Begin typing your search above and press return to search.

టీజ‌ర్ టాక్‌:భీభ‌త్సం..భ‌యాన‌కం అన్ లిమిటెడ్‌!

ఫ‌స్ట్ పార్ట్‌లో మితిమీరిన హింస‌, భ‌యాన‌క స‌న్నివేశాల‌ని చూపించిన ద‌ర్శ‌కుడు ఆదిత్య‌ధ‌ర్ రివేంజ్‌లో మాత్రం అంత‌కు మించి అన్న‌ట్టుగా తెర‌పై ఆవిష్క‌రించిన‌ట్టుగా తెలుస్తోంది.

By:  Tupaki Entertainment Desk   |   3 Feb 2026 1:21 PM IST
టీజ‌ర్ టాక్‌:భీభ‌త్సం..భ‌యాన‌కం అన్ లిమిటెడ్‌!
X

ర‌ణ్‌వీర్ సింగ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన భారీ యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ `ధురంధ‌ర్`. ఆదిత్య ధ‌ర్ తెర‌కెక్కించిన ఈ న్యూ ఏజ్ స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ డ్రామా దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నాలు సృష్టించింది. పాక్ మ‌ద్దుతు దారుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తించింది. బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయిలో వ‌సూళ్ల సునామీని సృష్టించి స‌రికొత్త రికార్డుల్ని తిర‌గ‌రాసింది. వ‌రుస ఫ్లాపుల‌తో ఉన్న బాలీవుడ్‌కు నూత‌నోత్తేజాన్ని అందించింది. అంతే కాకుండా త‌న‌దైన మార్కు హిట్ కోసం ఎదురు చూస్తున్న ర‌ణ్‌వీర్ సింగ్ కెరీర్‌ని మ‌రో మ‌లుపు తిప్పింది.

బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయిలో వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.1340 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబట్టి ర‌ణ్‌వీర్ సింగ్ సినిమాల్లో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింది. రా కంటెంట్‌తో స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాశంగా మారిన ఈ సినిమా ఇండియా వైడ్‌గా హాట్‌టాపిక్‌గా నిల‌వ‌డం తెలిసిందే. ప్ర‌పంచ వ్యాప్తంగా `ధురంధ‌ర్‌` సంచ‌ల‌నం సృష్టించ‌డంతో దీనికి సీక్వెల్‌గా రానున్న పార్ట్ 2 ది రివేంజ్‌పై అంద‌రి దృష్టిప‌డింది. పార్ట్ 1లోనే ఈ స్థాయిలో హింస‌,అత్యంత భ‌యాన‌క స‌న్నివేశాలు, కుట్ర‌లు, కుతంత్రాలు ఉంటే పార్ట్ 2 ది రివేంజ్‌లో ర‌ణ్‌వీర్ ఇక శివ తాండ‌వ‌మే ఆడి ఉంటాడ‌ని అంతా భావిస్తున్నారు.

దీంతో మార్చి 19న రిలీజ్ కానున్న పార్ట్ 2 కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే టీమ్ మంగ‌ళ‌వారం టీజ‌ర్‌ని విడుద‌ల చేసి అంత‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇటీవ‌లే టీజ‌ర్‌ సెన్సార్‌ని కూడా పూర్తి చేసి షాక్ ఇచ్చిన టీమ్ మంగ‌ళ‌వారం చెప్పిన‌ట్టే 12:12 నిమిషాల‌కు ఐదు భాష‌ల్లో `ధురంధ‌ర్ 2:ది రివేంజ్‌` టీజ‌ర్‌ని విడుద‌ల చేసింది. ఫ‌స్ట్ పార్ట్‌లో మితిమీరిన హింస‌, భ‌యాన‌క స‌న్నివేశాల‌ని చూపించిన ద‌ర్శ‌కుడు ఆదిత్య‌ధ‌ర్ రివేంజ్‌లో మాత్రం అంత‌కు మించి అన్న‌ట్టుగా తెర‌పై ఆవిష్క‌రించిన‌ట్టుగా తెలుస్తోంది.

