3 రోజుల్లోనే రూ.500 కోట్లు.. ధురంధర్ బాక్సాఫీస్ సునామీ..
శనివారం ఒక్కరోజే రూ.113 కోట్ల వసూళ్లు సాధించడం సినిమా జోరును క్లియర్ గా చూపిస్తోంది.
By: M Prashanth | 22 March 2026 1:09 PM ISTబాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ స్పై థ్రిల్లర్ ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం విడుదలైన కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.501.04 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి సంచలనం రేపుతోంది. ఇండియన్ సినిమా చరిత్రలో మూడు రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్ లోకి చేరిన అరుదైన చిత్రాలలో ఇది ఒకటిగా నిలిచింది.
ఇప్పటికే బాహుబలి 2: ది కన్ క్లూజన్, పుష్ప 2: ది రూల్ తర్వాత ఆ ఘనత సాధించిన చిత్రంగా ధురంధర్ 2 నిలవడం విశేషం. ముఖ్యంగా కేవలం హిందీ వెర్షన్ తోనే ఆ రేంజ్ స్థాయి వసూళ్లు రావడం మామూలు విషయం కాదు. ట్రేడ్ వెబ్ సైట్ సాక్నిల్క్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఆ చిత్రం ఇండియాలోనే రూ.339 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. విదేశీ మార్కెట్‌లో రూ.96 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి.
శనివారం ఒక్కరోజే రూ.113 కోట్ల వసూళ్లు సాధించడం సినిమా జోరును క్లియర్ గా చూపిస్తోంది. ఇక ఆదివారం వీకెండ్ కావడంతో థియేటర్ల వద్ద భారీగా ప్రేక్షకుల రద్దీ కనిపిస్తోంది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.77 కోట్లకు పైగా వసూళ్లు రావడం విశేషం. నేటి కలెక్షన్లతో కలిపి ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే రూ.700 కోట్ల మార్కును దాటే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి.
అదే సమయంలో తెలుగు, తమిళ భాషల్లో కూడా సినిమా విడుదల కావడంతో దక్షిణాది మార్కెట్ లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ చిత్రానికి అన్ని ప్రాంతాల్లో భారీ ఆక్యుపెన్సీ నమోదవుతోంది. మొదటి వీకెండ్ ముగిసేసరికి ఇండియాలో అత్యధిక ఓపెనింగ్ రికార్డు సాధించే అవకాశాలు ధురంధర్ 2కు ఉన్నాయనే చెప్పాలి.
ప్రస్తుతం ఆ రికార్డు అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 పేరిట ఉంది. ఆ చిత్రం ఇండియాలో రూ.354 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. అయితే ధురంధర్ 2 అదే రికార్డును అధిగమించే దిశగా దూసుకుపోతోంది. ధురంధర్ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఆ చిత్రం మొదటి భాగం సక్సెస్ ను మరింతగా పెంచింది. తొలి భాగం ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్ల వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు సీక్వెల్ జోరు చూస్తుంటే ఆ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉందని చెప్పాలి. సినిమాలో రణవీర్ సింగ్ పోషించిన జస్కిరాత్ సింగ్ రంగీ అనే గూఢచారి పాత్రకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అలాగే అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ సహా పలువురు నటీనటుల యాక్టింగ్ సినిమాకు మరింత బలం చేకూర్చింది. మొత్తానికి ధురంధర్ 2 ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఇదే జోష్ కంటిన్యూ అయితే.. వారం రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్ లోకి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో..
అంచనాల ప్రకారం కలెక్షన్స్..
పెయిడ్ ప్రివ్యూల కలెక్షన్స్: 45 కోట్లు
మొదటి రోజు: 103 కోట్లు
2వ రోజు: 81 కోట్లు
3వ రోజు: 113 కోట్లు
టోటల్ ఇండియాలో: 342 కోట్లు
వరల్డ్ వైడ్: 501 కోట్లు
