ధురంధర్-2 : 'బాహుబలి-2' రికార్డును అందుకోవడం కష్టమే
అయితే ఈ చిత్రం ఎంతటి ప్రభంజనం సృష్టించినా.. బాక్సాఫీస్ వద్ద అగ్రస్థానంలో ఉన్న ఇతర భారతీయ చిత్రాల రికార్డులను బ్రేక్ చేయడం మాత్రం అంత సులువుగా కనిపించడం లేదు.
By: Sivaji Kontham | 2 April 2026 9:20 AM ISTబాక్సాఫీస్ వద్ద `ధురంధర్-2` కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా వసూళ్లపై సోషల్ మీడియాలో కొన్ని వెబ్‌సైట్లలో రకరకాల కథనాలు వస్తున్నా.. విశ్వసనీయమైన ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రం ఇప్పటికే రూ. 1400 కోట్ల మైలురాయిని అలవోకగా అధిగమించింది. విడుదలైన కేవలం 14 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 1435 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి.. భారతీయ సినిమా సత్తాను మరోసారి చాటిచెప్పింది. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే.. ఈ సినిమా రూ. 1500 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే రోజుకు 10కోట్ల చొప్పున వసూలు చేస్తున్న ఈ చిత్రానికి ఈ ఫీట్ అందుకోవడానికి ఇంకో వారం పైగా పడుతుందని అంచనా.
భారతదేశం గడ్డపై ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కేవలం దేశీయంగానే రూ. 1091.42 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి.. వెయ్యి కోట్ల మార్కును దాటేసింది. నెట్ వసూళ్ల పరంగా చూస్తే.. ఇండియాలో రూ. 911.79 కోట్లు రాబట్టిన మూడవ చిత్రంగా `ధురంధర్-2` నిలిచింది. మిగిలిన వసూళ్లను విదేశీ మార్కెట్ నుండి రాబట్టి.. ఓవర్సీస్‌లోనూ హవా సాగించింది. బాలీవుడ్ చిత్రాల చరిత్రలో ఇది ఒక కొత్త బెంచ్‌మార్క్‌గా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఈ చిత్రం ఎంతటి ప్రభంజనం సృష్టించినా.. బాక్సాఫీస్ వద్ద అగ్రస్థానంలో ఉన్న ఇతర భారతీయ చిత్రాల రికార్డులను బ్రేక్ చేయడం మాత్రం అంత సులువుగా కనిపించడం లేదు. ముఖ్యంగా `పుష్ప-2` నెలకొల్పిన రూ. 1742 కోట్ల రికార్డును అందుకోవడం ఈ సినిమాకు ఒక పెద్ద సవాలుగా మారనుంది. రెండో వారంలో వసూళ్ల వేగం తగ్గడం వల్ల ఈ భారీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ చిత్రం ఇంకా చాలా కష్టపడాల్సి ఉంటుంది.
ఇక ఎదురేలేని రికార్డుతో స్థిరంగా ఉన్న `బాహుబలి-2` గురించి చెప్పక్కర్లేదు. బాహుబలి-2 పేరిట ఉన్న రూ. 1820 కోట్ల మార్కును చేరుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో `ధురంధర్-2`కు అసాధ్యమని ట్రేడ్ విశ్లేషకులు కుండబద్దలు కొడుతున్నారు. దేశీయ నెట్ వసూళ్లలో రూ. 900 కోట్ల మార్కును దాటి `పుష్ప-2`, `బాహుబలి-2` తర్వాత మూడవ స్థానంలో నిలిచినా..ఆ రెండు చిత్రాల అంతిమ వసూళ్లను దురంధర్ చేరుకోవడం ఆషామాషీ కాదని విశ్లేషిస్తున్నారు.
తాజా గణాంకాల ప్రకారం..14వ రోజున ఈ చిత్రం దేశవ్యాప్తంగా 12,178 షోల ద్వారా సాయంత్రం 5 గంటల సమయానికే రూ. 11.87 కోట్లు వసూలు చేసింది. బాలీవుడ్ లో కొన్ని వెబ్ సైట్ల ప్రకారం.. కలెక్షన్స్ వేగంగా డ్రాప్ అవుతున్నాయి. దీనికి తోడు అగ్రహీరో అక్షయ్ కుమార్ నటించిన బూత్ బంగ్లా విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగు సహా పలు భాషల్లో క్రేజీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. దీని ప్రభావం దురంధర్ 2 వసూళ్లపై ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి `ధురంధర్-2` ఒక సెన్సేషన్ క్రియేట్ చేసినా.. బాహుబలి స్థాయి రికార్డులను తిరగరాయడం మాత్రం ప్రస్తుతానికి కలగానే మిగిలిపోయేలా ఉందని ట్రేడ్ విశ్లేషిస్తోంది.
