బాలీవుడ్ హీ-మ్యాన్ ధర్మేంద్ర ఇక లేరు
బాలీవుడ్ హీ-మ్యాన్, `షోలే` నటుడు ధర్మేంద్ర ఇక లేరు. ఆయన సోమవారం (24 నవంబర్ 2025)న 89 సంవత్సరాల వయసులో మరణించారు.
By: Sivaji Kontham | 24 Nov 2025 2:39 PM ISTబాలీవుడ్ హీ-మ్యాన్, `షోలే` నటుడు ధర్మేంద్ర ఇక లేరు. ఆయన సోమవారం (24 నవంబర్ 2025)న 89 సంవత్సరాల వయసులో మరణించారు. ఈ వార్తను ఆయన కుటుంబ ప్రతినిధి అధికారికంగా ధృవీకరించారు. డిసెంబర్ 8న తన 90వ పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడానికి కొద్ది రోజుల ముందు ధర్మేంద్ర మృతి చెందడం అభిమానులను కలచివేస్తోంది.
ఫామ్ హౌస్ లో నివాసం..
నిజానికి కొద్దిరోజులుగా ధర్మేంద్ర తీవ్ర అనారోగ్యంతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని కథనాలొచ్చాయి. కొన్ని మీడియా చానెల్ లు అత్యుత్సాహంతో ధర్మేంద్ర మృతి చెందారని కూడా కథనాలు వెలువరించాయి. అయితే ఈ వార్తలను కుటుంబీకులు ఖండించారు. ఈనెల ఆరంభం పదిరోజుల పాటు ఆస్పత్రి లో చికిత్స తీసుకోగా ధర్మేంద్ర ఆరోగ్యం మెరుగుపడింది. అనంతరం ఇంటికి తిరిగి వచ్చారు. ప్రస్తుతం ఆయన తన మొదటి భార్యతో కలిసి ముంబై ఔటర్‌లోని 100ఎకరాల సొంత ఫామ్ హౌస్ లో నివశిస్తున్నారని కూడా కథనాలొచ్చాయి.
మీడియాపై ఫైర్..
ధర్మేంద్ర ఆస్పత్రిలో చికిత్సతో కోలుకున్న అనంతరం అతడిని జుహులోని బంగ్లాకు తీసుకుని వచ్చారు. ఆ తర్వాత మీడియా తప్పుడు కథనాలపై ధర్మేంద్ర సహచరి హేమమాలిని తీవ్రంగా విరుచుకుపడ్డారు. భాధ్యతారాహిత్యమైన కథనాలను ప్రచురించారని విరుచుకుపడ్డారు.
హృదయాలను ఏలిన నటుడు..
ధర్మేంద్ర బాలీవుడ్ లో లెజెండరీ నటుడిగా మనసులను గెలుచుకున్నారు. ఆయన దశాబ్ధాల కెరీర్ లో దాదాపు 300 పైగా చిత్రాలలో నటించారు. 1960లో `దిల్ భీ తేరా హమ్ భీ తేరే` చిత్రంతో నటనా జీవితాన్ని ప్రారంభించారు. అర్జున్ హింగోరానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బలరాజ్ సాహ్ని, కుంకుమ్ కీలక పాత్రలు పోషించారు.
షోలా ఔర్ షబ్నం, బాయ్ ఫ్రెండ్, అన్పధ్, బందిని, పూజా కే ఫూల్ లాంటి చిత్రాలలో ధర్మేంద్ర తన నటనతో ఆకట్టుకున్నారు. అయితే 1964 చిత్రం ఆయే మిలన్ కి బేలాలో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రతో గొప్ప గుర్తింపు దక్కింది. అలాగే దేశభక్తి చిత్రం `హకీకత్`లోను తనదైన నటనతో ఆకట్టుకున్నారు. చుప్కే చుప్కే, డ్రీమ్ గర్ల్, ధరమ్ వీర్, మేరా గావ్ మేరా దేశ్ వంటి చిత్రాలలో మరపురాని నటనతో ప్రజల హృదయాలను ధర్మేంద్ర ఏలారు.
ఎప్పటికీ ప్రజల గుండెల్లోనే..
ధర్మేంద్ర మరణించినా ఆయన ఎప్పటికీ ప్రజల గుండెల్లో జీవించి ఉంటారు. తన అవసాన దశ వరకూ, వయసు ఒక నంబర్ మాత్రమే అని నిరూపించిన ఆయన తన జీవితం తుదికంటా నటిస్తూనే ఉన్నారు. ఇటీవల శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన వార్ డ్రామా `ఇక్కిస్`లోను ధర్మేంద్ర తన పాత్ర చిత్రణను పూర్తి చేసారు. ఇక్కిస్‌లో ఆయన మరణానంతరం కనిపిస్తాడు. ఈ చిత్రంలో షోలే సహనటుడు అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా కీలక పాత్రలో నటించాడు.
దిగ్భ్రాంతిలో పరిశ్రమ:
లెజెండరీ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర మరణం సినీ పరిశ్రమలను దిగ్భ్రాంతికి గురిచేసింది. దిగ్గజ నటుడిని కోల్పోవడంపై అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ముంబైలోని పవన్ హన్స్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఇప్పటికే శ్మశానవాటికకు చేరుకున్న వారిలో అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ ఉన్నారు. ధర్మేంద్ర కుమారుడు సన్నీ డియోల్ తండ్రి అంత్యక్రియలలో దిగులుగా కనిపిస్తున్న వీడియోలు ఇప్పటికేవ వైరల్ అయ్యాయి. ఈషా డియోల్ కూడా విచారవదనంతో కనిపించారు.
