ధనుష్ ఒకరు కాదు ముగ్గురు.. అచ్చు గుద్దినట్టు తండ్రి పోలికలే!
టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో ధనుష్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
By: Sivaji Kontham | 23 Sept 2026 10:53 PM ISTటాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో ధనుష్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. తాజాగా 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో పాల్గొనేందుకు ఆయన తన ఇద్దరు కుమారులు యాత్ర, లింగాలతో కలిసి విచ్చేసారు. ఫార్మల్ సూట్లలో ముస్తాబై తండ్రితో పాటు నడిచి వస్తున్న యువకులను చూసి అభిమానులు ఒక్కసారిగా ఫిదా అయిపోయారు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో ``ధనుష్ ఒకరు కాదు ముగ్గురు.. ఇది అచ్చం అరవ `మనం`సినిమా లాగే ఉంది!``అంటూ నెటిజన్లు ఆనందంతో కామెంట్లు చేస్తున్నారు.
ఈ ప్రత్యేక వేడుకలో ధనుష్ వైవిధ్యమైన సాంప్రదాయ లుక్‌లో కనిపిస్తే.. ఆయన కుమారులు అచ్చం తమ తండ్రి పోలికలతో, స్టైలిష్ రూపంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు ధనుష్‌లు ఉన్నట్లుగా .. ముగ్గురు అన్నదమ్ములు కనిపిస్తున్నట్లుగా ఉన్న ఈ ఫోటోగ్రాఫ్ చూస్తుంటే భవిష్యత్తులో ఈ ముగ్గురూ కలిసి ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే ఎలా ఉంటుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. టాలీవుడ్ లేదా కోలీవుడ్‌లో అపూర్వ సహోదరులు తరహా సినిమాలో ఈ త్రిమూర్తులు ఒకే స్క్రీన్ పై మ్యాజిక్ చేస్తే బాగుంటుందని అభిమానులు ముచ్చటపడుతున్నారు. నటుల వారసులను తెరపైకి తీసుకురావాలని ఉవ్విళ్లూరే ఎంతోమంది దర్శకులకు ఇది ఒక సువర్ణావకాశంలా మారుతుందనడంలో సందేహం లేదు.
జాతీయ అవార్డుల వేడుకలో తన కుమారులు ఇద్దరూ తనపైనే అందరి దృష్టి పడేలా చేసి హైలైట్ అయ్యారని, అయితే దానిని తాను మనసారా ఆస్వాధించానని ధనుష్ స్వయంగా సోషల్ మీడియాలో సరదాగా తెలిపారు. ఒకవైపు తాను అత్యున్నత జాతీయ వేదికపై సత్కారాలు అందుకుంటున్న వేళ తన కుమారులు ఈ స్థాయిలో ఎదగడం ఒక తండ్రికి దొరికిన అరుదైన బహుమతి. ఇక చెన్నైకి చేరుకున్న వెంటనే తాను దక్కించుకున్న తొలి డైరెక్షన్ జాతీయ అవార్డు పతకాన్ని తన తల్లి విజయలక్ష్మి మెడలో అలంకరించి, ``ఆ చిరునవ్వు కోసమే ఇదంతా`` అంటూ అతడు భావోద్వేగానికి గురైన తీరు అందరి హృదయాలను హత్తుకుంది. మరోవైపు తన సినీ ప్రయాణంలో ఎప్పుడూ వెన్నంటి ఉంటూ తనకు బలమైన స్తంభాలుగా నిలుస్తున్న అభిమానులందరికీ ఈ ప్రతిష్టాత్మక విజయాన్ని అంకితం చేస్తున్నట్లు ధనుష్ తెలిపారు.
ధనుష్ రాజకీయ ఎంట్రీ.. ఇదిగో ఇదే సమాధానం:
ఇదే సమయంలో ధనుష్ రాజకీయ ప్రవేశంపై వస్తున్న ఊహాగానాలకు కూడా తెరపడే సన్నివేశం కనిపించింది. ఢిల్లీ నుంచి చెన్నైకి తిరిగి వచ్చిన ధనుష్‌ను మీడియా రాజకీయాల గురించి ప్రశ్నించగా.. అతడు ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా కేవలం చిరునవ్వుతో దాటవేశారు. నిజానికి ఆప్తమిత్రుడు, నటుడు కరుణాస్ కూడా ధనుష్ ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని.. కేవలం సినిమాలపైనే దృష్టి పెడుతున్నారని స్పష్టం చేయడంతో ఈ వార్తలకు ముగింపు పడింది.
మొత్తానికి జాతీయ అవార్డుల వేడుకలో ధనుష్ సాధించిన ఘనతలు ఒకెత్తయితే.. అతడి కుమారులతో కలిసి దిగిన ప్రత్యేకమైన ఫోటోలు మాత్రం ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. తండ్రి పోలికలతో అచ్చం అలాగే ఉన్న కుమారులను చూసి మురిసిపోతున్న అభిమానులు.. మునుముందు రోజుల్లో ఈ ముగ్గురి కలయికలో ఎలాంటి అద్భుతాలు చూడబోతున్నామో అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
అది ఊహంచనిది....
ధనుష్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. సూపర్‌స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె, ప్రముఖ దర్శకురాలు, గాయని అయిన ఐశ్వర్య రజనీకాంత్‌ను వివాహం చేసుకున్నారు. 18 నవంబర్ 2004న వివాహం చేసుకున్న ఈ దంపతులకు యాత్ర, లింగా అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే వ్యక్తిగత కారణాలరీత్యా జనవరి 2022లో విడిపోతున్నట్లు ప్రకటించిన ఈ జంటకు చెన్నై కోర్టు 27 నవంబర్ 2024న అధికారికంగా విడాకులు మంజూరు చేసింది. ప్రస్తుతం యాత్ర, లింగా లకు సహతల్లిదండ్రులుగా వారు కొనసాగుతున్నారు.
