Begin typing your search above and press return to search.

ఏనుగెందుకు? లీడ్ యాక్టర్ ఫేస్ ఎక్కడ?.. కౌంటర్ కే కౌంటర్లు!

ఏనుగు కనిపించింది... కానీ మురుగన్ వాహనమైన నెమలి కనిపించలేదు. సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది... కానీ హీరో ముఖమే కనిపించలేదు.

By:  M Prashanth   |   11 July 2026 3:02 PM IST
ఏనుగెందుకు? లీడ్ యాక్టర్ ఫేస్ ఎక్కడ?.. కౌంటర్ కే కౌంటర్లు!
X

ఏనుగు కనిపించింది... కానీ మురుగన్ వాహనమైన నెమలి కనిపించలేదు. సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది... కానీ హీరో ముఖమే కనిపించలేదు. తమిళ్ మురుగన్ గ్లింప్స్ విడుదలైన వెంటనే నెట్టింట ప్రశంసల కంటే ప్రశ్నలే ఎక్కువయ్యాయి. అదే సమయంలో ఇప్పటికే మురుగన్ నేపథ్యంలో ప్రకటించిన ఎన్టీఆర్- త్రివిక్రమ్ సినిమా కూడా చర్చలోకి రావడంతో రెండు భారీ ప్రాజెక్టులపై ఆసక్తి మరింత పెరిగింది.

కోలీవుడ్ హీరో ధనుష్- డైరెక్టర్ వెట్రిమారన్ మరోసారి చేతులు కలిపారు. సర్ప్రైజ్ ఇస్తూ తమిళ్ మురుగన్ అంటూ కొత్త ప్రాజెక్టు ప్రకటించారు. సుబ్రహ్మణ్య స్వామి నేపథ్యంతో సినిమా రూపొందనున్నట్లు గ్లింప్స్ ద్వారా ఇన్ డైరెక్ట్ గా చెప్పారు. అయితే కథ పూర్తిగా పురాణ గాథగా సాగుతుందా? లేక ఫాంటసీ అంశాలతో ఉంటుందా? అన్నది తెలియదు. సినిమా ప్రకటన వచ్చిన వెంటనే దాని కంటెంట్ కంటే ప్రెజెంటేషన్‌పైనే ఎక్కువ చర్చ మొదలైంది.

గ్లింప్స్‌ లో ఎక్కువ భాగం ఏఐ విజువల్స్‌ తో రూపొందించినట్లు కనిపించడంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విజువల్స్‌ లో క్వాలిటీ కనిపించలేదని, హడావుడిగా తయారు చేసినట్లు అనిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు. ధనుష్ లుక్‌ తో ఒక పోస్టర్ విడుదల చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గ్లింప్స్‌ లో కనిపించిన కొన్ని విజువల్స్ కూడా చర్చకు దారితీశాయి. ముఖ్యంగా మురుగన్ వాహనం నెమలి కాగా, వీడియోలో ఏనుగును చూపించడంపై పలువురు ప్రశ్నలు లేవనెత్తారు.

హీరో ముఖం చూపించకుండా సినిమా ప్రకటించడం ఎందుకనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఆ ప్రాజెక్టుపై చర్చకు మరో కారణం జూనియర్ ఎన్టీఆర్- త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా. మురుగన్ లేదా కార్తికేయుడి నేపథ్యంలో రూపొందనున్న ఆ చిత్రాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. దీంతో ఒకే దేవుడు నేపథ్యంతో రెండు స్టార్ హీరోల సినిమాలు రావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. రెండు చిత్రాల కథలు వేర్వేరుగా ఉండే అవకాశమే ఎక్కువగా కనిపిస్తున్నా, ప్రేక్షకులు పోలికలు తీయడం మాత్రం ఖాయం.

అయితే తారక్ మూవీకి ధనుష్ సినిమా కౌంటర్ అని కొందరు కోలీవుడ్ నెటిజన్లు అంటుంటే.. ఇప్పుడు గ్లింప్స్ కే తిరిగి కౌంటర్లు ఇస్తున్నారు తెలుగు సినీ ప్రియులు. అదే సమయంలో తమిళ ప్రేక్షకులకు మురుగన్‌ పై ఉన్న భక్తి కారణంగా వెట్రిమారన్ తనదైన శైలిలో కథను సహజంగా డిజైన్ చేస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంగీత పరంగానూ ఆసక్తికరమైన పోటీ కనిపిస్తోంది. ఎన్టీఆర్- త్రివిక్రమ్ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, అనిరుధ్ వద్ద పనిచేసిన సాయి అభ్యంకర్ తమిళ్ మురుగన్ కు సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నారు.

ప్రస్తుతం రెండు చిత్రాలపై పూర్తి వివరాలు బయటకు రాలేదు. విడుదల తేదీలు కూడా ప్రకటించలేదు. అయితే ఒకే దేవుడు నేపథ్యంలో రెండు భారీ కాంబోల్లో సినిమాలు ప్రకటించడం హాట్ టాపిక్‌ గా మారింది. ఇప్పుడు అందరి దృష్టి తమిళ్ మురుగన్ నెక్స్ట్ అప్డేట్‌ పైనే ఉంది. అనౌన్స్మెంట్ గ్లింప్స్‌ పై వచ్చిన విమర్శలకు మూవీ టీమ్ స్పందిస్తుందా? లేక విమర్శలు మరింత పెరుగుతాయా? అన్నది వేచి చూడాల్సిందే.