నాన్ వెజిటేరియన్ మధ్యలో వెజ్ హీరో!
చికెన్ మటన్ తినే టైపు కాదు పప్పు ఆకు కూరలు మాత్రమే తింటానన్నారు. కానీ కోళ్లు..మేకలు కోసిన చోట ధనుష్ వాటిని ఆరగించాడా? లేక వెజ్ మీల్స్ కే పరిమితమయ్యారా?
By: Srikanth Kontham | 7 Oct 2025 4:00 PM ISTధనుష్ కథానాయకుడిగా నటించిన `ఇడ్లీ కడై` ఇటీవల విడుదలై కోలీవుడ్ లో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. వరుస విజయాల మీదున్న ధనుష్ కి మరో గ్రాండ్ సక్సెస్ ని ఇచ్చిన చిత్రమిది. ఈ నేపథ్యంలో ధనుష్ తన స్వగ్రామాన్ని సందర్శించారు. అనంతరం అక్కడ పలు కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా సొంతూరులో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ధనుష్ తల్లిదండ్రులు, ఇద్దరు కుమారులు సోదరుడు దర్శకుడు సెల్వరాఘవన్‌తో కలిసి శంకాపురంలోని కరుప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం గ్రామ ప్రజలందరికీ మాంసాహార విందు కార్యక్రమం ఏర్పాటు చేసారు. వారితో కలిసి ధనుష్ కూడా ఓ సామాన్యుడిలా భోజనం చేసారు. కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ధనుష్ ఓ పెద్ద స్టార్ అయినా ఎంతో నిరాడంబరంగా వారితో మమేకం అవ్వడం అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. ఇంత వరకూ బాగానే ఉంది. అయితే మాంసాహారం భోజన బంతిలో ధనుష్ ఏం తిన్నాడు? అన్నది ఆసక్తికరంగా మారింది. ధనుష్ తాను పూర్తి గా వెజిటేరియన్ అని గతంలో అన్నారు.
చికెన్ మటన్ తినే టైపు కాదు పప్పు ఆకు కూరలు మాత్రమే తింటానన్నారు. కానీ కోళ్లు..మేకలు కోసిన చోట ధనుష్ వాటిని ఆరగించాడా? లేక వెజ్ మీల్స్ కే పరిమితమయ్యారా? అన్న చర్చ జరుగుతోంది. ఆ సంగతి పక్కన బెడితే ధనుష్ ఇలా స్వగ్రామం వెళ్లి అక్కడ గ్రామస్తులతో మమేకం అవ్వడం పట్ల నెటి జనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏ హీరో అయినా సినిమా సక్సెస్ అయితే? కుటుంబంతో ఫ్యామిలీకి విదేశాలకు వెకేషన్ పేరుతో చెక్కేస్తారు. స్వగ్రామం వైపు చూసే ఆలోచన కూడా చాలా మందికి రాదు. కానీ ధనుష్ మాత్రం అందకు భిన్నమని చూపించారు.
ధనుష్ మాత్రమే కాదు సూర్య, కార్తీ, విశాల్ లాంటి హీరోలు కూడా అంతే నిరాడంబరంగా ఉంటారు. ఆప్యాయంగా అభిమానులు పెళ్లిళ్లకు ఆహ్వానిస్తే తప్పక హాజరవుతుంటారు. నూతన వధూవరులను ఆశీర్వదించి కానుకలు సమర్పించి వస్తుంటారు. సామాజిక కార్యక్రమాల్లోనూ అంతే చురుకుగా పాల్గొంటారు. డబ్బు రూపంలో విరాళం ఇచ్చి ఊరుకోరు. అవసరమైతే వాళ్లే లుంగీ ఎగ్గట్టి బరిలోకి దిగుతారు. అదే కోలీవుడ్ నటుల ప్రత్యేకత.
