Begin typing your search above and press return to search.

పెద్ద స్టార్లు - నేపో కిడ్స్ కార‌ణంగానే ఈ దుస్తితి?

సినీప‌రిశ్ర‌మ‌లో అగ్ర క‌థానాయ‌కుల‌తో స‌త్సంబంధాలు కొనసాగించ‌డం, వారితో ప‌దే ప‌దే సినిమాల‌ను నిర్మించ‌డం త‌ప్పు కాదు.

By:  Sivaji Kontham   |   27 Aug 2025 6:00 PM IST
పెద్ద స్టార్లు - నేపో కిడ్స్ కార‌ణంగానే ఈ దుస్తితి?
X

సినీప‌రిశ్ర‌మ‌లో అగ్ర క‌థానాయ‌కుల‌తో స‌త్సంబంధాలు కొనసాగించ‌డం, వారితో ప‌దే ప‌దే సినిమాల‌ను నిర్మించ‌డం త‌ప్పు కాదు. అలాగే పెద్ద స్టార్ల కుటుంబాల నుంచి న‌ట‌వార‌సుల‌ను తెర‌కు ప‌రిచ‌యం చేయ‌డాన్ని కూడా త‌ప్పు ప‌ట్ట‌లేం. అయితే స్టార్ ప‌వ‌ర్ ని అంచ‌నా వేయ‌డంలో లేదా రైట్ స్క్రిప్టుకు రైట్ స్టార్ల‌ను మాత్ర‌మే ఎంపిక చేయ‌డంలో త‌ప్పు చేస్తే క‌చ్ఛితంగా ఆ బ్యాన‌ర్ ప‌ని తీరును త‌ప్పు ప‌ట్టాల్సిందే. అలాగే మారిన ట్రెండ్ ని అనుసరించి ఎంపిక చేయాల్సిన స్క్రిప్టుల విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోయినా దానిని స‌రిదిద్దాల్సి ఉంటుంది. కాంబినేష‌న్ల పేరుతో, నేపో కిడ్స్ ప్ర‌మోష‌న్ పేరుతో భారీ బ‌డ్జెట్లు వెద‌జ‌ల్లి కాస్ట్ ఫెయిల్యూర్స్ గా మారిన‌ చాలా బ్యాన‌ర్లు గ‌తంలో క‌లిసిపోయిన విష‌యాన్ని నిర్మాత‌లు గుర్తుంచుకోవాలి.

కానీ ఇవేవీ చేయ‌కుండా, నేటి జెన్ జెడ్ ఆలోచ‌న‌ల‌ను అంచ‌నా వేయ‌కుండా, పాత బాణీలోనే సినిమాల‌ను నిర్మిస్తే దాని ఫ‌లితం ఎలా ఉంటుందో ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ లాంటి పెద్ద బ్యాన‌ర్ చ‌వి చూసింది. ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ ఇటీవ‌ల భారీ బ‌డ్జెట్ సినిమాల‌ను త‌గ్గించుకోవ‌డం చ‌ర్చ‌గా మారింది. ఈ బ్యాన‌ర్ లో ఫ్యామిలీ ఓరియెంటెడ్ క‌థ‌లు, రొమాంటిక్ కామెడీ క‌థ‌లు గ‌తంలో విస్త్ర‌తంగా తెర‌కెక్కి ఘ‌న‌విజ‌యాలు సాధించాయి. కానీ కాలం మారింది. ఇటీవ‌లి కాలంలో ఈ జాన‌ర్ సినిమాలకు పాన్ ఇండియా రీచ్ లేక‌పోవ‌డం ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ కి స‌మ‌స్య‌గా మారింది. ముఖ్యంగా స్టార్ ప‌వ‌ర్ ని మించి అద‌న‌పు బ‌డ్జెట్ల‌ను ఖ‌ర్చు చేసిన ఈ బ్యాన‌ర్ కొన్నేళ్లుగా పెద్ద చిక్కుల్ని ఎదుర్కొంటోంది. ఇంత‌కుముందు బ్ర‌హ్మాస్త్ర‌, క‌ళాంక్ వంటి చిత్రాల విష‌యంలో ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ త‌న త‌ప్పిదాన్ని కూడా గ్ర‌హించింది. పెద్ద స్టార్ల‌తో కాంబినేష‌న్లు సెట్ చేసి సినిమాలు చేసే విధానంతో త‌మ‌కు తీవ్ర న‌ష్టం వాటిల్లింద‌ని కూడా ధ‌ర్మ సంస్థ విశ్లేషించుకుంది.