టీజ‌ర్ నిడివి 1:12 సెకండ్స్. డైలాగ్స్ లేకుండా పూర్తి హింసాత్మ‌క స‌న్నివేశాల‌తో టీజ‌ర్‌ని క‌ట్ చేశారు. ర‌ణ్‌వీర్‌సింగ్ బ్యాగ్ ఓపెన్ చేస్తున్న విజువ‌ల్స్‌తో మొద‌లైన టీజ‌ర్ ఆ త‌రువాత ర‌క్తాపాతంలో సాగుతూ భీభ‌త్సం, భ‌యాన‌కం వంటి ఫీలింగ్స్‌ని క‌లిగిస్తుంది. త‌రువాత సీన్‌లో తెగిప‌డి ర‌క్తం కారుతున్న చేయి, మెగ‌డ‌తెగి క‌త్తికే ఉన్న త‌ల‌, బాడీ..ట్రాక్ట‌ర్ ఐర‌న్ నాగ‌లికి దిగిన ఓ బాడీ..అవ‌న్నీ చూస్తూ గ‌న్ లోడ్ చేసుకుని ఫైరింగ్‌కి వెళుతున్న ర‌ణ్‌వీర్.. క‌ట్ చేస్తే...బాలోచ్ లీడ‌ర్‌ని గ్యాంగ్ స్ట‌ర్ హోదాలో ర‌ణ్‌వీర్ క‌లిసిన విజువ‌ల్స్‌..ల్యారీలో గ్యాంగ్‌స్ట‌ర్ల‌ని ఏకం చేసి ర‌ణ్‌వీర్ గ‌న్ పేల్చ‌డం..

ఆ త‌రువాత అత్యంత కిరాత‌కంగా, విచ‌క్ష‌ణా ర‌హితంగా గొడ్డ‌లితో ర‌ణ్‌వీర్ దాడి చేయ‌డం..పాక్‌లో కీల‌క గ్యాంగ్‌ల‌ని త‌న చెప్పుచేతుల్లోకి తీసుకుని డాన్ హోదాలోకి ర‌ణ్‌వీర్ చేర‌డం.. భ‌యాన‌క స‌న్నివేశాల‌తో టీజ‌ర్ ఎండ్ వ‌ర‌కు సాగ‌డం..టీజ‌ర్ ఎండ్‌లో ఇది నూత‌న భార‌త‌దేశం..స‌రిహ‌ద్దులు దాటి చొర‌బ‌డుతుంది..దెబ్బ‌కొట్టి తీరుతుంది` అనే ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్‌తో ఎండ చేస్తూ సినిమా రిలీజ్ డేట్‌ని ప్ర‌క‌టించ‌డం ఆక‌ట్టుకుంటోంది. `ధురంధ‌ర్ 2` ఎలాంటి భీభ‌త్స‌మైన కంటెంట్‌తో ఉంటుంద‌ని అంతా ఊహించారో అంత‌కు మించిన స‌న్నివేశాల‌తో భీభ‌త్సం, భ‌యానకాన్ని క‌లిగించే స్థాయిలో దీన్ని రూపొందించిన‌ట్టుగా టీజ‌ర్‌తో హింట్ ఇచ్చేశారు. ఓవ‌రాల్‌గా టీజ‌ర్ గురించి చెప్పాలంటే భీభ‌త్సం..భ‌యాన‌కం అన్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. ఫ‌స్ట్ పార్ట్‌తోనే వివాదాల‌కు తెర‌లేపిన `ధురంధ‌ర్‌` పార్ట్ 2 ది రివేంజ్‌తో ఎలాంటి సంచ‌ల‌నాలు, డిబేట్‌ల‌కు తెర‌లేపుతుందో తెలియాలంటే మార్చి 19 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.