Begin typing your search above and press return to search.

ధ‌ర్మాన్ని కాపాడిన ఆ రెండిటిలో ఒక‌టి తెలుగు సినిమా?

అదుపు త‌ప్పిన బ‌డ్జెట్లు నిర్మాత‌ల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తున్నాయి. స్టార్లు వారి ప‌రివారాల ఖ‌ర్చుల గురించి నిరంత‌రం ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

By:  Sivaji Kontham   |   6 Oct 2025 9:35 AM IST
ధ‌ర్మాన్ని కాపాడిన ఆ రెండిటిలో ఒక‌టి తెలుగు సినిమా?
X

అదుపు త‌ప్పిన బ‌డ్జెట్లు నిర్మాత‌ల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తున్నాయి. స్టార్లు వారి ప‌రివారాల ఖ‌ర్చుల గురించి నిరంత‌రం ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో పెద్ద స్టార్ల‌తో వంద‌ల కోట్ల బ‌డ్జెట్లు పెట్టి సినిమాలు తీయ‌న‌ని ప్ర‌క‌టించారు క‌ర‌ణ్ జోహార్. ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ లో అత‌డు మీడియం బ‌డ్జెట్ (70-80కోట్లు) సినిమాలు, కొత్త తార‌ల‌తో సినిమాలు తీసేందుకు ఆస‌క్తిగా ఉన్నారు.

ఈ ఏడాది ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ లో సినిమాలు ఇంచుమించు ఇలాంటివే. అయితే వీటిలో చాలా ఫెయిల్యూర్స్ అత‌డిలో క‌ల‌త‌ను పెంచాయి. సైఫ్ ఖాన్ కుమారుడు ఇబ్ర‌హీంని ప‌రిచ‌యం చేస్తూ తెర‌కెక్కించిన నాద‌నియాన్ పెద్ద ఫెయిల్యూర్ గా మారింది. న‌టీన‌టులు ఇబ్ర‌హీం, ఖుషీ న‌ట‌ప్ర‌ద‌ర్శ‌న‌పై తీవ్రమైన ట్రోలింగ్ ఇబ్బంది పెట్టింది. త‌ర్వాత కేస‌రి2 పాజిటివ్ స‌మీక్ష‌ల‌ను అందుకున్నా, అక్షయ్ లాంటి పెద్ద స్టార్ ఉన్నా కానీ, బాక్సాఫీస్ వ‌ద్ద ఫెయిలైంది. మ్యాడీ, ఫాతిమా వంటి స్టార్ల‌తో తెర‌కెక్కించిన రొమాంటిక్ కామెడీ 'ఆప్ జైసా కోయి' పాత వాస‌న‌ల‌తో రిపీట్ మూవీగా మారింద‌ని విమ‌ర్శ‌లొచ్చాయి. ఆ త‌ర్వాత‌ ఇబ్రహీం అలీ ఖాన్ నటించిన నెట్‌ఫ్లిక్స్ మూవీ సర్జమీన్ పెద్దగా ఆద‌ర‌ణ పొంద‌లేదు. సైఫ్ న‌ట‌వార‌సుడు ఇబ్రహీం మొద‌టి నుంచి విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొంటూనే ఉన్నాడు.

అయితే ఇటీవ‌ల ధ‌డ‌క్ 2 ఫ‌ర్వాలేద‌నిపించింది. ఈ సినిమా క‌థ‌, క‌థ‌నం, క్రియేటివిటీ ఆక‌ట్టుకున్నాయి. వీట‌న్నిటినీ మించి ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ కి గౌర‌వం పెంచిన సినిమా హోంబౌండ్. ఈ చిత్రం అంత‌ర్జాతీయ ఫిలింఫెస్టివ‌ల్స్ లో ప్ర‌ద‌ర్శిత‌మై అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఈ ఏడాది ఆస్కార్స్ బ‌రిలో భార‌త‌దేశం నుంచి అడుగుపెడుతున్న చిత్ర‌మిది. ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ గౌర‌వాన్ని కాపాడిన సినిమాగాను దీనిని చెప్పుకోవ‌చ్చు.

ఇటీవ‌లే ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ నుంచి 'సన్నీ సంస్కారి కి తులసి కుమారి' థియేటర్లలోకి వ‌చ్చింది. లైట‌ర్ వెయిన్ కామెడీ సినిమా రొటీన్ అన్న విమ‌ర్శ‌లొచ్చాయి. ఏడాది ముగింపులో `తు మేరీ మై తేరా, మై తేరా తు మేరీ సే` విడుదల కానుంది. ఇది కూడా రొమాంటిక్ కామెడీ. ఇవేగాక‌, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ ఓ పంజాబీ చిత్రాన్ని కూడా నిర్మిస్తోంది.

ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ చాలా కాలంగా ద‌క్షిణాది సినిమాల‌కు బ్యాక‌ప్ ఇస్తోంది. ఇటీవ‌లే విడుదలై ఘ‌న‌విజయం సాధించిన తేజ స‌జ్జా `మిరాయ్`ను ఉత్త‌రాదిన ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ పంపిణీ చేసింది. ఒక అప్ క‌మ్ హీరో సినిమా ఉత్త‌రాదినా 20కోట్లు సుమారుగా వ‌సూలు చేసి ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ కి మంచి పేరు తెచ్చింది. మునుముందు ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ లో పుష్ప‌, కాంతార లాంటి రొటీనిటీ లేని సినిమాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.