా బడ్జెట్ తో రూపొందుతున్న ఆ సినిమా.. హై రేంజ్ లో తెరకెక్కుతోంది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ డ్రామాగా మూవీ రెడీ అవుతున్నట్లు సమాచారం. ఓవర్సీస్ లో మహేష్ బాబుకు ఉన్న ఫాలోయింగ్, రాజమౌళి బ్రాండ్ ఇమేజ్, ఇంటర్నేషనల్ రేంజ్ విజువల్స్ కలిస్తే వారణాసి మరోసారి నార్త్ అమెరికా బాక్సాఫీస్ ను షేక్ చేసే అవకాశం ఉంది.
ఒకప్పుడు హాలీవుడ్ కే పరిమితమైన ఓవర్సీస్ మార్కెట్ ను ఇప్పుడు ఇండియన్ సినిమాలు డామినేట్ చేస్తున్నాయి. బాహుబలి 2 నుంచి ప్రారంభమైన ఆ జర్నీని ధురంధర్ 2 మరింత ముందుకు తీసుకెళ్లింది. ఇప్పుడు అందరి కళ్లు వారణాసిపైనే నిలిచాయి. మరి రాజమౌళి మరోసారి తన రికార్డును తానే సాధిస్తారాా? లేక ధురంధర్ 2 డామినేషన్ కొనసాగుతుందా? అన్నది వేచి చూడాలి.
