Begin typing your search above and press return to search.

విజ‌య్ ప్ర‌భుత్వం ఫిల్మీ ఫ్రెండ్లీ విధానాల‌తో కోలీవుడ్‌కి ఊర‌ట

ధనుష్ నటిస్తున్న ‘ఓం: చాప్టర్ 1’ సినిమాకు నవంబర్ 20న ఉదయం 6 గంటల ప్రత్యేక షోలకు తమిళనాడు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీనిపై సీఎం విజయ్‌కు ధనుష్ కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులు షోలకు హాజరయ్యే సమయంలో బాధ్యతగా, సురక్షితంగా వ్యవహరించాలని, హంగామా చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

By:  Sivaji Kontham   |   19 Nov 2026 8:42 AM IST
విజ‌య్ ప్ర‌భుత్వం ఫిల్మీ ఫ్రెండ్లీ విధానాల‌తో కోలీవుడ్‌కి ఊర‌ట
X

తెలుగు రాష్ట్రాల్లో 6 ఏఎం ప్ర‌త్యేక షోల‌కు ప్ర‌భుత్వాలు చాలా సులువుగా అనుమ‌తులు మంజూరు చేస్తున్నాయి. టికెట్ ధ‌ర‌ల పెంపు విష‌యంలోను చాలా వెసులుబాటు ఉందిక్క‌డ‌. అయితే ఈ ప‌ప్పులేవీ త‌మిళ‌నాడులో ఉడ‌క‌వు. అక్కడ గ‌తంలో స్టాలిన్ ప్ర‌భుత్వం సినీప‌రిశ్ర‌మ‌లో ఇష్టానుసారం టికెట్ ధ‌ర‌ల పెంపున‌కు అనుమ‌తించ‌లేదు. అదే స‌మ‌యంలో ప్ర‌త్యేక షోల‌కు అనుమ‌తులు కూడా క‌ష్టంగానే ఉండేది.

కానీ ద‌ళ‌ప‌తి విజ‌య్ రాజ‌కీయాల్లోకి చేరి, అనూహ్యమైన విక్ట‌రీతో ముఖ్యమంత్రిగా మారాక కోలీవుడ్ లో స‌న్నివేశం పూర్తిగా మారింది. విజ‌య్ ప్ర‌భుత్వం ఫిల్మీ ఫ్రెండ్లీ విధానాల‌తో చాలా ఊర‌ట ల‌భిస్తోంది. స్టార్ హీరోల సినిమాల‌కు ఉద‌యం అద‌న‌పు ఆట ఆడించుకోవ‌డానికి విజ‌య్ ప్ర‌భుత్వం సులువుగా లైన్ క్లియ‌ర్ చేస్తోంది. ఎంతో కాలంగా అభిమానులు ఎదురుచూస్తున్న 6 ఏఎం షోల‌కు అనుమతి లభించడం ఇప్పుడు తమిళ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం `ఓం: చాప్టర్ 1 - ఉధిరం: ది బ్లడ్ వుడ్` నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సార‌థ్యంలోని ప్రభుత్వం ఉదయం 6 గంటల షోలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ధనుష్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘ లేఖను విడుదల చేశారు.

సినిమా అనేది కేవలం ఒకరి శ్రమ కాదని.. తెర వెనుక ఎంతో మంది కార్మికుల కష్టం, అంకితభావం దాగి ఉంటాయని ధనుష్ తన లేఖలో గుర్తుచేశారు. చిత్ర పరిశ్రమ మనుగడ సాగించాలన్నా.. మరింత ఎత్తుకు ఎదగాలన్నా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడటమే అన్నింటికంటే పెద్ద మద్దతు అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే నవంబర్ 20న విడుదలవుతున్న తమ `ఓం` చిత్రానికి ఉదయం 6 గంటల స్పెషల్ షోలకు అనుమతినిచ్చిన తమిళనాడు ప్రభుత్వానికి.. గౌరవ ముఖ్యమంత్రి విజయ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ధనుష్ పేర్కొన్నారు.

అయితే ప్రత్యేక షోలకు అనుమతి రావడంతో ఉత్సాహంలో ఉన్న అభిమానులకు ధనుష్ ఒక కీలక విజ్ఞప్తి చేశారు. ఉదయం 6 గంటల షోలకు హాజరయ్యే అభిమానులు ఎంతో బాధ్యతాయుతంగా, సురక్షితంగా వ్యవహరించాలని కోరారు. వేడుకల పేరుతో తోటి ప్రేక్షకులకు గానీ.. ఇతరులకు గానీ ఎలాంటి అసౌకర్యం కలిగించవద్దని స్పష్టం చేశారు. హంగామా వ‌ద్ద‌ని కూడా హిత‌వు ప‌లికారు.

`అమరన్` వంటి భారీ విజయం తర్వాత దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అటవీ ప్రాంతాల్లో జరిగే అక్రమ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఇందులో ధనుష్ తమిళనాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారిగా కనిపించనున్నారు. స్మగ్లింగ్ ముఠా గుట్టు రట్టు చేసేందుకు కూలీ వేషంలో అడవిలోకి అడుగుపెట్టే అండర్ కవర్ ఆఫీసర్ పాత్రలో ఆయన నటన హైలైట్ కానుంది. మ‌మ్ముట్టి, సాయిప‌ల్ల‌వి ఇందులో ఇత‌ర కీల‌క పాత్ర‌ధారులు. వీరితో పాటు శ్రీలీల, సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా ముఖ్య‌ పాత్రల్లో నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య నవంబర్ 20న ఈ చిత్రం విడుద‌ల‌వుతోంది.