ధురంధర్ 2: 32 రోజుల కలెక్షన్స్.. మరో బిగ్ రికార్డుకు అడుగు దూరంలో..
ఈ జోరు చూస్తుంటే మరో రెండు రోజుల్లోనే బాహుబలి 2 ని వెనక్కి నెట్టి ఇండియన్ ఆల్ టైమ్ టాప్ 2 సినిమాగా నిలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
By: M Prashanth | 20 April 2026 1:05 PM ISTబాక్సాఫీస్ దగ్గర గత కొన్ని వారాలుగా ఒకటే పేరు మారుమోగుతోంది. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన స్పై థ్రిల్లర్ 'ధురంధర్: ది రివెంజ్' సృష్టిస్తున్న వసూళ్ల జోరు ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గతంలో వచ్చిన స్పై సినిమాలు ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు అనేలా థియేటర్ల దగ్గర జనం రెస్పాన్స్ కనిపిస్తోంది. సాధారణంగా బాలీవుడ్ సినిమాలు సౌత్ రికార్డులను టచ్ చేయడం కష్టమని భావించే తరుణంలో, ఈ చిత్రం మాత్రం దక్షిణాది భారీ చిత్రాల వసూళ్లకు గట్టి పోటీనిస్తోంది.
విజువల్ గ్రాఫిక్స్ లేదా భారీ సెట్టింగుల హడావుడి లేకుండా, కేవలం గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఒక సినిమా ఇంతటి స్థాయికి చేరుకోవడం గమనించాల్సిన విషయం. దాదాపు నాలుగు గంటల నిడివి ఉన్నప్పటికీ, ఆడియన్స్ ఎక్కడా బోర్ ఫీల్ అవ్వకుండా కథను నడిపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. రణవీర్ సింగ్ తన కెరీర్ లోనే అత్యుత్తమ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని పబ్లిక్ టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఒక నెల రోజులుగా బాక్సాఫీస్ దగ్గర నాన్ స్టాప్ గా పెద్ద పెద్ద సినిమాల రికార్డులను ఒక్కొక్కటిగా బ్రేక్ చేస్తోంది.
వసూళ్ల లెక్కల విషయానికి వస్తే, ధురంధర్ కేవలం 32 రోజుల్లోనే కళ్ళు చెదిరే నంబర్లను అందుకుంది. అల్లు అర్జున్ 'పుష్ప 2' లైఫ్ టైమ్ కలెక్షన్స్ (రూ.1742 కోట్లు) ఇప్పటికే దాటేసిన ఈ చిత్రం, ఇప్పుడు టాలీవుడ్ ప్రైడ్ 'బాహుబలి 2' ని టార్గెట్ చేసింది. ఐదో వీకెండ్ లో కూడా స్ట్రాంగ్ హోల్డ్ చూపిస్తూ, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1783 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
కేవలం ఇండియాలోనే రూ.1153 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టడం చూస్తుంటే, బాహుబలి 2 రికార్డు బ్రేక్ అవ్వడానికి కేవలం ఆరు కోట్ల దూరంలోనే ఉందని అర్థమవుతోంది. ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఈ సినిమా సత్తా చాటుతోంది. కొన్ని దేశాల్లో ఈ చిత్రంపై నిషేధం ఉన్నప్పటికీ, మిగతా చోట్ల రూ.423 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టడం విశేషం. ఇండియాలో గ్రాస్ వసూళ్లు రూ.1360 కోట్లకు చేరుకున్నాయి.
5వ వారం బాక్సాఫీస్ లెక్కలు
శుక్రవారం రూ.3 కోట్లు,
శనివారం రూ.5 కోట్లు
ఆదివారం రూ.5.50
వీకెండ్ లో మొత్తం రూ.13.50 కోట్లు
ఈ జోరు చూస్తుంటే మరో రెండు రోజుల్లోనే బాహుబలి 2 ని వెనక్కి నెట్టి ఇండియన్ ఆల్ టైమ్ టాప్ 2 సినిమాగా నిలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే రూ.2000 కోట్ల క్లబ్ లో చేరడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత సవాలుతో కూడుకున్న పని. చైనా, జపాన్ మార్కెట్లలో స్పై సినిమాలకు ఉండే ఆదరణ తక్కువే, మరికొన్ని విదేశీ మార్కెట్లలో ఉన్న ఇబ్బందులు దీనికి అడ్డంకిగా మారవచ్చు. కానీ కేవలం కంటెంట్ ను నమ్ముకుని ఇంతటి ఘనవిజయాన్ని అందుకోవడం అనేది బాలీవుడ్ కు ఒక బూస్ట్ లాంటిదే.
రణవీర్ సింగ్ తో పాటు సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి నటుల పర్ఫెక్ట్ కాస్టింగ్ కూడా ఈ స్థాయి వసూళ్లకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. మొత్తానికి 'ధురంధర్: ది రివెంజ్' ఇండియన్ సినిమా కలెక్షన్ల లెక్కలను మార్చేస్తోంది. భారీ వీఎఫ్ఎక్స్ సినిమాలు మాత్రమే రూ.1500 కోట్లు దాటుతాయనే అభిప్రాయాన్ని ఈ సినిమా చెరిపేసింది. ఇక మిగిలింది కేవలం ఆరు కోట్లు మాత్రమే, అది కూడా దాటేస్తే ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర దంగల్ తర్వాత అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో చిత్రంగా హిస్టరీ క్రియేట్ చేస్తుంది.
ధురంధర్ 32 రోజుల కలెక్షన్ల వివరాలు:
ఇండియా నెట్ వసూళ్లు: రూ.1,153 కోట్లు
ఇండియా గ్రాస్ వసూళ్లు: రూ.1,360 కోట్లు
ఓవర్సీస్ గ్రాస్ వసూళ్లు: రూ.423 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్: రూ.1,783 కోట్లు
