ధురంధర్ 2: నిజమైన రికార్డులేనా? మ్యానిపులేషనా?
బాహుబలి 2, కేజీఎఫ్ 2, ఆర్.ఆర్.ఆర్, పఠాన్, జవాన్ వంటి చిత్రాల రికార్డులను తిరగరాస్తూ ముందుకు దూసుకెళుతోంది దురంధర్ 2.
By: Sivaji Kontham | 29 March 2026 11:54 PM ISTబాహుబలి 2, కేజీఎఫ్ 2, ఆర్.ఆర్.ఆర్, పఠాన్, జవాన్ వంటి చిత్రాల రికార్డులను తిరగరాస్తూ ముందుకు దూసుకెళుతోంది దురంధర్ 2. అయితే ఈ స్థాయి వసూళ్లతో సంబంధం లేకుండా స్టాక్ మార్కెట్లో ఈ సినిమాని రిలీజ్ చేసిన పీవీఆర్ సినిమాస్ గ్రాఫ్ పడిపోవడం సర్వత్రా చర్చగా మారింది. థియేటర్లలో సినిమా బాగా ఆడుతుంటే స్టాక్ పెరగాలే కానీ పడిపోకూడదు కదా? అని లాజిక్కులు వెతుతున్నారు. అయితే సినిమా బాక్సాఫీస్ వసూళ్లకు స్టాక్ మార్కెట్ కు సంబంధం ఏమిటి? ఇలా చూడటం ప్రామాణికమా? అంటే ఇది సరైనది కాదని కూడా విశ్లేషిస్తున్నారు.
ఈ సినిమా సక్సెస్ చుట్టూ మునుపెన్నడూ లేని విధంగా ఒక పెద్ద వివాదం మొదలైంది. బాక్సాఫీస్ నంబర్లను కావాలని పెంచి చూపిస్తున్నారని.. అలాగే ఫేక్ బుకింగ్స్.. కార్పొరేట్ బుకింగ్స్ ద్వారా వసూళ్లను భారీగా చూపిస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు. సినిమాలోని సీన్లపై కొన్ని రాజకీయ వర్గాల నుంచి విముఖత వ్యక్తం చేస్తుంటే.. అధికారికంగా ప్రకటిస్తున్న కలెక్షన్లు మాత్రం ఆకాశాన్ని తాకుతుండటం ఈ అనుమానాలకు ప్రధాన కారణమవుతోంది.
ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది స్టాక్ మార్కెట్ పరిణామాలు. `ధురంధర్ 2` థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతున్న సమయంలోనే ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ పీవీఆర్ ఐనాక్స్ షేర్లు సుమారు 8 శాతం పడిపోవడం చర్చనీయాంశంగా మారింది. థియేటర్లలో సినిమా అంత బాగా ఆడుతుంటే.. టికెట్ల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంతో స్టాక్ విలువ పెరగాలి కానీ పడిపోకూడదు కదా అని నెటిజన్లు లాజిక్కులు వెతుకుతున్నారు. ఇదే అంశాన్ని ఆధారం చేసుకుని బాక్సాఫీస్ లెక్కలపై కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే బాక్సాఫీస్ వసూళ్లకు... స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులకు నేరుగా సంబంధం ఉంటుందా? అంటే అది సరైన ప్రామాణికం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో `పఠాన్`, `జవాన్` వంటి ఆల్-టైమ్ బ్లాక్‌బస్టర్ హిట్ల సమయంలో కూడా పీవీఆర్ షేర్లు తగ్గిన సందర్భాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్ అనేది కేవలం ఒక సినిమా కలెక్షన్లపైనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, కంపెనీ ఆర్థిక వ్యూహాలు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి కేవలం షేర్ల విలువ తగ్గడాన్ని బట్టి వసూళ్లు ఫేక్ అని చెప్పలేం.
ధురంధర్ 2 విజయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెజారిటీ ప్రేక్షకులు దీన్ని ఒక భారీ బ్లాక్‌బస్టర్‌గానే భావిస్తున్నా.. బాక్సాఫీస్ పారదర్శకతపై ఆడియన్స్‌లో ఇంత పెద్ద ఎత్తున చర్చ జరగడం ఒక కీలక పరిణామం. వసూళ్ల విషయంలో మేకర్స్ మరింత పారదర్శకత పాటించాలనే డిమాండ్ ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది.
