థియేటర్ల మాఫియా.. మంచి సినిమాను చంపేస్తోందా? ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్
ఒక సినిమా తీయడం ఎంత కష్టమో, దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం అంతకంటే కష్టం. ఈ రోజుల్లో ప్రొడ్యూసర్‌కు అసలైన ఛాలెంజ్ అదే.
By: M Prashanth | 2 Nov 2025 2:23 PM ISTఒక సినిమా తీయడం ఎంత కష్టమో, దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం అంతకంటే కష్టం. ఈ రోజుల్లో ప్రొడ్యూసర్‌కు అసలైన ఛాలెంజ్ అదే. "కంటెంట్ బాగుంటే చాలు, సినిమా ఆడుతుంది" అనేది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు, కంటెంట్‌తో పాటు దానికి సరైన థియేటర్లు దొరకడం కూడా అంతే ముఖ్యం. ఈ థియేటర్ల డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌లో ఉన్న చీకటి కోణాల గురించి 'ది గర్ల్‌ఫ్రెండ్' నిర్మాత ధీరజ్ మొగిలినేని చాలా ఓపెన్‌గా మాట్లాడారు.
ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. "సరైన సెంటర్‌లో, మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్లో సినిమా రిలీజ్ చేస్తే బిజినెస్ బెటర్‌గా ఉంటుంది కదా" అనే ప్రశ్నకు, ఆయన వాస్తవ పరిస్థితులను వివరించారు. "అలా ఏం లేదు సార్. చాలా మంది ఇండివిడ్యువల్ ఎగ్జిబిటర్లు, వాళ్ల తాతల ఆస్తులను అమ్మి, సినిమాపై ప్యాషన్‌తో కోట్ల డబ్బు ఖర్చుపెట్టి థియేటర్లను డెవలప్ చేస్తున్నారు. సూపర్బ్ సౌండ్ సిస్టమ్, స్క్రీన్, సీటింగ్ అన్నీ పెట్టినా.. కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు వాళ్లకు సినిమా ఇవ్వరు" అంటూ ఆయన సిస్టమ్‌లోని లొసుగులను బయటపెట్టారు.
ఇలా ఎందుకు జరుగుతుంది? దీని వెనుక ఉన్న కారణాన్ని కూడా ధీరజ్ వివరించారు. "ఆ డిస్ట్రిబ్యూటర్లు, అదే ఏరియాలో వాళ్లకు లీజ్‌లో ఉన్న వేరే థియేటర్లలో సినిమాను రన్ చేస్తారు. ఆ థియేటర్లు బాగోకపోయినా సరే, అక్కడ రన్ చేస్తే ఆ డబ్బులు మొత్తం వాళ్లకే వస్తాయి. అదే, ఈ కొత్త, మంచి థియేటర్‌కు ఇస్తే వాళ్లకు షేర్ ఇవ్వాలి. ఈ లాజిక్‌తో, మంచి థియేటర్లను కావాలనే పక్కన పెడుతున్నారు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాదు, కొన్నిసార్లు కేవలం "ఇగో ప్రాబ్లమ్స్" వల్ల కూడా, ఆ సెంటర్‌లో వాళ్లకు సొంత థియేటర్ లేకపోయినా, వేరే వాళ్ల థియేటర్‌కు సినిమా ఇవ్వని సందర్భాలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు. ఈ సిస్టమ్ వల్ల, మంచి సినిమా తీసినా, దానికి సరైన రీచ్ దొరకడం లేదని ఇదివరకే చాలామంది నిర్మాతలు చెప్పారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్, దేవి లాంటి థియేటర్లు, వైజాగ్‌లోని జగదాంబ, మెలోడీ లాంటి మెయిన్ సెంటర్లు మినహా, మిగిలిన చోట్ల డిస్ట్రిబ్యూటర్లదే రాజ్యం నడుస్తోందని అన్నారు.
"ఆ థియేటర్ సౌండ్ బాగుంది, ఇది బాగుంది అని కాదు.. అది 'మనది' (డిస్ట్రిబ్యూటర్ కంట్రోల్‌లో ఉన్నది) కాకపోతే ఇవ్వకూడదు" అనే రూల్ నడుస్తోందని ధీరజ్ అన్నారు.
మొత్తానికి, ధీరజ్ మాటలు ఇండస్ట్రీలోని ఈ థియేటర్ మాఫియా, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లో ఉన్న సమస్యలను క్లియర్‌గా హైలెట్ చేశాయి. మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు, ఈ డిస్ట్రిబ్యూషన్ గొడవల వల్లే జనాలకు చేరకుండా పోతున్నాయనేది చెప్పకనే చెప్పారు.