ఇక ఇదే స‌మ‌యంలో ఆర్థికంగా చితికిపోయిన ఈ సంస్థ‌ను ఆదార్ పూన‌వాలా అనే ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త ఆదుకున్న సంగ‌తి తెలిసిందే. బిజినెస్ మేన్ ఆదార్ పూన‌వాలా కి చెందిన‌ సిరీన్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌ ధ‌ర్మ సంస్థ నుంచి 50శాతం వాటాను కొనుగోలు చేసింది. డీల్ ప్ర‌కారం పూన‌వాలా దాదాపు 1000 కోట్లు బ్యాన‌ర్ పున‌రుద్ధ‌ర‌ణ కోసం పెట్టుబ‌డుల్ని పెడుతున్నారు. క‌ర‌ణ్ జోహార్ సీనియారిటీని, మేధో సంప‌త్తిని స‌ద్వినియోగం చేసుకుంటూ ఇప్పుడు ఆదార్ పేన‌వ‌ల్లే ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ ని దారికి తెచ్చేందుకు పెట్టుబ‌డుల్ని అందిస్తున్నారు. అయితే మారిన ట్రెండ్ కి అనుగుణంగా క‌థ‌ల ఎంపిక స‌హా ప్ర‌తిదీ ప్ర‌యోగాత్మ‌కంగా ఆలోచించాల్సిన ప‌రిస్థితి ఉందిప్పుడు. అయితే ఈ విష‌యంలో ధ‌ర్మ సంస్థ ప‌రిణ‌తితో ముందుకు వెళుతోందా? క‌ర‌ణ్- ఆదార్ జోడీ ప్ర‌ణాళిక‌లు ఎలా ఉన్నాయి? అన్న‌ది వేచి చూడాలి. యాజ‌మాన్యం చేతులు మారాక ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ ప‌రిస్థితి ఏమిట‌న్న‌దానిపై మ‌రింత స్ప‌ష్ఠ‌త రావాల్సి ఉంది. ఇవి కుచ్ కుచ్ హోతా హై, క‌భీ ఖుషి క‌భీ ఘ‌మ్ రోజులు కావు.. మారిన ట్రెండ్ లో సినిమాలు తీసి అగ్ర నిర్మాణ సంస్థ తిరిగి కంబ్యాక్ అవుతుందేమో వేచి చూడాలి.

ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ ఇటీవ‌లి కాలంలో న‌ట‌వార‌సులు, మిడ్ రేంజ్ హీరోల‌పైనే పెట్టుబ‌డుల్ని పెడుతోంది. ప్ర‌ణాళిక‌లో భాగంగా 70కోట్లు అంత‌కంటే త‌క్కువ బ‌డ్జెట్ల‌ను మాత్ర‌మే కేటాయిస్తోంది. ఈ సంస్థ నిర్మిస్తున్న `స‌న్నీ సంస్కారికి తుల‌సీ కుమారి` అక్టోబ‌ర్ లో విడుద‌ల‌కు రానుండ‌గా, `తు మేరి మై తేరా మైన్ తేరా తు మేరి` చిత్రాన్ని వ‌చ్చే ఏడాది విడుద‌ల‌కు తేనుంది. అలాగే తెలుగు సినిమా `మిరాయ్` హిందీ వెర్ష‌న్ ని ధ‌ర్మ సంస్థ విడుద‌ల చేయ‌నుంది. మ‌రోవైపు కార్తీక్ ఆర్య‌న్ తో `నాగ్ జిల్లా` అనే ప్రయోగాత్మ‌క చిత్రాన్ని ధ‌ర్మ సంస్థ నిర్మిస్తోంది. ఇది వ‌చ్చే ఏడాది ఆగ‌స్టులో విడుద‌ల కానుంది. సైఫ్ ఖాన్ వార‌సుడు ఇబ్ర‌హీం అలీఖాన్ ని ప్రమోట్ చేస్తూ `స‌ర్జ‌మీన్` అనే చిత్రాన్ని ధ‌ర్మ సంస్థ ఇటీవ‌ల విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.