Begin typing your search above and press return to search.

ఆ ప్రక్రియ తండ్రి కొడుకుల మధ్య దూరం పెంచిందా.. ఓటీటీపై ధ్రువ్ నిరాశ!

దీనిపై ధ్రువ్ మాట్లాడుతూ.. "మహాన్ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని నేను కోరుకున్నాను. కానీ అది నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయడంతో తీవ్ర నిరాశకు గురయ్యాను.

By:  Madhu Reddy   |   12 Oct 2025 1:38 PM IST
ఆ ప్రక్రియ తండ్రి కొడుకుల మధ్య దూరం పెంచిందా.. ఓటీటీపై ధ్రువ్ నిరాశ!
X

సాధారణంగా కొన్ని కొన్ని నిర్ణయాలు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలను పెంచుతాయన్న విషయం తెలిసిందే. సరిగ్గా తన సినిమా విషయంలో అలాగే జరిగిందంటూ ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో కొడుకు ధ్రువ్ విక్రమ్ కామెంట్లు చేశారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ప్రముఖ నటుడు విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా రాబోతున్న చిత్రం బైసన్. ఈ దీపావళి సందర్భంగా అక్టోబర్ 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడిన నేపథ్యంలో ధ్రువ్ విక్రమ్ తన సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో వేగంగా పాల్గొంటున్నారు.అందులో భాగంగానే మహాన్ సినిమా విడుదల విషయంలో తండ్రి కొడుకుల మధ్య చిన్నపాటి దూరం పెరిగిందని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో ధ్రువ్ విక్రమ్ చెప్పిన ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది..

అసలు విషయంలోకి వెళ్తే.. 2022లో సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఎస్.ఎస్.లలిత్ కుమార్ నిర్మాణంలో కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన చిత్రం మహాన్. విక్రమ్ చియాన్, ధ్రువ్ విక్రమ్ పాటు సిమ్రాన్ , బాబీ సింహ, వాణి భోజన్ కీలక పాత్రలు పోషించారు. అయితే మొదట ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాలవల్ల 2022 ఫిబ్రవరి 9న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు. అయితే ఈ ఓటీటీ విడుదలపైనే ఇప్పుడు ధ్రువ్ విక్రమ్ అసహనం వ్యక్తం చేశారు.

దీనిపై ధ్రువ్ మాట్లాడుతూ.. "మహాన్ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని నేను కోరుకున్నాను. కానీ అది నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయడంతో తీవ్ర నిరాశకు గురయ్యాను. మా నాన్నతో కలిసి పనిచేయడం నాకు చాలా ఇష్టం. అయితే ఆ సినిమా ప్రతికూలత మా మధ్య దూరాన్ని సృష్టించింది. ఓటీటీ విడుదల మా ప్రయత్నాలను వృధా చేసింది" అంటూ తెలిపారు ధ్రువ్ విక్రమ్.

అయితే ఈయన అభిప్రాయాన్ని చాలామంది అభిమానులు సమర్ధించారు. మహాన్ సినిమా థియేటర్లలో విడుదల అవ్వాల్సిన సినిమా. ముఖ్యంగా కార్తీక్ సుబ్బరాజు ఉత్తమ చిత్రాలలో మహాన్ సినిమా ఒకటి అంటూ ప్రశంసించారు. కానీ మరి కొంతమంది దీనిని అంగీకరించలేదు. మహాన్ సినిమా ఒక సగటు సినిమా మాత్రమే. ఇది ఓటీటీ విడుదల సరైనదే. ముఖ్యంగా బాక్స్ ఆఫీస్ డిజాస్టర్ ను తప్పించి .. ఓటీటీ ఒప్పంద జట్టుకు నష్టాలకు బదులుగా లాభాలను చేకూర్చింది అంటూ తెలిపారు.

మొత్తానికైతే మహాన్ సినిమా థియేటర్లలో కాకుండా ఓటీటీ లో విడుదల చేశారు అనే బాధ తన తండ్రితో.. కొంతకాలం తనకు దూరం పెంచిందని.. ఆ తర్వాత సమస్యలు సద్దుమణిగాయని ధ్రువ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.