Begin typing your search above and press return to search.

ధూమ్-4 ఆల‌స్యానికి కార‌ణాలు?

కథాంశం కేవ‌లం ఒక ఐడియా స్థాయిలోనే ఉండటం, అది ప్రపంచ స్థాయి యాక్షన్ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతోనే ఇంత ఆలస్యం జరుగుతోంది.

By:  Srikanth Kontham   |   9 July 2026 11:00 PM IST
ధూమ్-4 ఆల‌స్యానికి కార‌ణాలు?
X

బాలీవుడ్ స‌హా అన్ని ప‌రిశ్ర‌మలు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తోన్న‌ యాక్షన్ ఫ్రాంచైజీలలో `ధూమ్ 4` ఒకటి. మూడు భాగాలు మంచి విజ‌యాలు సాధించ‌డంతో? నాల్గ‌వ భాగంపై అంచ‌నాలు అంత‌కంత‌కు రెట్టింపు అవుతున్నాయి. ఇప్ప‌టికే ధూమ్ 4 లాంచ్ అవ్వాలి. కానీ ఇంకా సాధ్య‌ప‌డ‌లేదు. ఈ నేప‌థ్యంలో పట్టాలెక్కకపోవడానికి ప్రధానంగా స్క్రిప్ట్ పరమైన సవాళ్లు .. అత్యున్నత ప్రమాణాలను అందుకోవాలనే నిర్మాత ఆదిత్య చోప్రా తపన కారణమని తెలుస్తోంది. `ధూమ్` సిరీస్ గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనాన్ని మించి, సరికొత్త అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో స్క్రిప్ట్ విషయంలో రాజీ పడకుండా నిర్మాతలు జాగ్రత్తలు తీసుకుం టున్నారు.

గత పదమూడు ఏళ్లుగా ఈ చిత్రం కోసం పలు స్క్రిప్ట్ వెర్షన్లను పరిశీలించినప్పటికీ నిర్మాతలు ఏ ఒక్కదానికీ పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదు. తాజా సమాచారం ప్రకారం ఆదిత్య చోప్రా ఇప్పటికే తొమ్మిదికి పైగా స్క్రిప్ట్ డ్రాఫ్ట్‌లను తిరస్కరించినట్లు వార్తలొస్తున్నాయి. కథాంశం కేవ‌లం ఒక ఐడియా స్థాయిలోనే ఉండటం, అది ప్రపంచ స్థాయి యాక్షన్ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతోనే ఇంత ఆలస్యం జరుగుతోంది. దర్శకత్వ బాధ్యతల విషయంలో కూడా అనిశ్చితి నెలకొంది. తొలుత ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తారని వార్తలు వచ్చినప్పటికీ క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు.

స్క్రీన్ ప్లేపై తనకు పూర్తి స్వేచ్ఛ లేదని .. ఇతరులు రాసిన స్క్రిప్ట్‌ను అమలు చేయడం కంటే తనదైన శైలిలో సినిమాలు చేయడమే మంచిదని భావించినట్లు తెలుస్తోంది. ప్రధాన నటుడు రణబీర్ కపూర్ విషయానికి వస్తే ఆయన ఈ ప్రాజెక్టుకు ఇంకా అధికారికంగా సంతకం చేయలేదని తెలుస్తోంది. గత అనుభవాలు .. ప్రస్తుతం చేస్తున్న `లవ్ అండ్ వార్`, `రామాయణం` వంటి ప్రతిష్టాత్మక చిత్రాల నేపథ్యంలో రణబీర్ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఈ ప్రాజెక్టును రీబూట్ వెర్షన్‌గా అంటే పూర్తిగా కొత్త కాస్టింగ్ .. కొత్త కథాంశంతో రూపొందించాలని యష్ రాజ్ ఫిలిమ్స్ భావిస్తోంది. మునుపటి భాగాల్లోని జై, అలీ పాత్రలను కూడా మార్చి యంగ్ జనరేషన్ నటులతో సిరీస్‌ను కొత్త పుంతలు తొక్కించాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం సరైన జోడీ ..విలన్ కోసం అన్వేషణ కొనసాగుతోంది. ప్రస్తుతానికి `ధూమ్ 4` కాన్సెప్ట్ దశలోనే ఉంది. బలమైన స్క్రిప్ట్ .. సరైన టీమ్ సెట్ అయితేనే ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో పట్టాలెక్కే అవకాశం ఉంది. హాలీవుడ్ స్థాయి యాక్షన్, టెక్నికల్ వాల్యూస్‌తో చిత్రాన్ని తెరకెక్కించాలని భావిస్తున్న నిర్మాతలు అన్నీ అనుకూలిస్తేనే షూటింగ్ ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నారు.