ఎట్టకేలకు వీడుతోన్న ధృవ నక్షత్రం చిక్కుముడులు!
చియాన్ విక్రమ్ కథానాయకుడిగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన `ధృవ నక్షత్రం` రిలీజ్ విషయంలో జరుగుతోన్న జాప్యం గురించి తెలిసిందే.
By: Srikanth Kontham | 15 Jun 2026 9:51 PM ISTచియాన్ విక్రమ్ కథానాయకుడిగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన `ధృవ నక్షత్రం` రిలీజ్ విషయంలో జరుగుతోన్న జాప్యం గురించి తెలిసిందే. ఈ హై-వోల్టేజ్ స్పై థ్రిల్లర్ అనేక ఆర్థిక ఇబ్బందులు - చట్టపరమైన చిక్కుల కారణంగా లాబ్స్‌కే పరిమితమైపోయింది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి సానుకూల పరిణామం అభిమానుల్లో సరికొత్త ఆశలను రేకెత్తిస్తోంది. కొంతకాలంగా కోర్టు చుట్టూ తిరుగుతున్న ఈ సినిమా ఆర్థిక వివాదాలకు ఎట్టకేలకు ఊరట లభించింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఆర్థిక లావాదేవీల కేసులో న్యాయస్థానం నుండి చిత్ర బృందానికి అనుకూలంగా ఉపశమనం లభించినట్లు తెలుస్తోంది.
థియేట్రికల్ విడుదలకు ఇన్నాళ్లుగా అడ్డుపడుతున్న చట్టపరమైన అడ్డంకులు తాజా తీర్పుతో దాదాపు తొలగిపోయినట్లేనని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. సంవత్సరాల తరబడి నిరీక్షిస్తున్న నిర్మాతలకు, దర్శకుడికి న్యాయస్థాన నిర్ణయం పెద్ద ఊపిరి లాంటిదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదుపరి అడుగులపై దృష్టి సారించారు. సినిమా విడుదలకు సంబంధించిన మిగిలిన సాంకేతిక, ఆర్థిక ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి .. థియేటర్ల సర్దుబాటు, ప్రమోషన్లను సక్రమంగా నిర్వహించడానికి ఆయనకు మరికొంత సమయం అవసరమైంది.
ఈ క్రమంలోనే విడుదల జూలై 15 వరకు పొడిగించాలని లేదా ఆ తేదీ లోపు గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి అనుమతించాలని గౌతమ్ న్యాయస్థానాన్ని కోరినట్లు సమాచారం. ఈ గడువు లభిస్తే ప్రణాళికాబద్ధంగా ప్రమోషన్లు నిర్వహించి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చని మేకర్స్ భావిస్తున్నారు. `ధృవ నక్షత్రం` సినిమాపై ఇన్నాళ్లుగా అంచనాలు తగ్గకపోవడానికి ప్రధాన కారణం విక్రమ్ -గౌతమ్ మీనన్‌ల క్రేజీ కాంబినేషనే. టీజర్లు, సాంగ్స్‌లో విక్రమ్ లుక్ , స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.
సినిమా ఆలస్యమైనప్పటికీ హాలీవుడ్ స్థాయి మేకింగ్ వాల్యూస్ కలిగిన స్పై థ్రిల్లర్ ఖచ్చితంగా థియేటర్లలో సరికొత్త అనుభూతిని ఇస్తుందని యాక్షన్ ప్రేమికులు బలంగా నమ్ముతున్నారు. విక్రమ్ నటన, గౌతమ్ మీనన్ మార్కు స్క్రీన్ ప్లే చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా విజయం గౌతమ్ కి ఎంతో కీలమైంది. ఇప్పటికే దర్శకుడిగా అవకాశాలు రాకపోవడంతో నటుడిగా చిన్న చిన్న పాత్రలు పోషిస్తున్నారు. గతంలో ఎన్నో క్లాసిక్ హిట్స్ ఇచ్చినా? గౌతమ్ డైరెక్టర్ల రేసులో లేకపోవడంతో ఆయన కంబ్యాక్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
