మొదట ఆ ఆ కిక్ రాలేదు.. అందుకే తిరుపతికి వచ్చాం: నిర్మాత ధీరజ్ మొగిలినేని
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా 'చెన్నై లవ్ స్టోరీ'. జూలై 25న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా థర్డ్ సింగిల్ ‘జిగితర’ లాంచ్ ఈవెంట్ తిరుపతిలో గ్రాండ్ గా జరిగింది.
By: M Prashanth | 21 Jun 2026 10:29 AM ISTకిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా 'చెన్నై లవ్ స్టోరీ'. జూలై 25న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా థర్డ్ సింగిల్ ‘జిగితర’ లాంచ్ ఈవెంట్ తిరుపతిలో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో కో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ సినిమా విశేషాలను, తన తోటి నిర్మాతలు, టెక్నీషియన్లు, నటీనటుల గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
సినిమా మొదటి రెండు పాటల ఈవెంట్స్ హైదరాబాద్ లోనే చేశామని, కానీ మూడో పాట లాంచ్ చేద్దామని సమయంలో మొదట హీరో ఆ 'కిక్' రాలేదని ధీరజ్ తెలిపారు. ఇక ఈవెంట్ చేస్తే అది కచ్చితంగా తిరుపతిలోనే జరగాలని హీరో కిరణ్ పట్టుబట్టారన్నారు. ఇక ఇప్పుడు ఈ ఈవెంట్ గ్రాండ్ గా సక్సెస్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. వర్షం వల్ల వారం రోజులు లేట్ అయినా ఇక్కడే చేశామని, గతంలో తమ 'బేబీ' సినిమా ఫస్ట్ షో కూడా తిరుపతిలోనే పడిందని, ఇక్కడి నుంచే బ్లాక్ బస్టర్ టాక్ మొదలైందని సెంటిమెంట్ ను గుర్తుచేసుకున్నారు.
హీరో కిరణ్ అబ్బవరం గురించి చెబుతూ.. రాయలసీమ ముద్దు బిడ్డ, రైతు బిడ్డ అయిన కిరణ్ తన ఫస్ట్ సినిమా నుంచి ఎంతో కష్టపడి పైకి వచ్చారని అభినందించారు. ఫ్లైట్ దిగగానే రాయలసీమ గడ్డ మీద కిరణ్ కళ్లలో ఆనందం చూశానన్నారు. ఆయన మొదటి సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా చేద్దామనుకున్నప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నానని, ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా తానైతే అండగా ఉంటానని ధైర్యం చెప్పే వ్యక్తి కిరణ్ అని అన్నారు. ఈ సినిమాతో ఆయన ఇమేజ్, స్టార్ డమ్ రెట్టింపు కావడం ఖాయమని ధీరజ్ ధీమా వ్యక్తం చేశారు.
మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారి గురించి మాట్లాడుతూ.. ఆయన సంగీతానికే దేవుడు అని, ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్లను చూశాం కానీ ఆయనంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వారిని చూడలేదన్నారు. ఆయన తమ సినిమా చేయడం అదృష్టమన్నారు. అలాగే లిరిక్ రైటర్ అనంత్ శ్రీరామ్ గురించి సరదాగా మాట్లాడుతూ.. ఆయన పాట రాసినా వైరలే, మాట్లాడినా వైరలే అని, ఆయన ఇచ్చిన పాటలన్నీ అద్భుతంగా వచ్చాయని మెచ్చుకున్నారు.
ఈ సినిమాకు కథ అందించిన సాయి రాజేష్ ఇండస్ట్రీలోనే తోపు డైరెక్టర్ అని ధీరజ్ కొనియాడారు. బేబీ లాంటి సినిమాను ప్రపంచంలో ఎవరూ రాయలేరు, తీయలేరు అని ప్రశంసించారు. ఇక ఈ సినిమాను డైరెక్ట్ చేసిన రవి మంచి అనుభవం ఉన్న డైరెక్టర్ లా ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని తన నమ్మకాన్ని బయటపెట్టారు. హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ గురించి చెబుతూ.. చెన్నైలో షూటింగ్ జరుగుతున్నప్పుడు బౌన్సర్లు కూడా క్రౌడ్ ను కంట్రోల్ చేయలేకపోతే, ఆమే స్వయంగా మైక్ పట్టుకుని తమిళంలో గట్టిగా అరిచి కంట్రోల్ చేసిందని, టాలెంటెడ్ హీరోయిన్ అని చెప్పారు. చివరగా నిర్మాత ఎస్కేఎన్ గురించి చెబుతూ.. డబ్బు కోసం, పేరు కోసం ఎవరైనా పనిచేస్తారు కానీ, ఫ్రెండ్ షిప్ కోసం ప్రాణం పెట్టే ఏకైక వ్యక్తి ఎస్కేఎన్ అని, ఆయన స్నేహానికి అసలైన అర్థమని ధీరజ్ ఎమోషనల్ అయ్యారు.
