Begin typing your search above and press return to search.

ధ్రువ్ విక్రమ్.. ఈ క్రేజ్‌కు ఆ స్పీడ్ లేదే!

లాంగ్ హెయిర్, చెక్స్ షర్ట్, పక్కన రాయల్ ఎన్‌ఫీల్డ్‌తో ధ్రువ్ విక్రమ్ చేసిన ఫొటోషూట్ ఆకట్టుకుంటోంది.

By:  M Prashanth   |   1 Nov 2026 10:05 AM IST
ధ్రువ్ విక్రమ్.. ఈ క్రేజ్‌కు ఆ స్పీడ్ లేదే!
X

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క ఫొటో పోస్టుకు నాలుగు లక్షలకు పైగా లైక్స్. కానీ ఆ ఫొటోలు పెట్టిన హీరో ఏడేళ్లలో చేసిన సినిమాలు మాత్రం వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. లాంగ్ హెయిర్, చెక్స్ షర్ట్, పక్కన రాయల్ ఎన్‌ఫీల్డ్‌తో ధ్రువ్ విక్రమ్ చేసిన ఫొటోషూట్ ఆకట్టుకుంటోంది. అక్టోబర్ చివరి సూర్యాస్తమయం అంటూ ‘ది బెస్ట్ ఈజ్ యెట్ టు కమ్’ అని క్యాప్షన్ పెట్టారు. ఆ మాటను ఆయన కెరీర్‌కు కలిపి చూస్తే ఒక ఆసక్తికరమైన తేడా కనిపిస్తోంది.

2019లో ‘ఆదిత్య వర్మ’తో హీరోగా వచ్చిన ధ్రువ్, 2022లో ‘మహాన్’లో తండ్రి విక్రమ్‌తో కలిసి నటించారు. మళ్లీ 2025లో ‘బైసన్’తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మధ్యలో ‘ఆదిత్య వర్మ’కు ముందుగా చిత్రీకరించిన మరో వెర్షన్ ‘వర్మ’ కూడా విడుదలైంది. అయినా కొత్త కథలతో వచ్చిన ప్రధాన సినిమాలు మూడే. ఒక్కోదానికి మధ్య దాదాపు మూడేళ్ల గ్యాప్ ఉండటం విశేషం. ‘బైసన్’ కోసం ఆయన చాలాకాలం శిక్షణ తీసుకున్నారు.

‘ఆదిత్య వర్మ’ తెలుగు ‘అర్జున్ రెడ్డి’ రీమేక్. ‘మహాన్’లో విక్రమ్ కూడా అసలు హైలెట్. ఈ రెండు సినిమాల తర్వాత ధ్రువ్ స్వయంగా సినిమాను నడిపించగలరా అనే ప్రశ్నకు ‘బైసన్’ సమాధానమిచ్చింది. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో కబడ్డీ ఆటగాడిగా నటించేందుకు ఫిజికల్ గా కూడా మారారు. నటనకు ప్రశంసలు వచ్చాయి. బాక్సాఫీస్ దగ్గర కూడా సినిమా మంచి ఫలితం అందుకుంది. తండ్రి పేరు కన్నా తన నటన గురించి మాట్లాడుకునే అవకాశం అప్పుడే దక్కింది.

ఆ విజయం తర్వాత ధ్రువ్ వెంటనే మరో స్పోర్ట్స్ డ్రామా చేయలేదు. ఇప్పుడు ‘జాకీ’లో సినిమా హీరో కోసం ప్రమాదకరమైన స్టంట్స్ చేసే డూప్‌గా నటిస్తున్నారు. తెరపై పేరు హీరోకు వస్తుంది. ఫైట్‌లో రిస్క్ మాత్రం మరొకరు తీసుకుంటారు. విక్రమ్ కొడుకు తన నాలుగో సినిమాలో హీరో వెనుక పనిచేసే మనిషిగా కనిపించడం ఆసక్తికరం. సెప్టెంబర్‌లో వచ్చిన గ్లింప్స్‌లో ఈ పాత్రను పరిచయం చేశారు.

‘బైసన్’లో నటుడిగా పేరు తెచ్చుకున్న వెంటనే ధ్రువ్ కమర్షియల్ సినిమాకు వెళ్తున్నారు. ‘జాకీ’లో యాక్షన్, ఎంటర్టైన్మెంట్ కి ప్రాధాన్యం ఉంటుందని చిత్రబృందం ప్రకటించింది. ఆయన ఇప్పటివరకు చేసిన పాత్రల్లో ప్రేమకథ, తండ్రీకొడుకుల మధ్య సంఘర్షణ, క్రీడా నేపథ్యం ఉన్నాయి. ఈసారి మాత్రం స్టంట్‌మ్యాన్ పాత్రతో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. సినిమా సినిమాకూ మూడేళ్ల గ్యాప్ వస్తే ప్రేక్షకులతో ఆ కనెక్షన్ కొనసాగించడం కూడా కష్టమే.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘జాకీ’తో కరణ్ అరవింద్ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. కొత్త ఫొటోలకు ‘ది బెస్ట్ ఈజ్ యెట్ టు కమ్’ అని పెట్టినా, వాటిని సినిమా ప్రకటనగా ధ్రువ్ చెప్పలేదు. ‘జాకీ’ రిలీజ్ తేదీ కూడా ఇంకా ప్రకటించలేదు. ఏదేమైనా అతనికి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ కు తగ్గట్టుగా స్పీడ్ పెంచాల్సిందే.