Begin typing your search above and press return to search.

మేల్ అర్జున్ రెడ్డి-ఫీమేల్ కబీర్ సింగ్ ప్రేమ‌క‌థ‌?

తాజాగా టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ ఆద్యంతం కృతి స‌నోన్- ధ‌నుష్ మ‌ధ్య సీరియ‌స్ ల‌వ్ డ్రామా ర‌క్తి క‌ట్టించింది.

By:  Sivaji Kontham   |   2 Oct 2025 5:00 PM IST
మేల్ అర్జున్ రెడ్డి-ఫీమేల్ కబీర్ సింగ్ ప్రేమ‌క‌థ‌?
X

ధనుష్ ని హిందీ ప‌రిశ్ర‌మ‌లో సూప‌ర్‌స్టార్ గా నిల‌బెట్టిన ద‌ర్శ‌కుడు ఆనంద్ ఎల్.రాయ్. రాంజానా, అత్రాంగి రే లాంటి క‌ల్ట్ చిత్రాల‌తో ధ‌నుష్ ప్ర‌తిభ‌ను బాలీవుడ్ కి ప‌రిచ‌యం చేసాడు. అందుకే ఇప్పుడు ఆ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో మ‌రో కొత్త సినిమా వ‌స్తోంది అంటే అటు నార్త్, ఇటు సౌత్ లోను కొంత చ‌ర్చ జ‌రుగుతుంది. ఇప్పుడు ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌స్తున్న తాజా చిత్రం `తేరే ఇష్క్ మే`. టైటిల్ కి త‌గ్గ‌ట్టే ఇది ప్రేమ‌క‌థా చిత్రం. తాజాగా టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ ఆద్యంతం కృతి స‌నోన్- ధ‌నుష్ మ‌ధ్య సీరియ‌స్ ల‌వ్ డ్రామా ర‌క్తి క‌ట్టించింది.

అయితే ఈ సినిమా క‌థ కూడా ఇత‌ర ప్రేమ‌క‌థా చిత్రాల‌కు భిన్న‌మైన‌ది కాదు. ప్రియురాలు కాద‌నుకుంటే, ప్రేమికుడు ఎడా పెడా దెబ్బ‌లు తిని దారుణ‌మైన గాయాల‌తో ధీన స్థితిలో పెళ్లికి సిద్ధ‌మైన ప్రేయ‌సిని వెతుక్కుంటూ పెళ్లి ఇంటికి వ‌చ్చే ప్రేమికుడి క‌థ‌ను ఈ టీజ‌ర్ లో చూపించారు. ధ‌నుష్ ఇంటెన్స్ లుక్, కృతి అనుమానాస్ప‌ద‌మైన అవ‌తారం, బ్యాక్ గ్రౌండ్ లో భీక‌ర‌మైన డైలాగ్ ఇవ‌న్నీ సినిమాపై ఏదో క్రియేట్ చేస్తాయ‌ని ఆనంద్ ఎల్ రాయ్ భావించారు. కానీ ఇది కూడా ఒక రొటీన్ ల‌వ్ డ్రామా అని నెటిజనులు విమ‌ర్శిస్తున్నారు.

2 నిమిషాల నిడివి గల `తేరే ఇష్క్ మే` టీజర్ కృతి సనన్ తన వివాహానికి సిద్ధమవుతున్న దృశ్యంతో ప్రారంభమవుతుంది. ఇంట్లో అతిథుల చుట్టూ కూర్చుని ఉండ‌గా ప్రీవెడ్డింగ్ వేడుక జ‌రుగుతోంది. అప్పుడే ధనుష్ లోపలికి వెళ్తాడు.. కుంటుతూ దెబ్బ‌లు తిని క‌న్ను సొట్ట‌పోయి క‌నిపిస్తాడు. ఆ త‌ర్వాత ఏ ప్రేమికురాలి ఎమోష‌న్ అయినా, ఏ ప్రేమికుడి ఎమోషన్ అయినా ఎలా ఉంటుందో ఊహించ‌లేనివారు ఉంటారా? ధ‌నుష్‌ ఒక సీసా తీసి కృతి ముఖం మీద ఒంపుతాడు. అది గంగా జ‌లం కాబ‌ట్టి ఓకే.. అది యాసిడ్ కాదు థాంక్ గాడ్! అనుకుంటాము. ఆ త‌ర్వాత‌ రిక్షాపై ఉన్న ధనుష్ కృతి వైపు ఒక భ‌యాన‌క‌మైన బ్యాడ్ స్మైల్ ఇస్తాడు. అత‌డి చేతులు తాడుతో కట్టివేసి భ‌యాన‌కంగా క‌నిపిస్తాడు. ఈ మాత్రం రివీలింగ్ తో క‌థేమిటో అంచ‌నా వేయొచ్చు.

టీజర్ ఆసక్తికరంగా ఉన్నా కానీ అభిమానులు ఎందుక‌నో సంతృప్తి చెందలేదు. ఇది మ‌రో రొటీన్ ల‌వ్ స్టోరి అని కొంద‌రు విమ‌ర్శించారు. టీజ‌ర్ లో డైలాగ్ భ‌య‌పెడుతోంద‌ని ఒక‌రు ఎగ‌తాళిగా వ్యాఖ్యానించ‌గా, `మేల్ అర్జున్ రెడ్డి ఫిమేల్ కబీర్ సింగ్` అని ఒకరు కామెంట్ చేసారు. `ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది! అని ఒక‌రు రాసారు. అబ్సెసివ్ మాజీ ప్రేమికుల క‌థ ఇది అని ఒక‌రు గెస్ చేసారు. `తేరే ఇష్క్ మెయిన్` నవంబర్ 28న థియేటర్లలో విడుదల కానుంది. ధ‌నుష్ కి మ‌రో రాంజానా రేంజు హిట్టు ప‌డుతుందా లేదా చూడాలి.